వరుసగా రెండు సంవత్సరాలు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన నటిని… పాతికేళ్ల తరువాత చూడటం, పలకరించడం, ఏమైపోయావ్ అని పరామర్శించడం బాగానే ఉంటుంది… కాదు, బాగుంటుంది… ఈమె పేరు అర్చన… సినిమా కొలనులో ఒకప్పుడు విరిసిన నల్లకలువ… నిజమే, 25 ఏళ్లుగా అయిపూజాడా ఎవరికీ తెలియదు… పెద్ద తెర లేదు, చిన్న తెర లేదు… అసలు తెరకే దూరంగా ఉంది… ఆలీ మొత్తానికి నాలుగేళ్లు కష్టపడి, అడిగీ అడిగీ ఆమెను తీసుకొచ్చి తన షోలో కూర్చోబెట్టాడు… గుడ్…
సోది ఇంటర్వ్యూలు గాకుండా ఆలీ ఇలాంటివి చేస్తేనే బాగుంటుంది… విషయానికొస్తే… ఈ షోలో ఆమె ఒక మాట అన్నది… ‘‘నేను ఇంకా జాతీయ అవార్డు నీడలోనే ఉన్నాను’’ అని… నిజం… 25 ఏళ్లుగా సినిమాలు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు ఏవేవో పెద్దగా కన్విన్సింగు కారణాలు చెప్పలేకపోయింది… తనకు దక్కిన ఆ జాతీయ అవార్డు స్థాయి పాత్రలు రాకపోవడంతోనే సినిమాలు చేయలేదు అనేది పెద్దగా మెప్పించే జవాబు కాదు… కాకపోతే ఆమె చెప్పిన ఆ మాటే నిజం… ఆమె ఈరోజుకూ జాతీయ అవార్డు నీడలోనే ఉండి, దాన్ని ఇక దిగలేని స్థాయి అని భావించి, భ్రమించి అక్కడే ఉండిపోయింది… అందుకే వెండితెరకు దూరమైంది… అదే నిజం…
అయితే ఈ షోలో చెప్పుకోతగిన అంశాలేమీ లేవా..? ఉన్నయ్… అర్చన (అసలు పేరు సుధ) స్ట్రెయిట్ ఫార్వర్డ్… అందుకే ఏం చెబితే ఏం వివాదం క్రియేటవుతుందో అనే భావన తనకు లోలోపల బలంగా ఉంది… అందుకే ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నట్టుంది… ఇది ఆలీ షో కాబట్టి వచ్చింది… అదీ తను ఓ పెద్ద తెలుగు సినిమాను అంగీకరించింది కాబట్టి, ఇక తెర మీద మళ్లీ కనిపించకతప్పదు అనుకుని వచ్చినట్టుంది… హైదరాబాద్‌కు రావడమే 25 సంవత్సరాల తరువాత…
Ads
నిజానికి 45, 50 ఏళ్లు పైబడిన వారికే అర్చన బాగా తెలుసు… అప్పట్లో అర్చన అంటే దాసి, మట్టిమనుషులు… నిరీక్షణ… తమిళంలో వీడు… వీటిలో వీడు, దాసి ఆమెకు అవార్డులు తెచ్చిపెట్టాయ్… మళ్లీ బాగా గుర్తొచ్చేది లేడీస్ టైలర్… వంశీ సినిమా… ఆ సినిమా పేరు తలుచుకోగానే గుర్తొచ్చేది సుజాత, మై మర్జాత, జతొజడ, జమజచ్చ వంటి పదాలు… ప్లస్ అర్చన కూడా…!

తరువాత మాయం అయిపోయింది… నిజానికి సినిమాల మీద ఆమె అంచనాలోనే ఏదో తేడా ఉన్నట్టుంది… పారలల్ సినిమాలు మన ఇండస్ట్రీలో తక్కువ… మంచి పాత్రలు తక్కువ అనేది నిజం కాదు… తనే ఓ ఎత్తు మీద కూర్చుని, కిందకు రాను అని భీష్మించుకుంది… కానీ బోలెడు మంచి పాత్రలు, బోలెడు పారలల్ సినిమాలొచ్చాయి… ఓ మూగ, చెవిటి పాత్ర చేయాలి, ఓ కర్నాటక సింగర్ పాత్ర చేయాలి, తనలోని శాస్త్రీయ నాట్యగత్తెను చూపించగలిగే పాత్ర చేయాలి… ఇవీ ఆమె డ్రీమ్స్… అసలు ఆమె ఫీల్డులో ఉంటే కదా, అవి వచ్చేవేమో… ఎవరైనా ఆమె కోసమే రాసి, పలకరించేవాళ్లేమో…
కానీ నలుపు అనే పాయింట్ దగ్గర ఆమె మాటలు మాత్రం భలే నచ్చేట్టుగా ఉన్నయ్… ‘‘మనం భారతీయులం, పైగా దక్షిణాది ద్రవిడులం… ఎస్, నలుపు నా ఐడెంటిటీ… నా ప్రైడ్… నలుపంటేనే నేను… అది నాకు మైనస్ అని ఏనాడూ అనుకోలేదు… తెలుపు వోకే… కానీ నలుపు అమ్మాయిలు వస్తే కెమెరామెన్లకు లడ్డూలు తిన్నట్టే… అంత ఇష్టపడతారు… డార్క్ అమ్మాయిల ఫీచర్స్‌ను ఎలా అంటే అలా మల్చుకోగలరు… మన ఫీల్డులో ఫైనెస్ట్ యాక్టర్స్ ఎవరూ అని చూస్తే మెజారిటీ నలుపే…’’ ఇవీ ఆమె మాటలు… అదీ కలర్‌ను చిన్నతనంగా చూడకుండా… ప్లస్‌గా భావించడమే కరెక్టు…

మొదట్లో ఆమెను అందరూ రిజెక్ట్ చేశారు… తనే చెబుతోంది తను మొదట్లో అందరికీ ఓ రిజెక్టెడ్ ఫేస్ అని… ఫోటోలు తీయడం, తిరస్కరించడం… అలాంటిది అదే మొహంతో దర్శకుడు బాలూ మహేంద్ర రెండు జాతీయ అవార్డులను ఆమె చేతుల్లో పెట్టాడు… సో, దర్శకుడిలో దమ్ముండాలే గానీ పాత్రధారుల కలర్ అనేది ఓ ఇష్యూయే కాదు… తెల్లతోలు ఓ ప్లస్ అర్హతే కాదు…
అర్చన తెలుగమ్మాయే… చిన్నప్పుడే చెన్నై వలసవెళ్లింది ఆ కుటుంబం… ఓ దఫా నేషనల్ అవార్డుల జ్యూరీ సభ్యురాలిగా చేసింది… తను స్ట్రాంగ్, స్ట్రెయిల్ ఫార్వర్డ్… కానీ తన లౌక్యరాహిత్యమే తనను ఫీల్డుకు దూరం చేసిందేమో… అయిదారు భాషల్లో మంచి సినిమాలు చేసిన ఆమె, మంచి టేస్టున్న ఆమె… సినిమాలకు ఇన్నేళ్లూ దూరం కావడం తెరకు కొంత నష్టమే… కానీ ఫీల్డులోకి బోలెడు మంది వస్తుంటారు, పోతుంటారు… కొందరు తమ ముద్రల్ని బలంగా వేయగలరు… అలా వేయాలంటే నాలుగు రోజులు ఓపికగా నిరీక్షించాలి… ప్చ్… ఈ నిరీక్షణ ఫేమ్ నటి అలా కొన్నాళ్లు నిరీక్షించలేకపోయింది… లేకపోతే మరో దాసి, మరో నిరీక్షణ, మరో వీడు వచ్చి ఉండేవేమో…!
Share this Article