జైభీం సినిమాలో సినతల్లి… అలియాస్ ఒరిజినల్‌గా పార్వతమ్మ… ఆ సినిమా తీశారు కాబట్టి ఆమె గురించి చెప్పుకుంటున్నాం, ఆమె కులంపై పోలీసుల క్రౌర్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆమె కుటుంబానికి జరిగిన నష్టం తెలుసుకుంటున్నాం, ఇలాంటి కథలెన్నో, వ్యథలెన్నో అని బాధపడుతున్నాం… లేకపోతే ఆమె కథ చరిత్రపుటల్లో అనామకంగా మరుగునపడి పోయేది… నిజానికి ఒరిజినల్ కథకు సినిమా రచయిత కమ్ దర్శకుడు క్రియేటివ్ లిబర్టీ తీసుకుని చాలా మార్పులు చేసుకున్నాడు, తప్పదు, ఏ కథయినా ఆసక్తికరంగా చెబితే జనానికి ఎక్కేది… ఆమె ప్రస్తుత బతుకు ఏమిటో మనం నిన్న చెప్పుకున్నాం కదా… కానీ ఆమె కథ అంత చిన్నది కాదు… మిత్రుడు Gurram Seetaramulu ఏం రాశాడో యథాతథంగా చదివేయండి…
ఈ పార్వతమ్మ కథ చిన్నది కాదు… జైభీం సినిమా జస్ట్ టిప్ అఫ్ ఐస్ బర్గ్. రాసకన్ను మరణాంతర విషాదం తీస్తే మరో రెండు సినిమాలకు సరిపోగా ఇంకా మిగిలే కథ. కానీ పార్వతమ్మ అనుభవించిన వ్యథ వింటుంటే పది సునామీలు ఒకేసారి దాడిచేసినట్టు అనిపించింది. సినిమాలో చూపినట్టు వాళ్లది పాములు పట్టే జాతి కాదట, గిరిజనులం కాదు, మేం దళితులం అని ఆమె అల్లుడు చెబుతున్నాడు. ఆ సంఘటన జరిగే నాటికి వాస్తవానికి ఆమె కడుపుతో లేదట. ఆ సంఘటనలో తన భర్తతో బాటు ఆమెను కూడా బాగా కొట్టారట. ఆ దెబ్బలు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయని చెబుతోంది. లాక్‌అప్‌లో అతను చనిపోయిన విషయం ముందే తెలుసట. అప్పటికే నలుగురు పిల్లలు. అందులో ఒకడు ఆ సమయంలోనే పోయాడట. ఇద్దరు మానసికంగా డిస్త్రబ్ అయ్యారు…
Ads
పార్వతమ్మకు రాసకన్ను మేనబావ. ఆమెకన్నా భర్త ఐదేళ్ళు చిన్నవాడు. చనిపోయే నాటికి ఆయనకు ముప్పై ఐదు, యామెకు నలభై ఏళ్ళు వాళ్ళకు మొత్తం నలుగురు పిల్లలు అంటే ఒకరు కడుపులో ఉండగానే ఈ విషాదం జరిగింది. ఆ సంఘటన జరిగే సమయానికి ఒక కొడుకుకి పదేళ్ళు. పోలీసులు అతన్ని కూడా బాగా కొట్టారని ఆమె చెబుతోంది. ఆ దెబ్బలకు ఆ పిల్లవాడు పిచ్చివాడు అయ్యాడట. కేసు పూర్తి అయ్యాక ఆమెకు ఇల్లు, నష్టపరిహారంగా లక్ష మాత్రమే ఇచ్చారట. వరదల్లో ఆమె ఇంటితో బాటు మరి కొందరివి కూడా కొట్టుకొని పోయాయట. మళ్ళీ ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఒక పాడుబడ్డ టార్పాలిన్ గుడిసెలో ఉంటోంది దానికి నెలకు రెండు వేల రూపాయలు రెంటు. రాసకన్ను మీద మోపిన అభియోగంలో చోరీ సొత్తు మొత్తం నలభై తులాల బంగారం, డెబ్బై లక్షల రూపాయలు అట (అంత సొమ్ము బుద్ది ఉన్నవాడు ఎవడూ ఇంట్లో పెట్టుకోడు) ఆ రాత్రి తీసుకొని పోయారు తనను, రెండు రాత్రులు వరసగా టార్చర్, మొదటి రోజు బ్రతికే ఉన్నాడు, రెండో రోజు చనిపోయాడు.
ఆ రాత్రి శవాన్ని మాయం చేసారు. అసలు సినిమాలోకన్నా ఘోరంగా కొట్టారట వాళ్ళను. చనిపోయాడని తెలిసాక గొంతులో మందు పోసారట. నిజానికి రాసకన్ను చనిపోయిన మూడే రోజే ఆ సొమ్ము రికవరీ అయ్యిందని పార్వతమ్మ అల్లుడు చెబుతున్నాడు. ఒక ఆడమనిషి ఆ దొంగతనం చేసిందట. ఆమెను ఎవరూ ఏమీ అనలేదట. ఈ లాక్‌అప్ డెత్ విషయంలో హెల్ప్ చేసినాయన పేరు గోవిందు. ఈ కేసు అయ్యేదాకా పెళ్లి చేసుకోలేదట. కేసు గెలిచాకనే ఆయన పెళ్లి చేసుకున్నాడట. ఇందులో లాయర్ చంద్ర కన్నా కార్యకర్త గోవిందు కుటుంబం ఎక్కువ సహాయం చేసాడని చెబుతోంది. ఆ కేసులో శిక్ష పడిన ముగ్గురిలో ఒకతను చనిపోయాడట. ఇద్దరు ఇంకా పెన్షన్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం పార్వతమ్మ కూతురు అల్లుడుతో ఉంటోంది. ఇద్దరు మగపిల్లలు మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఉన్నారట. ఇది అసలు కథ…
సినిమా మొత్తం లాయర్ చంద్రం నెరేషన్ ఆధారంగా తీసారట. సినిమా విడుదల అయ్యాకనే వాళ్ళకు తెలిసిందట. ఆమె ఆరోగ్యం బాలేదు. పోలీసుల టార్చర్ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయట. పోలీస్ స్టేషన్ లో చనిపోయిన మరుసటి రోజు రాత్రి శవాన్ని మాయం చేసారట. ఆ సినిమా చూసిన రోజు నుండీ పార్వతమ్మ నా కళ్ళలోనే మెదులుతోంది. చానా ముఖ్యమైన పనుల్లో ఉన్నా ఒక వ్యాసంగా రాయాల్సిన స్టఫ్ ఇది. ఇప్పుడు చెప్పండి ఆమె అనుభవించిన క్షోభను కొలిచే యంత్రం మీ దగ్గర ఉందా ? ఆ పీడన ట్రోమా తీసే దమ్ము మనకు ఉందా ? ఇప్పుడు ఎన్ని కోట్లు ఇస్తే ఆమె కలల ముద్దుల మేనబావను తిరిగి ఇవ్వగలం ? నాకు తమిళం రాదు, కాలిఫోర్నియాలో ఉన్న ఒక మిత్రురాలు సౌజన్య నిద్రపోకుండా అర్దరాత్రి అయినా సరే మెలకువతో ఉండి, ఓపికతో చెప్పింది. తీరా తెలిసింది సౌజన్య తండ్రి ఒకనాడు నేను నమ్మే రాజకీయాల పట్ల నమ్మకం, ఆచరణ ఉన్న మిత్రుడే అని…!!
ఇది తెలంగాణాలో రీసెంట్ వార్త … I can’t breath… అనే ఓ అమెరికన్ బ్లాక్ pathetic మాటలు గుర్తొస్తున్నయా… కాలం ఏమీ మారలేదు…!! దేశాలన్నీ ఒక్కటే…!!
Share this Article