Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గొర్రె పిల్ల… మళ్లీ మన తెలంగాణ పల్లె జీవనంలోకి వచ్చేసింది…

November 4, 2023 by M S R

విను తెలంగాణ – గొర్రె ప్రవేశించిన వైనం… గత శనివారం ఇదే రోజు వనపర్తి జిల్లా పెబ్బేరు సంతలో ఒక విశేషం గమనించాను. చాలా మంది రైతులు ఆ సంతలో రెండు మూడు గొర్రెలను కొనుగోలు చేసుకొని ఇంటికి తీసుకెళ్లడం గమనించాను.

ఒక తండ్రి, అతడి కొడుకు చెరొక మేకను భుజంపై వేసుకుని వీధుల్లో దర్పంగా వెళుతుంటే ఆసక్తిగా గమనించాను. ఒక నానమ్మ మూడు గొర్రెలను కొనుక్కొని ఎంతో సంతోషంగా వెళ్ళడం చూశాను. ఒక నానమ్మ, అమ్మ, మనవడు చెరొక గొర్రె పిల్లను కొనుగోలు చేసి తమ ఊరికి వాటిని ఉత్సాహంగా కొట్టుకుంటూ వెళ్ళడం చూశాను. ఇట్లా – మందకు మంద కొనేవాళ్ళు కారు. కేవలం రెండు మూడు గొర్రెలను కొనుగోలు చేసుకుని పెంచుకునేవాళ్ళ ఎంతో మంది కాన వచ్చారు. గొర్రెలను ‘పెంపకానికి’ ఇలా తీసుకెళ్ళే మనుషులతో ఆ సంత నిండి ఉండటం విశేషంగా కనిపించింది. వారంతా రైతులు అని తర్వాత బోధపడింది.
ఒక గొర్రెకు ఆరు వేలు మొదలు బాగా ఎదిగిన గొర్రెకు పన్నెండువేల దాకా ధర పలుకుతోంది. ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలు కూడా అమ్మకానికి ఉన్నాయి, ఈ గొర్రెల కొనుగోలులో అత్యధికులు మహిళలే కావడం మరింత ఆసక్తి కలిగిందింది.
ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇదంతా తెలంగాణా రాష్ట్రం వచ్చాక తిరిగి మొదలైన సంబురంగా బోధపడింది. అది మిషన్ కాకతీయ కావొచ్చు, ఎత్తి పోతల పథకాల ద్వారా కాలువలు దాదాపు పూర్తవడం కావొచ్చు, గ్రామాల్లో నీటి వనరులు పెరగడం, దానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరగడం. ఆ క్రమంలో పొలాలు పచ్చదనంతో కళకళ లాడటం, మెల్లగా రైతులు ఆర్థిక స్థితిగతులు మెరుగవడం- ఇదంతా ఈ దశాబ్దంలో సానుకూల మార్పు అనుకుంటే, రైతాంగం పొలం పని చేసుకోవడంతో పాటు అలవోకగా ఒకటి రెండు గొర్రెలను పెంచుకోవడం మరొక చెప్పుకోదగ్గ మార్పుగా నమోదవుతున్నది.
గొల్ల కురుమలు మందలకు మందలు గొర్రెలు మేకలను పెంచడం, ప్రభుత్వం సబ్సిడీపై పెద్ద ఎత్తున వాటిని సరఫరా చేయడం, దాంతో మాంస విప్లవం దాన్ని ‘పింక్ రివల్యూషన్’గా ప్రభుత్వం చెప్పడం మనం విన్నదే. కానీ రైతు కులాలు ఇలా వ్యక్తిగతంగా గొర్రెలను పెంచడం అన్నది నాకు అంతకన్నా నచ్చిన చిరు విప్లవం.
నిజానికి కరువు కాటకాలు లేనప్పుడు, బాగా నీళ్ళు ఉన్నప్పుడు దశాబ్దాల క్రితం ప్రతి రైతు ఇలాగే ఏ మాత్రం భారం కాకుండా కోళ్ళు, గొర్రెలు, మేకల పెంచేవాడు. ఇప్పుడూ అదే సంస్కృతి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణా వ్యాప్తంగా తిరిగి కానవస్తోందని తెలుస్తోంది. అందుకు పెబ్బేరు సంత ఒక నిదర్శనం.
ప్రతి రైతు కుటుంబం వ్యవసాయంతో పాటు ప్రతి ఏటా రెండు మూడు సార్లు ఇలా మేకలను, గొర్రెలను కొనుగోలు చేసికొని, వాటిని మూడు నాలుగు నెలలు పెంచి, బాగా ఎదిగాక అమ్మేస్తూ వస్తున్నారు. అలా ఆరువేలు పెట్టుబడి పెట్టి పన్నెండువేల దాక లాభం గడిస్తున్నారు. ఇందులో మహిళలే ఎక్కువ.
సాధారణంగా మహిళలు వృద్దాప్యంలో అడుగుపెడుతున్న సమయంలో స్వతంత్రంగా ఉండాలని భావిస్తారు. చూస్తుండగానే తమ బిడ్డలు పెద్దవడం, వారిపై చిరు ఖర్చులకు ఆధారపడకుండా ఉండటం కోసం – ఇలా రెండు మూడు గొర్రెలను పెంచుకుని అమ్ముతూ కొంత ఆదాయాన్ని పొందుతారని తెలిసింది. అట్లా తాము అమ్మమ్మలు, నానమ్మలు కూడా అయ్యారు కాబట్టి మనవలు, మనవరాండ్లకు ఏమైనా చిల్లర డబ్బులు ఇవ్వాలన్నా, పండుగలు – పబ్బాలకు ఇంటికి వచ్చిన బిడ్డలకు ఏదైనా సంతోషంగా పెట్టాలన్నా కూడా ఈ చిరు ఆదాయం వారికి ఎంతో ఉపయోగం.
అంతేకాదు, తమ బిడ్డలు, మనవులు మనువరాండ్ల వయసు పెరగడంతో ఈ తల్లుల అనురాగం, ఆత్మీయతను పంచుకుని ఈ గొర్రెలు బిడ్డలా మాదిరిగా ఆనందంగా ఎదుగుతాయి. చిన్నపిల్లల వంటి ఈ గొర్రెలు ఆ తల్లుల్లో మాత్వుత్వపు భావనను తట్టి లేపుతై. దాంతో ఈ మూగ జీవులైన గొర్రెలను చూసుకోవడంలో ఆ తల్లులు ఎనలేని ఆనందానికి గురవుతారని తెలిసింది. ఒక్కోసారి సంతలో వీళ్ళు అప్పుడే పుట్టిన చిన్న గొర్రె పిల్లలను కూడా కొనుగోలు చేయడమే కాకుండా వాటికి పాలు పట్టడానికి గాను ఆ తల్లులు మెడికల్ షాపుల్లో పాల సీసా ఒకటి కొనుక్కుని వెళ్ళడం కూడా నేను గమనించాను.
బడికి వెళ్ళే పిల్లలు కూడా ఇలా గొర్రెలు మేకలను పెంచుకొని పాకెట్ మనీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక రకంగా గొర్రెలు వాళ్లకు సజీవ కిడ్డీ బ్యాంకు అనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మి ఆదాయం పొందే వెసులుబాటు ఉన్నది మరి! కాగా, సంతలో తెచ్చుకున్న గొర్రె ఇంటికి చేరేలోగా మాలిమి అవుతుందట. ఆ తర్వాత వాటిని ఇంటివద్ద కట్టేస్తారు. తర్వాత పొలానికి వెళ్ళినప్పుడు తమతో అడుగులు వేస్తూ అవి అక్కడకూ చేరుకుంటై. అట్లా మేకలు రైతుల పని పాటల్లో వెన్నంటే ఉంటాయి. వాటి ‘గొద్దె’ కూడా పొలంలో ఎరువుగా ఉపయోగపడటం మరో విశేషం.
ఇట్లా గ్రామీణ జీవితంలో గొర్రె తిరిగి ప్రవేశించి అమాయకంగా చేసే వాటి అందమైన నృత్యం మారుతున్న జీవనానికి నాందీ సూచకంగా అనిపించింది. ఈ అందమైన మార్పు మూడు పువ్వులు ఆరు కాయలుగా మనం పోల్చుకోలేనన్ని వందల రూపాల్లో ఎదిగి బ్రతుకు సంతోష భరితం కావాలని అభిలాష. అందుకే ఈ మార్పు పంచుకోవాలనిపించింది… కందుకూరి రమేష్ బాబు Samanyashastram Gallery

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions