Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి శేషేంద్ర రాసిన ఓ పాటను సినిమా యూనిట్ తీసేసిందట..!!

July 15, 2025 by M S R

 

Abdul Rajahussain  …….. బాపు గారి దర్శకత్వంలో 1975, జులై 25న విడుదలైన “ముత్యాల ముగ్గు” సినిమాలో గుంటూరు శేషేంద్రశర్మ గారు ఒక పాట రాశారు. ఆ పాట సూపర్ హిట్టైంది… ముత్యాలముగ్గు అనగానే శేషేంద్ర రాసిన పాటే చప్పున గుర్తొస్తుంది. అంతగా ఆ పాట జనాదరణ పొందింది…

ఈ సినిమాతో పాటు, ఈ పాటకు కూడా ఇప్పుడు యాభై యేళ్ళు నిండుతున్నాయి. అంటే శేషేంద్ర “స్వర్ణోత్సవ”పాట అన్న మాట… ఈ పాట గురించి ఓసారి తెలుసుకుందాం…!!

Ads

అన్నట్టు… తను రాసిన ఏకైక తెలుగు సినిమా పాట ఇది అనేది కొంత సత్యం… ఎందుకంటే..? మరోపాట కూడా బాపు కోసమే రాసినా, చివరకు అది సినిమాలో ఉంచలేదు, తీసేశారు… అంతటి శేషేంద్రుడి పాటనే తీసేశారంటే అప్పట్లో హాశ్చర్యమే…


“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటుందని
నావకు చెప్పండి నావకు చెప్పండి”


ఇదీ ఆ పాట… ఇది విషాదగీతిక. సినిమాలో నాయిక సంగీత మీద చిత్రీకరించారు. రాజమండ్రి గోదారి రేవు వద్ద పాట చిత్రీకరణ జరిగింది.. అశోకవనంలో సీతమ్మ రాముడి కోసం శోకంతో ఎదురు చూస్తున్నట్టు ఈ సినిమాలో సంగీత తన భర్త శ్రీధర్ కోసం ఎదురు చూస్తూ, శోకతప్తయై ఈ పాటను పాడుతుంది….

శేషేంద్ర శర్మగారు ఎప్పుడూ సినిమా పాటలు రాయలేదు. ఈ పాట రాయడం వెనుక ఓ ఆసక్తి కరమైన ఓ నిజ కథ వుంది…. కథానాయకుడి ప్యాలెస్ కోసం హైదరాబాద్లోని ఇందిరా ధన్‌రాజ్ గిరి (జ్ఞాన్ బాగ్ ) ప్యాలెస్ ను చూడటానికి చిత్రరచయిత ముళ్ళపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు గారిని వెంటబెట్టుకొని వచ్చారు చిత్ర నిర్మాత ఎమ్వీఎల్ గారు…

వాళ్ళకు ప్యాలెస్ నచ్చింది. షూటింగ్ చేసుకోవచ్చుఅంటూ రాణి ఇందిరా ధన్‌రాజ్ గిరి పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే ఓ కండీషన్ పెట్టారట. ఈ సినిమాలో శేషేంద్ర చేత ఓ పాట రాయించాలన్నది ఆ కండీషన్… అయితే అప్పటికే పాటలన్నీ ఫైనల్ చేసుకొని రికార్డింగ్ కూడా చేశారట… మరో పాటకు అవకాశం వుంటుందో లేదో మద్రాసుకు వెళ్ళాక చెబుతాం.

లేకపోతే తర్వాత తీసే సినిమాల్లో అవకాశం ఇస్తామన్నారట… అన్నమాట ప్రకారం మద్రాసు వెళ్ళాక పరిశీలించి, కథానాయిక మీద ఓ విషాద గీతాన్ని అదనంగా చిత్రీకరిద్దామని నిర్ణయించారట. వెంటనే మద్రాసుకు రమ్మనీ శేషేంద్రకు కబురు పెట్టారు. శేషేంద్ర మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఓ హోటల్ లో బస ఏర్పాటు చేశారు.

అయితే… శేషేంద్ర ఆరోగ్యం వికటించింది… తీవ్ర జ్వరంతో ఆయన చాలా రోజులు బాధపడ్డారు. ఇంత అస్వస్థతలో కూడా ఆయన ఈ పాటను రాశారు… సంగీత దర్శకులు కె. వి మహదేవన్ ను వెంటబెట్టుకొని,  బాపు, రమణ, ఎమ్వీఎల్ హోటల్ రూంకు వచ్చారు. శేషేంద్ర తాను రాసిన పాటను మహదేవన్ కు ఇచ్చారు…

shesendra sharma

ఇందులో ఏమైనా మార్పు చేర్పులు కావాలంటే చేస్తాను అన్నారట శేషేంద్ర.. పాట చాలా బాగుంది. దీన్ని యథాతధంగానే ట్యూన్ చేద్దామన్నారట.. అలా ఆ పాట రికార్డింగ్ పూర్తైంది.. షూటింగ్ కూడా చేశారు. శేషేంద్ర కూడా ఆ షూటింగ్ కు వెళ్ళారట.. ఆ తర్వాత ఇందిరా ధన్ రాజ్ గిరి మహల్లో షూటింగ్ జరిపారు .ఆ షూటింగ్ నిమిత్తం కిరాయి కింద పాతిక వేల రూపాయలను చెల్లించింది చిత్ర యూనిట్…!

ఆ తర్వాత సినిమా విడుదలైంది. సినిమా హిట్ అయింది. శేషేంద్ర పాటకు మంచి పేరొచ్చింది…. ఆ తర్వాత బాపు గారు తీసిన సీతా కల్యాణంలో ఓ పాట రాయిద్దామని శేషేంద్రను మళ్ళీ మద్రాసుకు పిలిపించారు. (1976, జనవరి)హోటల్లో బస ఏర్పాటు చేశారు. సీతమ్మ చిన్నప్పుడు ఆటలాడుకునే సందర్భం ఆ పాట..

శేషేంద్ర పాటరాసిచ్చారు. పాట రికార్డ్ అయింది..శేషేంద్ర హైదరాబాద్ కు వచ్చేశారు.. 1976, ఫిబ్రవరిలో పని మీద మచిలీపట్నం పోతూ… విజయవాడ మనోరమ హోటల్ లో ఆగారు ఆయన. ఎమ్వీఎల్ హోటల్ రూంకొచ్చి శేషేంద్రను కలిశారు.. మాటల సందర్భంలో సీతాకల్యాణంలో మీరు రాసిన పాటను తీసేశారని చెప్పారు.. శేషేంద్ర నిరుత్సాహ పడ్డారు..

ఇక ఆ తర్వాత శేషేంద్ర సినిమాల జోలికి పోలేదు. అయితే ఈ విషయంలో శేషేంద్రకు ఆ సినిమా యూనిట్ కు, ముఖ్యంగా ముళ్ళపూడి వెంకట రమణకు మధ్య మనస్పర్ధలొచ్చాయట.. ఆ తర్వాత శేషేంద్రపై, ఆయన సాహిత్యంపై ముళ్ళపూడి వారు తీవ్ర విమర్శలు గుప్పించారట.. దానికి శేషేంద్ర ఎదురు సమాధానం కూడా చెప్పారట…

*పాట విశ్లేషణ…!
శేషేంద్ర అక్షరాలను విషాదంలో ముంచి మరీ ఈ పాట రాశారు.. నాయిక మనఃస్థితిని నిదురించే తోటగా అభివర్ణించడం కొత్తప్రయోగం. అలా నిదురపోతున్ప తోటలోకి ఓ శుభవార్త పాట రూపంలో వచ్చింది… నాయిక కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇవ్వడం నిజంగా గొప్ప భావన…

గోదారొడ్డున నాయిక కుటీరం వుంది.. తనకు తెలిసిన శుభవార్త పాటై వచ్చి రమ్యంగా కుటీరాన రంగవల్లులద్దడం. దీనురాలి గూటిలోన దీపంగావెలగడం.. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలవడం. ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేయడం ఓ గొప్ప దృశ్య సాక్షాత్కారంగా నిలిచింది.

sangeetha

ఇక విఫలమైన ఆమె కోరికలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయట. కొమ్మల్లో పక్షులారా! గగనంలో మబ్బుల్లారా నది దోచుకుపోతున్న (కోసుకుపోతున్న) నావను ఆపండి.. రేవు బావురుమంటుందని నావకు చెప్పండి అనడం నాయిక హృదయవిదారక పరిస్థితికి అద్దం పట్టింది.

దర్శకుడు బాపు గారు ఈ పాటకు తగ్గట్టు చిత్రీకరించి.. పాటను మరింత రక్తి కట్టించారు.. అయితే ఈ పాట మీద ఓ కథ ప్రచారంలో వుంది. శేషేంద్ర గారు సినిమా కోసం ప్రత్యేకంగా ఈ పాటను రాయలేదని, అంత కుముందు తాను రాసిన గీతాల్లో ఒకదానిని తీసుకొని ఈ పాటగా మలిచారని చెబుతారు.. ఇది నిజం కాదు..

శేషేంద్ర సినిమా కోసమే ఈ పాటను రాశారని ఆయన కుమారుడు సాత్యకి స్పష్టం చేశారు. అంతకు ముందే ఈ పాట రాశారన్నది నిజం కాదన్నారు.. ఈ పాట రాసే సమయంలో సాత్యకి కూడా తండ్రితో పాటే మద్రాసులో వున్నారట. సో.. ఈ పాటమీదున్న అపోహలు పటాపంచలైనట్లే… తెలుగు సినిమాల్లో ‘ఒకే ఒక్క’ పాట రాసిన కవిగా శేషేంద్ర నిలిచారు…

ఈ పాటకు స్వర మాంత్రికుడు కె. వి. మహదేవన్ బాణీ కట్టగా, పి సుశీల పాడారు. యాభై యేళ్ళైనా ఈ పాట తెలుగు వారి గుండెల్లో నిలిచిందంటే…, ఆ పాటలోని సాహిత్యపు విలువలే కారణం..!! ఎ. రజాహుస్సేన్..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!
  • ఆర్ఎస్ఎస్ ముద్ర..! నలుగురు కొత్త ఎంపీలు, ముగ్గురు గవర్నర్లు..!!
  • అంతటి శేషేంద్ర రాసిన ఓ పాటను సినిమా యూనిట్ తీసేసిందట..!!
  • గుట్కా, సిగరెట్, బీడీ మాత్రమే కాదు… జిలేబీ, సమోసా అమ్మకాలకు కూడా..!!
  • జస్ట్, రవీంద్ర జడేజా మెరుపులు… అంతే, టాప్ బ్యాటర్ల ఫెయిల్యూర్…
  • బాబు గారి మీడియాకేనా తెలంగాణ సర్కారీ యాడ్స్ పందేరం..?
  • కంచం పొత్తు – మంచం పొత్తు…. తెలంగాణ సమాజంలో ఎడతెగని చర్చ…
  • ఫాఫం సాక్షి… కోట శ్రీనివాసరావును ఇలా అవమానించడం దేనికి..?!
  • రాజువయ్యా మహారాజువయ్యా…. నటనలో, ఈ పాత్రల్లో, ఈ కథనాల్లో…
  • ఒకప్పటి లేడీ సూపర్ స్టార్… అగ్ర హీరోలందరికీ తెరపై ఇష్టసఖి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions