.
నవ్వులు కురిపించడమే కాదు.. గుండెను మెలిపెట్టడమూ తెలుసు
… జంధ్యాల గారంటే కామెడీకి ట్రేడ్ మార్క్ అంటారు కానీ, తెలుగు సినిమాల్లో ఆయనలా సెంటిమెంట్ సీన్లు రాయగలిగిన మరో రచయిత కనిపించడు. నవ్వులు కురిపించడమే కాదు, గుండెను మెలిపెట్టడమూ తెలిసిన రచయిత ఆయన. నిజం!
‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘ఆపద్బాంధవుడు’, ‘అబ్బాయిగారు’.. చెప్తూ పోతే బోలెడు. ‘అహ నా పెళ్లంట’ లాంటి క్లాసిక్ కామెడీ ఫిల్మ్‌లో కూడా రాజేంద్రప్రసాద్, నూతన్‌ప్రసాద్‌ల మధ్య తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను అద్భుతంగా పండించారు.
Ads
‘ష్.. గప్‌చుప్’ అని జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమా. మల్లాది వెంకట కృష్ణమూర్తి అదే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. కథ బాగుంటుంది కానీ తెర మీద చూసేంత గొప్పగా ఉండదు. కాబట్టి సినిమా పెద్దగా ఆడలేదు.
పైగా జంధ్యాల మార్క్ క్యారెక్టర్లు, కామెడీ కూడా మిస్సవడంతో అసలీ సినిమా ఆయన తీశారన్న విషయమే చాలామందికి తెలియకుండా పోయింది. సినిమాలో భానుప్రియ ప్రధాన పాత్ర పోషించగా, జంధ్యాల సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే ఆర్టిస్టులంతా ఉన్నారు.
సినిమాలో రవళి (భానుప్రియ) తండ్రిగా సుత్తివేలు నటించారు. ఆయనకు మతిస్థిమితం సరిగా ఉండదు. పూర్తిగా పిచ్చివాడని కాదు, కానీ చిన్నపిల్లాడి చేష్టలు. సర్కస్‌లో చేరతానని, పనిమనిషిని ప్రేమిస్తానని అంటూ తిరుగుతుంటాడు. కూతురి కోసం పెళ్లిసంబంధం తెచ్చానంటూ రాత్రిపూట ఒకణ్ని పట్టుకొస్తాడు. అతనికి కాఫీ, టిఫిన్లు పెట్టి ఇంట్లోవాళ్లు మర్యాద చేస్తారు.
అయితే వచ్చినవాడి వాలకం, అతని తీరు చూసిన భానుప్రియ అనుమానంతో ఆరాతీస్తుంది. అతనెవరో దారినపోయే దానయ్య అని, సుత్తివేలు అతనికో పాతిక రూపాయలిచ్చి పెళ్లిచూపులకు తీసుకొచ్చాడని తెలుస్తుంది. మొత్తానికి అతణ్ని గెంటేస్తారు. ‘నీలా ఊళ్లో ఉన్న అందర్నీ ప్రేమించమంటావా నాన్నా?’ అని భానుప్రియ కన్నీళ్లతో తండ్రిని అడిగి లోపలికి వెళ్లిపోతుంది.
సీన్ అక్కడితో కట్ చేయొచ్చు. అలా చేస్తే జంధ్యాల ఎలా అవుతారు? పెరట్లో మంచం మీద పడుకొని ఏడుస్తున్న భానుప్రియ దగ్గరికి తండ్రి సుత్తివేలు వస్తాడు. అప్పుడు డైలాగులు చూడండి.
సుత్తివేలు: అమ్మా! చిన్నప్పుడు డబ్బుల్లేక ఏమీ కొనుక్కుతినలేకపోయాను. ఇప్పుడు లడ్డూలు, జాంగ్రీలు, ఐసులు, కాకినాడ కాజాలు.. అంటుంటేనే నోరూరిపోతోంది. ఇవన్నీ తినాలని కోరిక. కానీ నాకు షుగురుందని అవేవీ మీరు తిన్నివ్వరు. పోనీ తీపొద్దు, పంటి కిందికి ఏ కారప్పూసో, పకోడీనో పడేద్దామన్నా కూడా, వెర్రివాణ్ని కదమ్మా, నాకోసం ఎవ్వరూ ఏదీ చేసిపెట్టరు. జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక, పెళ్లిచూపులని చెబితే, పెళ్లివారికోసం అవన్నీ తెప్పించి పెడతారు, ఎంచక్కా తినేయొచ్చని ఈ పని చేశానమ్మా! ఊరికే, ఉత్తుత్తి పెళ్లిచూపులే గానీ, నిన్నా కళావర్ మొహంగాడికి ఇచ్చి పెళ్లి చేసేవాణ్ని కాదమ్మా! స్వీట్లు తిని, మిఠాయి కిళ్లీ వేసుకున్నాక, ‘నువ్వు నాకు నచ్చలేదు పోరా సన్నాసిగా’ అని చెప్పేసి కోప్పడి వాళ్లని గెంటేద్దామనుకున్నాను గానీ, నా బంగారుతల్లివి.. నిన్ను వాడిని అచ్చంగా నేనెందుకిచ్చేస్తానమ్మా? నిజం.. మా అమ్మమీదొట్టు!
భానుప్రియ: పోన్లెండి నాన్నా! ఏదో జరిగిపోయింది. ఊరుకోండి! పసిపిల్లలకు ఎంత తినాలో, ఎప్పుడు ఆపాలో తెలీదు నాన్నా! మీరూ అంతే! ఎక్కువగా తినేస్తే మీ ఆరోగ్యం పాడవుతుందని అమ్మొద్దంటుంది కానీ, మీకు పెట్టడానికి మాకు బాధేమిటి చెప్పండి? ఇవాళ నేను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానంటే, ఇదంతా మీ వల్ల కాదు.. హు! తినరానివి తిని, రేపు మీ ఆరోగ్యం పాడై, జరగరానిది జరిగిందంటే, మేము దిక్కులేనివాళ్లం అయిపోతాం కద నాన్నా.. ఆ!
సుత్తివేలు: ఇప్పుడు నేనుండీ మీకేం చేస్తున్నాననమ్మా?
భానుప్రియ: ఏమీ చేయక్కర్లేదు నాన్నా! మీరు మా వెనక కొండంత అండగా అలా నిలబడితే చాలు. మాకు పిడికెడు బలం, గుప్పెడు ధైర్యం వస్తాయి.
సుత్తివేలు: ఇప్పుడు నువ్వు నా కన్నీళ్లు తుడుస్తుంటే మా అమ్మ గుర్తొచ్చిందే అమ్మాయ్! నన్నెప్పుడూ ఏడవనిచ్చేది కాదు. చిన్నప్పుడూ మా అమ్మ ఒళ్లోనే పడుకునేవాణ్ని. ఇప్పుడు నీ ఒళ్లో పడుకోవచ్చా అమ్మా? ఆ..!
ఆ తర్వాత భానుప్రియ తన తండ్రిని ఒళ్లో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతుంది.
* *
జంధ్యాల గారు రాసిన అద్భుతమైన సన్నివేశాల్లో ఇదీ ఒకటి. ఈ సన్నివేశంలో కల్లాకపటం లేని అమాయకపు తండ్రిగా సుత్తివేలు, అతణ్ని అర్థం చేసుకునే కూతురిగా భానుప్రియ నటన మీరు చూసి తీరాలి. వాహ్!
ఇద్దరూ అత్యంత సహజంగా నటించారు. కామెడీకి కేరాఫ్ అనిపించుకున్న సుత్తివేలు గారు సెంటిమెంట్ పాత్రలు దొరికితే విజృంభిస్తారు. ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రల్లో ఇదీ ఒకటి. సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల తెలియలేదు. నటించగలిగిన నటులకు సరైన పాత్రలు దొరకాలి. తగ్గ సన్నివేశాలు కుదరాలి. అప్పుడు కదా వాళ్ల ప్రతిభ తెలిసేది. – విశీ (వి.సాయివంశీ)
Share this Article