ఓడను జరిపే ముచ్చట కనరే!
——————–
త్యాగయ్య కీర్తనలు తేనెకన్నా తియ్యనయినవి. ప్రతి పలుకు సంగీత, సాహిత్య, మంత్ర శాస్త్ర సమ్మిళితం. అందుకే త్యాగయ్య కృతులను త్యాగోపనిషత్తులన్నారు. బహుశా ఇంతటి గౌరవం ఇక ఏ ఇతర కీర్తనలకు ఇచ్చినట్లు లేరు. నౌకా చరిత్రము అని త్యాగయ్య ఒక యక్షగానం కూడా రచించి, స్వయంగా ఆయనే పాడి భవిష్యత్ తరాలకు అందించారు.
“ఓడను జరిపే ముచ్చట
కనరే వనితలార నేడు”
Ads
అన్న త్యాగయ్య కీర్తన కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇది సంగీత, సాహిత్య చర్చ కాదు కాబట్టి- మన తెలుగు త్యాగయ్యను తమిళులకు వదిలేసి మనం ఆయన చెప్పిన నౌక విషయానికే పరిమితమవుదాం.
ఇప్పుడంటే కార్లు, బస్సులు, హెలీక్యాప్టర్లు, విమానాలు, రాకెట్లు వచ్చాయి కానీ- రెండు వందల సంవత్సరాల కిందటి వరకు ఎడ్ల బండ్లు, గుర్రబ్బండ్లు, నాటు పడవలు, తెరచాప పడవలు, ఆవిరి పడవలు, నౌకలే ఉండేవి. శ్రీనివాసరామానుజన్, మహాత్మా గాంధీ లండన్ కు ఓడలోనే వెళ్లి వచ్చారు. ఇరవై రోజులు పోను- ఇరవై రోజులు రాను. సాక్షాత్తు కారణ జన్ముడు రాముడు గంగ దాటడానికి గుహుడు నాటు పడవ ఇచ్చాడు. విశ్వామిత్రుడితో రాముడు పడవలోనే తొలిసారి గంగ మీద ప్రయాణం చేశాడు. అప్పటి రాముడి సందేహాలకు సమాధానంగా లోకానికి గంగా జనన, సుబ్రహ్మణ్య జనన వృత్తాంతాలు దొరికాయి. భారతంలో లాహిరి లాహిరి మొన్నటి మాయాబజార్ దాకా అలలపై తేలుతూనే ఉంది.
“నడిపించు నా నావ – నడి సంద్రమున దేవ”
వినని తెలుగువారు ఉండరు. ఇప్పుడు సుయెజ్ కాలువలో అతిపెద్ద నౌక ఇరుక్కుపోయి ప్రపంచ వాణిజ్యం అతలాకుతలమైపోయింది. ఆఫ్రికా- ఆసియాల సముద్ర వాణిజ్య మార్గాన్ని కలుపుతూ 1859 ప్రాంతాల్లో పదేళ్ల పాటు ఎన్నో వ్యయ ప్రయాసలోకోర్చి దాదాపు రెండు వందల కిలోమీటర్ల పొడవున నిర్మించిన కృత్రిమ కెనాల్ సుయెజ్. ఈజిప్టు భూభాగంలో ఉన్న ఈ కెనాల్ మద్యధరా సముద్రాన్ని- ఎర్ర సముద్రాన్ని కలుపుతోంది. యూరోప్ , అమెరికాలకు సరకు రవాణాకు ఈ కెనాల్ గుండెకాయ లాంటిది. అలాంటి కెనాల్లో ఒక అతి పెద్ద జపాన్ నౌక ఇరుక్కు పోయి ఎటూ కదలడం లేదు. అందులో పనిచేసే సిబ్బంది మొత్తం భారతీయులే. పెను గాలులకు ఊగి, ఊగి ఇసుకలో కూరుకుపోయింది. ఇప్పటికే వారమయ్యింది. ఇంకో రెండు వారాలయినా నౌకను కదిలించగలరో లేదో తెలియడం లేదు. సుయెజ్ కెనాల్ ద్వారా ప్రయాణించాల్సిన నౌకలన్నీ ఆగిపోయాయి. కదలని నౌక చేస్తున్న నష్టం గంటకు సగటున మూడు వేల కోట్ల రూపాయలు. నౌక మీద ఉన్న రెండు లక్షల టన్నుల బరువయిన సరుకు దించి, నౌక కింద ఇసుకను రేణువు రేణువు తీసి, హిమాలయమంతటి ఆ నౌకను కదిలించే సరికి ప్రపంచ వాణిజ్యానికి ఎన్ని లక్షల కోట్ల నష్టమొస్తుందో సున్నాలు శూన్యంలో లెక్కకడుతున్నాయి.
త్యాగయ్య ఎంత ముందు చూపు ఉన్నవాడో! సుయెజ్ కాలువలో ఆగిన నౌకలో భారతీయులు/తెలుగువారు పాడుకోవడానికి వీలుగా-
“ఓడను జరిపే ముచ్చట కనరే”
అన్న కీర్తనను రెండు వందల యాభై ఏళ్ల కిందటే రాసి, పాడాడు. మహాత్ముల వాక్కు వృథా పోదు!
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article