.
కార్పొరేట్ ప్రపంచంలో కొందరు వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మిస్తారు… కానీ, మరికొందరు… ‘సంపాదించడం ఒక ఎత్తు, సమాజానికి తిరిగి ఇవ్వడం మరో ఎత్తు’ అని బలంగా నమ్ముతారు… ఆ కోవకే చెందుతాడు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ , మరియు ఆయన కుటుంబం…
ఎడెల్‌గివ్-హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా 2025 ప్రకారం… భారతదేశంలో అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా శివ నాడార్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు…
Ads
- దానం చేసిన మొత్తం…: గత ఏడాదిలో ఆయన కుటుంబం ఏకంగా ₹2,708 కోట్లు విరాళంగా ఇచ్చింది…
- రోజుకు ఎంతంటే?…: లెక్కేస్తే… ఇది రోజుకు దాదాపు ₹7.4 కోట్లు అవుతుంది!
- ముఖ్యమైన విషయం…: గత ఐదేళ్లలో శివ నాడార్ ఈ స్థానంలో నిలవడం ఇది నాలుగోసారి. వీరి దానంలో ఎక్కువ భాగం విద్యారంగానికే కేటాయించబడుతోంది…
శివ నాడార్ ఫౌండేషన్ ద్వారా… శివ నాడార్ యూనివర్సిటీ, అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం విద్యాజ్ఞాన్ లాంటి సంస్థలను నడుపుతూ, వేల మంది జీవితాలను మారుస్తున్నారు…
మిగతా ప్రముఖుల స్థానాలు….
దాతృత్వంలో శివ నాడార్ చూపిన ఈ అద్భుతమైన ఆదర్శం ముందు… ఇతర ప్రముఖుల విరాళాలు ఇలా ఉన్నాయి:
| ర్యాంకు | దాత (కుటుంబం) | విరాళం (కోట్లలో) |
| 1 | శివ నాడార్ | 2,708 |
| 2 | ముఖేశ్ అంబానీ | 626 |
| 3 | బజాజ్ కుటుంబం | 446 |
| 4 | కుమార్ మంగళం బిర్లా | 440 |
| 5 | గౌతమ్ అదానీ | 386 |
ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు కూడా గణనీయమైన మొత్తాలను దానం చేస్తున్నప్పటికీ, శివ నాడార్ దాతృత్వం ముందు వారంతా చాలా వెనుకబడే ఉన్నారు… దేశంలోని ప్రముఖ రంగాలను, ప్రభుత్వాలను శాసించే అంబానీలు, అదానీలు… ఇతర ప్రభావశీల పారిశ్రామికవేత్తలు దాతృత్వంలో, ఔదార్యంలో, సమాజానికి తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం పూర్… వెరీ పూర్…
నిజంగా, డబ్బు సంపాదించినంత మాత్రాన గొప్పవారు కారు… ఆ సంపదను ఎలా పంచుతారు అనేదే వారి గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది… విద్యకు ఇంత పెద్ద పీట వేసిన శివ నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ వంటి వారు… ఈ దేశానికి దొరికిన నిజమైన ఆదర్శ దానకర్ణులు అనడంలో సందేహం లేదు!
సంపాదనతో పోలిస్తే ఔదార్యం తక్కువేనా?
- శివ నాడార్: గత ఏడాది ఆయన దానం చేసిన మొత్తం ₹2,708 కోట్లు. ఇది ఆయన నికర సంపదలో దాదాపు 1% వరకు ఉంటుంది…
- ముఖేష్ అంబానీ: గత ఏడాది ఆయన కుటుంబం విరాళం ₹626 కోట్లు... ఇది ఆయన నికర సంపదలో కేవలం 0.07% మాత్రమే…
సంపదలో అంబానీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, దానం చేసే నిష్పత్తి (Percentage of Wealth Donated) పరంగా చూస్తే… శివ నాడార్ చాలా చాలా ముందున్నాడు… నాడార్ కుటుంబం తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తున్నారు… అందుకే ఆయనను నిజమైన దానకర్ణుడిగా మీడియా కొనియాడుతోంది…
ఇది కేవలం CSR కింద ఖర్చు చేసిందేనా?
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) అంటే… కంపెనీ చట్టం 2013 ప్రకారం, పెద్ద కంపెనీలు తమ సగటు నికర లాభంలో కనీసం 2% ఖచ్చితంగా సమాజ సేవకు కేటాయించాలి… ఇతర కార్పొరేట్ కంపెనీలు సీఎస్సార్ ఖర్చును దాతృత్వం కింద చూపించుకుంటున్నాయి గానీ… శివ నాడార్ విరాళాలు ఇచ్చే మొత్తం ఆయన కంపెనీ HCL టెక్నాలజీస్ CSR ఖర్చులతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ... ఆయన దానం ఎక్కువగా వ్యక్తిగత సంపద నుంచి నేరుగా శివ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఖర్చు అవుతుంది…
మరో టేబుల్ చూద్దాం ఓసారి…
| ర్యాంకు (దాతృత్వం) | దాత (కుటుంబం) | నికర సంపద (లక్షల కోట్లలో…) | దానం (కోట్లలో, 2025) | |
| 1 | శివ నాడార్ & కుటుంబం | ~2.84 | 2,708 | |
| 2 | ముకేశ్ అంబానీ & కుటుంబం | 9.55 | 626 | |
| 3 | బజాజ్ కుటుంబం | 2.32 | 446 | |
| 4 | కుమార్ మంగళం బిర్లా & కుటుంబం | 2.32 | 440 | |
| 5 | గౌతమ్ అదానీ & కుటుంబం | 8.14 | 386 | |
| 6 | నందన్ నీలేకని | – | 365 | |
| 7 | హిందూజా కుటుంబం | 1.85 | 298 | |
| 8 | రోహిణి నీలేకని | – | 204 | |
| 9 | సుధీర్, సమీర్ మెహతా | – | 189 | |
| 10 | సైరస్, అదర్ పూనవాలా | 2.46 | 173 |
సంపదలో అగ్రస్థానం, దాతృత్వంలో వెనుకబాటు
- ముఖేష్ అంబానీ (రూ. 9.55 లక్షల కోట్లు) గౌతమ్ అదానీ (రూ. 8.14 లక్షల కోట్లు) దేశంలో అత్యంత సంపన్నులు…
- కానీ, దాతృత్వంలో వారి మొత్తం (రూ. 626 కోట్లు, రూ. 386 కోట్లు) శివ నాడార్ కుటుంబం దానం చేసిన రూ. 2,708 కోట్ల ముందు చాలా తక్కువ…
- అంటే, వారు తమ నికర సంపదలో దానం చేస్తున్న నిష్పత్తి (Percentage of Wealth Donated) శివ నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ (ఈ సంవత్సరం టాప్ 10లో లేకున్నా) వంటి వారి కంటే చాలా తక్కువగా ఉంది…
శివ నాడార్ దాతృత్వ నిబద్ధత ఎంత బలంగా ఉందంటే… ఆయన గత ఐదేళ్లలో మొత్తం ₹10,122 కోట్లు దానం చేశాడు…
మరి అజీమ్ ప్రేమ్‌జీ, టాటా గ్రూప్ వంటివి ఎందుకు జాబితాలో లేవు..? ఇదీ ప్రశ్న…
- అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం అత్యున్నత స్థాయికి చెందినది… ఆయన తన సంపదలో దాదాపు 60% కంటే ఎక్కువ (సుమారు రూ. 1.70 లక్షల కోట్లకు పైగా) ఇప్పటికే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు అంకితం చేశాడు… అల్టిమేట్ దాతృత్వం…
- జాబితాలో లేకపోవడానికి కారణం…: హురున్ ఫిలాంత్రపీ జాబితా అనేది ఒక నిర్దిష్ట సంవత్సరంలో (ఇక్కడ 2024-2025) చేసిన విరాళాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది… ప్రేమ్‌జీ తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఒకేసారి (ఎండోమెంట్) తమ ఫౌండేషన్‌కు అప్పగించాడు… ఫౌండేషన్ ఆ డబ్బును వడ్డీ రూపంలో ఖర్చు చేస్తూ ఉంటుంది…
టాటా ట్రస్ట్స్ (Tata Trusts) దాతృత్వ నమూనా (Model of Philanthropy) ఒక ప్రత్యేకమైన నమూనా… టాటా సన్స్ కంపెనీలో ఎక్కువ భాగం (సుమారు 66%) రతన్ టాటా లేదా టాటా కుటుంబానికి చెందినది కాదు, అది నేరుగా టాటా ట్రస్ట్‌ల (Sir Dorabji Tata Trust, Allied Trusts వంటివి) ఆధీనంలో ఉంటుంది…
రతన్ టాటా లేదా ఏ టాటా కుటుంబ సభ్యుడూ తమ వ్యక్తిగత సంపదను భారీగా దానం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారి కంపెనీ లాభాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే ట్రస్ట్‌ల ద్వారానే సమాజానికి వెళ్తుంది… ఉదాహరణకు, టాటా గ్రూప్ సంవత్సరానికి వేల కోట్ల రూపాయలను ట్రస్ట్‌ల ద్వారా విద్య, వైద్యం, కళలకు ఖర్చు చేస్తుంది… సంస్థాగత దాతృత్వంలో టాటాలకు సాటి లేరు…
Share this Article