.
అన్ని సందేహాలూ, అన్ని ప్రశ్నలూ నెగెటివ్ పోకడతోనే కాదు… కొన్ని సకారాత్మకం… ఆలోచనాత్మకం… విషయం ఏమిటంటే..?
హైదరాబాదులోనే ఒక కాలనీ, పేరు వదిలేయండి… గుడికి నాలుగు వైపులా నాలుగు కిలోమీటర్ల దాకా మైకులు పెట్టారు, లైట్లు పెట్టారు… మొన్న శివరాత్రి 12 దాటినా సరే, మైకుల మోత ఆగకపోయేసరికి… ఆ గుడి నిర్మాణానికి చందాలు ఇచ్చినవాళ్లే ఫిర్యాదులు చేశారు, పోలీసులు వస్తే గానీ మైకులు ఆగలేదు… నిర్బంధ జాగారం చేయించాలని అనుకున్నారేమో…
Ads
మరుసటి రోజు రుద్రాభిషేకాలు, శివపార్వతుల కల్యాణం జరిపించారు… రాత్రిపూట అట్టహాసాలు, ఆడంబరాలు, అలంకరణలు, బాణాసంచా పేలుళ్లతో వీథుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు… గుడ్… ఆహ్వానిద్దాం… కానీ శివపార్వతుల కల్యాణం శివరాత్రిన జరిగిందని కదా పెద్దలు చెప్పేది… అఫ్‌కోర్స్, శివరాత్రికీ ఆ కల్యాణానికీ లింక్ లేదనేవాళ్లూ ఉన్నారు, వదిలేయండి కాసేపు…
ఎస్, ప్రతి ఏటా భక్తి, సామూహిక ఉత్సవాల పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతున్నాయి… ఆ శివుడి కొడుకు గణేషుడు నిమజ్జనానికి వెళ్లే ముందు వీథుల్లో ఊరేగించి, ప్రతి ఇంటి ముందు హారతులు, కొబ్బరికాయలు ఎప్పుడూ చూసేదే… ఈ శివపార్వతుల ఊరేగింపు కొత్తగా అనిపించింది… బాగానే అనిపించింది కూడా…
మామూలుగా వైష్ణవాలయాల్లో అలంకరణలు, నైవేద్యాలు భారీ… విష్ణువు అలంకార ప్రియుడు… వైకుంఠద్వార దర్శనం రోజయితే ఎంత చిన్న గుడైనా సరే, అలంకరణలో రాజీపడరు భక్తులు… కానీ శివుడు అలా కాదు… భక్తసులభుడు… అభిషేక ప్రియుడే తప్ప అలంకరణల మోజు ఉండదు… ఓ లింగం, ఓ పానమట్టం, ఓ డమరుకం, ఓ త్రిశూలం ఎక్కడుంటే అదే గుడి… ఎడారుల్లో, అడవుల్లో, హిమపర్వతాల్లో… ఎక్కడైనా సరే…
అంతెందుకు..? కన్నప్ప కథ తెలుసు కదా… నోట్లో పట్టుకొచ్చిన నీటితో లింగ ప్రక్షాళన, మాంస నైవేద్యం… ఐతేనేం, శివుడు దిగివచ్చి కరుణించాడు కదా… భక్తి విధానం ఏమిటని కాదు, భక్తిలో అంకితభావం ఎంత అనేదే ప్రధానం అంటాడు… అంత ఏల..? నాలుగు ఉమ్మెత్త పూలు, నాలుగు జిల్లేడు పూలు చాలవూ తనకు…!!
మరి ఈ కొత్త ధోరణులు..? తప్పు లేదు… భక్తి ప్రదర్శన ఎలా ఉన్నా తప్పులేదు… ఆ కాలనీలో అందరూ ఉత్సాహంగానే పాల్గొన్నారు… హైందవం మీద ముప్పేట దాడులు జరుగుతున్న సంధిగ్ద దశలో, సంక్లిష్ట దశలో అవసరమే… మరీ సోకాల్డ్ డొల్ల సెక్యులరిస్టు పార్టీల విషాల నడుమ… కానీ కొన్ని సందేహాలు…
శక్తి, మాత… గ్రామ దేవత గానీ, కాళిమాత గానీ… వామాచార పూజలుంటయ్, దక్షిణాచార ఆగమపూజలూ ఉంటయ్… కల్లు సాక పోస్తామా, బలి ఇస్తామా వేరే సంగతి… వైష్ణవం కాస్త ఖరీదు… శివుడు చాలా సింపుల్… అందుకే అట్టహాసాలు, ఆడంబరాలు, అలంకరణలూ కాస్త విస్మయభరితం…
తప్పు అని కాదు… మనకు నచ్చిన భక్తి ప్రదర్శన మన ఇష్టం… కానీ నిజమైన భక్తి, తాదాత్మ్యత బదులు ‘ప్రదర్శన’ ఎక్కువై పోతుంది దేనికని..?! అవునండీ, ఏ గుడికైనా సరే, మార్కెటింగ్ కూడా ముఖ్యమే కదా, మీరు చెబుతున్న గుడిలో శివుడు, అమ్మవారు, వెంకటేశ్వరుడు, ఆంజనేయుడు, నవగ్రహాలూ ఉన్నాయి కదా, అన్ని పద్ధతులూ మావే అన్నాడు ఓ పెద్దమనిషి… ఇక కౌంటర్ ఏముంది దీనికి…? ఆపేద్దాం… మనకేమీ ఓ చాగంటి, ఓ గరికపాటి సమాధానం ఇవ్వరు కదా..!!
Share this Article