….. By…. పార్ధసారధి పోట్లూరి …… శ్రీ కృష్ణుడు ఈ వివాహానికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని ! మాయాబజార్ సినిమా కధ కల్పితమే అయినా నిజానికి అలా జరిగిఉండవచ్చు అనే ఊహాలోకి వెళ్లిపోతాం మనం ! కానీ ఊహాకి నిజానికి అప్పడప్పుడూ తేడా తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అదే మాయాబజార్ ఘటనలు వేరే రూపంలో మన ముందు జరుగుతున్నాయి కానీ వాటిని గుర్తించడంలోనే అసలు విషయం దాగి ఉంది !
1.అమెరికా తన సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నంలో చాలా విషయాల్లో దిద్దుకోలేని తప్పులు చేసింది. అది ఒకరకంగా పాకిస్థాన్ పాలిట వరం అయ్యింది. కానీ సంతోషపడినంత సేపు పట్టలేదు పాకిస్థాన్ ఏడవడానికి ! వారంలోపే ఆఫ్ఘనిస్తాన్ లోని రెండు షియా మసీదుల్లో ఆత్మాహుతి దాడులలో కనీసం 200 మంది షియా ముస్లిమ్స్ చనిపోవడం మరో 300 మంది దాకా తీవ్రంగా గాయడడం జరిగింది. వారం క్రితం హెరాత్ లో షియా మసీదులో జరిగిన బాంబు పేలుడు మరిచిపోకముందే కాబూల్ మసీదులో మరో బాంబు పేలుడు. నిన్న కాందహార్ లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్థాన్ అండ దండలున్న హాక్కానీ నెట్ వర్క్ రక్షణ బాధ్యతలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో వరుస ఆత్మాహుతి దాడులు జరగడం మీద పాకిస్థాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ఉంది. అందుకే ISI చీఫ్ ని మార్చేసింది ఇమ్రాన్ ప్రభుత్వం. ఇది సైనిక జెనరల్స్ కి, పౌర ప్రభుత్వానికి మధ్య తీవ్ర విభేదాలని సూచిస్తున్నది. చేతికి చిక్కినట్లే అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తన చేతుల్లో నుండి జారిపోవడం చూస్తుంటే పాకిస్థాన్ వేసిన అన్నీ ప్లాన్స్ కూడా ఫ్లాప్ అయినట్లే అని భావించాలి. CIA వెనుక ఉండి ఇదంతా జరిపిస్తున్నది.
Ads
2. చైనా ఆశ అడియాస కానుందా ? అవుననే చెప్పాలి. కాందహార్ షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నది IS-K అని చెప్పుకున్నది. కానీ ఆ ఆత్మాహుతి బాంబర్ మాత్రం చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న వుయ్ఘర్ ప్రాంత ముస్లిం జిహాదీ ! దాంతో ఉలిక్కిపడ్డ చైనా కాందహార్ ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న తమ దేశ పౌరుడు ఎక్కడి నుండి ఎలా తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాడో విచారణ మొదలుపెట్టింది. వరుస ఆత్మాహుతి దాడుల మీద చైనా ఆఫ్ఘనిస్తాన్ లో తాను చేపట్టబోయే ప్రాజెక్ట్ ల మీద ఆలోచనలో పడింది. అసలు వుయ్ఘర్ ముస్లిమ్స్ తమకి ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ వెనుక CIA ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన నిధులే కారణం ! ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైన్యం ఉన్నంత కాలం ఊరుకుంది. ఎప్పుడయితే ఆఫ్ఘన్ నుండి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుందో వెంటనే తన పాత పరిచయాలని లైన్లో పెట్టింది CIA. దాని ఫలితమే వరుస ఆత్మాహుతి దాడులు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ చేయలేరు అనే సందేశం పరోక్షంగా చైనా, పాకిస్థాన్ లకి ఇచ్చినట్లయింది. అంటే హాక్కానీ నెట్ వర్క్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు అనే ఆలోచనని తిప్పి కొట్టినట్లయింది. చైనా కూడా హాక్కానీ నెట్ వర్క్ మీద చాలా ఆశలు పెట్టుకున్నది కానీ హాక్కానీ తన పని సరిగ్గా చేయలేకపోతున్నది. తాలిబన్ల కి కావాల్సింది ఇదే ! మీరు రక్షణ బాధ్యత సరిగ్గా చేయట్లేదు అని చెప్పి వాళ్ళ నుండి రక్షణ బాధ్యత తాలిబాన్ తీసుకోవచ్చు. ఇది పూర్తిగా CIA ప్లాన్!
3. గత వారం రోజులుగా ఆఫ్ఘన్ –పాక్ సరిహద్దుల్లో ఉన్న ట్రైబల్స్ , వార్ లార్డ్స్, పష్టూన్ ల మధ్య హోరా హోరీ కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ పాకిస్థాన్ సైన్యానికి ప్రవేశం లేదు. వీళ్ళకి తోడు TTP కూడా తోడయ్యింది. ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి అక్కడ. ఇది ట్రైబల్స్ మధ్య ఆధిపత్య పోరాటం ! కాకపోతే పష్టూన్ లు తాము ఉంటున్న పాకిస్థాన్ భూభాగాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో కలపాలి అనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది. బహుశా CIA డబ్బు,ఆయుధాలు ఇచ్చి తమ పాత డిమాండ్ ని మళ్ళీ ఉనికిలోకి తెచ్చి పరోక్షంగా పాకిస్థాన్ కి చెక్ పెట్టె వుద్దేశ్యంలో ఉన్నట్లుంది. బ్రిటీష్ వాళ్ళు భారత్ ని పాలిస్తున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ –బ్రిటీష్ ఇండియాల మధ్య గీసిన డ్యూరాండ్ సరిహద్దు రేఖని మొదటి నుండి ఆఫ్ఘాన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆ వివాదాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవాలని CIA ప్లాన్. అఫ్‌కోర్స్, తాలిబన్లు కూడా మొదటి నుండి డ్యూరాండ్ విభజన రేఖని వ్యతిరేకిస్తున్నారు. అందుకే తాలిబన్లు బలపడితే అది పష్టూన్ జనాభా అధికంగా ఉన్న ఆఫ్ఘన్ పాక్ సరిహద్దులని తనలో కలిపేసుకుంటుంది అనే భయం కూడా ఉంది పాకిస్థాన్ కి మొదటి నుండి. ఇప్పుడు అదే జరుగుతున్నది.
4. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదం ఉన్న ప్రాంతంగా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుని చూపిస్తున్నారు. అంటే ఇది ఇప్పట్లో ఆగదు. మరో సిరియా సంక్షోభం అవబోతున్నది ! ఇప్పటికే పాకిస్థాన్ తన సరిహద్దులని పూర్తిగా మూసివేసి మామూలు కంటే ఎక్కువ సంఖ్యలో తన సైన్యాన్ని మోహరించింది ఆఫ్ఘన్ సరిహద్దుల దగ్గర. గత నెలలో పెషావర్ నుండి ఆఫ్ఘన్ దేశలోకి వెళ్ళే సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది అది మొదటి మెట్టు ! ఇప్పుడు శరణార్ధుల రూపంలో ఆత్మాహుతి బాంబర్లు తమ దేశలోకి రావచ్చు అని భయపడుతున్నది పాకిస్థాన్ !
5. మొస్సాద్ వ్యూహం ? ఇంత జరుగుతుంటే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ? గతంలో పాక్ అణుకార్యక్రమ విషయంలో పొరపాటు చేసిన మొస్సాద్ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బాగానే అందిపుచ్చుకున్నది ! నెల రోజుల క్రితం ఒక ఇజ్రాయెల్ హిస్టోరియన్ ఒక సంచలన ప్రకటన చేశాడు. పష్టూన్ భాష మాట్లాడే సున్నీ ముస్లిమ్స్ ఒకప్పుడు ఇజ్రాయెల్ నుండి వలస వెళ్ళిన యూదులే అంటూ ! దానికి తగ్గ ఆధారాలు కూడా వివరంగా చూపించాడు. ఇది నిజమో అబద్ధమో అనేది పక్కన పెడితే వ్యూహాత్మకంగా ఒక చీలిక తెచ్చిన ప్రకటన ఇది. అదెలాగా అంటే ఇజ్రాయెల్ సైంటిస్టు ప్రకటనని ఆధారం చేసుకొని పాకిస్థాన్ అసలు పష్టూన్ లు ఇక్కడి వారు కాదు అని అంటే అది ఇంకా ఎక్కువ వివాదాస్పదం అయి తిరుగుబాటుని తీవ్ర తరం చేస్తుంది. అలా అని మౌనంగా ఉంటే అది పరోక్షంగా పష్టూన్ లకి లాభం చేకూరుస్తుంది. అంటే ఆఫ్ఘన్ –పాక్ సరిహద్దుల వద్ద ఉన్న ట్రైబల్స్ కి పరోక్షంగా ఇజ్రాయెల్ సహాయం చేస్తున్నట్లే అనుకోవాలి. ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి ఆడకత్తెరలో పోక చెక్క అయినట్లయింది !
6. ఆఫ్ఘనిస్తాన్ లో చైనా పెట్టుబడులు పెట్టడం అమెరికాకి ఇష్టం లేదు అది పరోక్షంగా రష్యాకి సహాయపడుతుంది. మరి కొద్ది రోజుల్లో తాలిబాన్ బృందం మాస్కో వెళ్లబోతున్నది చర్చల కోసం అంటూ ! భారత విదేశాంగ శాఖ అధికారులు కూడా వెళుతున్నారు మాస్కో ! అక్కడ ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో తెలీదు కానీ అమెరికా మాత్రం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో తన ప్రత్యర్ధులు కాలు పెట్టకుండా ఉండడానికి ISIS, అల్ కాయిదాలతో పాటు TTP లకి సహాయం చేస్తున్నది CIA. ఎప్పుడో 10 ఏళ్ల నాడే పుతిన్ ఒక వ్యాఖ్య చేశాడు : ప్రపంచంలో ఉన్న 98% ఉగ్ర సంస్థలకి ఆర్ధిక, ఆయుధ సహాయం చేసేదే CIA అని. దొడ్లో పాములని పెంచుతూ అవి పక్క ఇంటివాడిని మాత్రమే కాటేస్తాయి అనే భ్రమలో ఉంది పాకిస్థాన్ ! పాములకి తన పర భేదం ఉండదు. ఎవరు అడ్డువచ్చినా కాటేస్తాయి ! పాకిస్థాన్‌కు ఇంకా అర్థం కాని నిజం అది…!
Share this Article