రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే చాలు… ఇక మేం చెప్పిందే శాసనం, మా జోలికి ఎవడూ రావద్దు, ఇవి మా సామ్రాజ్యాలు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొందరు ముఖ్యమంత్రులు… ఫ్యూడల్ బాపతు పాత లక్షణాలేవో పనిచేస్తుంటాయి… అవి ఎంతవరకూ వెళ్తాయంటే కేంద్రం మిథ్య, మా జోలికొస్తే తాటతీస్తాం అన్నంతగా…! ఏవో కుటుంబ పార్టీలు, డబ్బు తప్ప వేరే లోకం లేని పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు అలా వ్యవహరిస్తున్నారంటే, సరే, వాళ్ల లెవల్ అదేనని అనుకుంటాం… కానీ సీపీఎం వంటి జాతీయ పార్టీ, సైద్దాంతిక నేపథ్యం ఉన్న పార్టీ కూడా అలాగే ఆలోచిస్తే..? చివరకు తాము పదే పదే విమర్శలు గుప్పించే మమత చూపిన బాటలోనే తామూ నడిస్తే..? దాన్నేమనాలి…? కేరళ ప్రభుత్వం అనాలి… సీఎం పినరై విజయన్ అనాలోచితం అనాలి… మమత అడుగుల్లో అడుగులు వేయబోయి హైకోర్టు చేతిలో భంగపడ్డాడు అనాలి…
ఎస్, తమకు పడని నేతలపై బీజేపీ ప్రభుత్వం ఎడాపెడా ఐటీ, ఈడీ, సీబీఐ, డీఆర్ఐ విభాగాలను ఉసిగొల్పుతోంది… ఉత్త ఆరోపణేమీ కాదు, బోలెడు నిదర్శనాలున్నయ్… అయితే ప్రతి కేసు వెనుకా రాజకీయమే లేదు… జెన్యూన్ కేసులూ ఉంటాయి కదా… ఉదాహరణకు… కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసు… ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను వాడుకుని క్వింటాళ్ల కొద్దీ బంగారాన్ని స్మగుల్ చేశారనేది కేసు… తవ్వేకొద్దీ ఆ కేసు మూలాలూ సీఎం కార్యాలయం కింద తేలాయి… ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ రచ్చరచ్చ చేశాయి… విజయన్ కూడా కేంద్రాన్ని దర్యాప్తు చేయాలని అడిగాడు… ఎన్ఐఏ, కస్టమ్స్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి… the Prevention of Money Laundering Act (PMLA) ఆధారాల కోసం ఇంకా తవ్వడం మొదలుపెట్టాయి.., ట్విస్ట్ ఏమిటంటే..? క్రమేపీ ఈ కేసులో విజయన్ కూరుకుపోసాగాడు… దాంతో…
Ads
క్రైం బ్రాంచ్ పోలీసుల్ని పిలిచి ఆ ఈడీ అధికారులపైనే కేసు పెట్టాలని చెప్పాడు… సీఎం పేరును ఈ కేసులో ఇరికించడం కోసం, సాక్షులను, నిందితులను ఈడీ అధికారులు వేధిస్తున్నారంటూ క్రైం బ్రాంచ్ రకరకాల సెక్షన్లతో రెండు కేసులు పెట్టేసింది… ఈ దెబ్బకు ఈడీ ఇక రాష్ట్రానికి రాదనీ, దర్యాప్తు చేయదనీ అనుకున్నాడేమో సీఎం ఫాఫం… కానీ దీనివల్ల ఫలితం ఉండదనీ, మరింత బదానం అవుతూ, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు తానే బలం చేకూరుస్తున్నాననీ మరిచిపోయాడు… గుర్తుంది కదా… అప్పట్లో దర్యాప్తుకు వెళ్లిన సీబీఐ అధికారుల మీద కేసులు పెట్టి, అరెస్టు చేసి, ఠాణాల చుట్టూ తిప్పింది మమత… సేమ్, సీపీఎం విజయన్ చేసిందీ అదే… రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకుండా చంద్రబాబు కూడా జీవో జారీచేసి, ఆత్మరక్షణకు ప్రయత్నించిన సంగతీ తెలుసు కదా…
కుర్చీ మీద కూర్చుంటే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ అందరూ సేమ్… ఎవరూ తక్కువ కాదు… బయట ఉంటే నీతులు, అధికారంలో ఉంటే ఇదుగో ఈ వేషాలు… ఈడీ అధికారులు మోడీ ప్రోద్బలంతో కావాలనే కేరళ సీఎం పేరు ఇరికించాలని ప్రయత్నిస్తున్నారనే అనుకుందాం… రాజకీయాలు ఎవరు చేసినా వాటి సహజ లక్షణం అది… పోనీ, ఇదే విషయాన్ని అప్రాప్రియేట్ (సరైన) మార్గంలో కౌంటర్ చేయాలి… ఈడీ అధికారుల నిర్వాకాన్ని పీఎంఎల్ఏ కోర్టులో సవాల్ చేయొచ్చు లేదా హైకోర్టును ఆశ్రయించొచ్చు… సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే దీన్ని సరైన పద్ధతిలో కౌంటర్ చేయకుండా… చంద్రబాబు తరహాలో నాకూ ఏసీబీ ఉంది అన్నట్టుగా తన పోలీసులను ఉసిగొల్పి ఉల్టా కేసులు పెట్టేయడం ఏమిటి..? హైకోర్టు కూడా the Special Prevention of Money Laundering Act (PMLA) court ను ఆశ్రయించి ఉండాల్సిందని అభిప్రాయపడి, సీఎం విజయన్ పెట్టించిన రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేసింది… ఈ మొత్తం వ్యవహారంలో సీపీఎం సీఎం ప్రజలకు ఏం సంకేతం ఇచ్చినట్టు..? ‘‘నిజంగానే ఏదో జరిగింది… ఏదో ఉంది, అందుకే తన మీదకు రాకుండా ఉండేందుకు ఈ సీఎం ఇలా పోలీసులను వాడుకుంటున్నాడు’’ అని ప్రజలు భావించే అవకాశాన్ని ఇచ్చాడు…!!
Share this Article