.
Siva Racharla …… ఒకే ఒక్కడు సినిమా… ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? సరిగ్గా 27 సంవత్సరాల కిందట ఇదే రోజు ఏమి జరిగింది? రేఖా గుప్తా నుంచి సుష్మా స్వరాజ్ వరకు…
నిన్న ఢిల్లీ సీఎంగా బీజేపీ నేత రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న NDA కూటమి తరపున సీఎం అయిన ఏకైక మహిళా నేత రేఖా గుప్త… (వర్తమానంలో)… ఈ సందర్భంగా ఢిల్లీకి చివరి సీఎంగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మీడియాలో చర్చ జరిగింది…
Ads
సుష్మా స్వరాజ్ 1998లో 52 రోజులు సీఎంగా పనిచేశారు. 1993 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ పార్టీ మదనలాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ తరువాత ఎన్నికలకు ముందు సుష్మా స్వరాజ్ ను సీఎం చేసింది . 1998 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటంతో సుష్మ 12-Oct-1998 నుంచి 03-Dec-1998 మధ్య 52 రోజుల సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు.
1999 ఏప్రిల్ లో “ఒక్కరోజు సీఎం” కాన్సెప్ట్ తో శంకర్ & అర్జున్ ఒకే ఒక్కడు సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఒక సంవత్సరం జరిగుంటుంది అనుకుంటే 1998 ఫిబ్రవరిలో నిజంగానే “ఒకే ఒక్క రోజు సీఎం” అయిన సంగతి జరిగింది..
ఈ సినిమాకు ఎవరు ఇన్స్పిరేషన్ అనేది శంకర్ చెప్పలేదు కానీ డాట్స్ కలుపుకుంటే ఆ ఒక్క రోజు సీఎం స్ఫూర్తితోనే శంకర్ ఒకే ఒక్కడు తీశాడనిపిస్తుంది .
సరిగ్గా 27 సంవత్సరాల కిందట 21-Feb-1998 న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేసి జగదాంబికా పాల్ అనే కాంగ్రెస్ చీలిక నేతను సీఎంగా నియమించారు. బీజేపీ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో గొడవలు, మిత్ర పక్షాల మద్దతు ఉపసంహరణ .. ఇలా ఆ రోజు చాలా రాజకీయాలు జరిగాయి.. గవర్నర్ రమేష్ భండారి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, కాంగ్రెస్ ను చీల్చి Akhil Bharatiya Loktantrik Congress నేత జగదాంబికా పాల్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.
అయితే కళ్యాణ్ సింగ్ అలహాబాద్ హై కోర్టుకు వెళ్లారు.. హై కోర్టు 23-Feb-1998 న తిరిగి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వ రద్దు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు ఇచ్చింది.. దీనితో జగదాంబికా పాల్ ఒక్క రోజు సీఎంగా చరిత్రలో నిలిచి పోయారు…
ఇలా అతి స్వల్పకాలం సీఎంగా పనిచేసిన లిస్టులో మరో ఒక్కరోజు సీఎం ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ ఉన్నారు. 2012 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 32, బీజేపీ 31, బీఎస్పీ 3, ఇండిపెండెంట్స్ 4 సీట్లు గెలిచారు. కాంగ్రెస్ తరుపున విజయ బహుగుణ సీఎం అయ్యారు…
కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం 2 సంవత్సరాల తరువాత సీఎం మారి హరీష్ రావత్ 01-Feb-2014న సీఎం అయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తరువాత హరీష్ రావత్ ప్రభుత్వ పరిస్థితి దిన దిన గండం అయ్యింది…
మాజీ సీఎం విజయ్ బహుగుణ నాయకత్వంలో మొత్తం తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందని కేంద్రం 27-Mar-2016న రాష్ట్రపతి పాలన విధించింది. కోర్టు జోక్యంతో 21-Apr-2016 న రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. హారీస్ రావత్ మళ్ళీ సీఎం అయ్యారు.
కానీ బలనిరూపణకు ముందే స్పీకర్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను disqualify చేశారు . మరో వైపు విశ్వాసపరీక్షలో మద్దతు ఇస్తే డబ్బులు ఇస్తాను అని హరీష్ రావత్ కొందరు ఎమ్మెల్యేలకు చెప్పినట్లు స్టింగ్ ఆపరేషన్ ఆడియోను బీజేపీ రిలీజ్ చేసింది.. మళ్ళీ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది..
రాష్ట్రపతి పాలన మీద హరీష్ రావత్ కోర్టుకు వెళ్ళటం .. కోర్టు ”గడియారాన్ని వెనక్కు తిప్పండి” అని హరీష్ రావత్ కు అనుకూలంగా 11-May న అంటే 19 రోజుల తరువాత తీర్పు ఇవ్వటంతో హరీష్ మళ్ళీ సీఎం అయ్యి 18-Mar-2017 వరకు ఆ పదవిలో కొనసాగారు…
హరీష్ రావత్ టెక్నికల్ గా ఒక్క రోజు సీఎం గా ఉన్నారు కానీ అయన మొత్తం మూడు సంవత్సరాలు సీఎంగా పనిచేశారు.. రికార్డ్ ప్రకారం ఒక్కరోజు సీఎం లిస్టులో ఉండొచ్చు కానీ భారతదేశ చరిత్రలో ఒక్క రోజు సీఎంగా మాత్రం జగదాంబికా పాల్ నే చూడాలి.
ఇలాగే బలపరీక్షలో ఓడిపోవటం లేదా బల పరీక్షకు ముందే రాజీనామా చేయటం ద్వారా…
1). యడ్యూరప్ప
a). 2 రోజులు 2018 May…
b). 7 రోజులు 12-Nov-2007 నుంచి 19-Nov -2007
2). దేవేంద్ర ఫడ్నవీస్ – మూడు రోజులు 2019 Nov
3). ఓం ప్రకాష్ చౌతాలా – 5 రోజులు 12-Jul-1990 నుంచి 17-Jul-1990
4). నితీష్ కుమార్ – 8 రోజులు – 03-Mar-2000 నుంచి 10-Mar-2000
5). సతీష్ ప్రసాద్ సింగ్ – బీహార్ – 7 రోజులు 1968 Jan
6). SC మారక్ – మేఘాలయ – 13 రోజులు – 1998 Feb
7). జానకీ రామచంద్రన్ – 23 రోజులు , 1980 Jan
8.నాదెండ్ల భాస్కర్ రావు – 30 రోజులు 1984 Aug
9). మొహ్మద్ కోయ – కేరళ – 45 రోజులు 1979 Oct
10). సుష్మా స్వరాజ్ – ఢిల్లీ – 52 రోజులు 1998 Oct
స్వల్పకాలిక సీఎంల మీద సమగ్ర ఆర్టికల్ లేదు.. వికీపీడియాలో లింక్ లేదు.. దీని మీద మరింత రీసెర్చ్ అవసరం .. మరికొంత మంది ఈ లిస్టులో చేరొచ్చు… స్వల్పకాలిక పీఎంల మీద కూడా డేటా అవసరం…
Share this Article