ఒక మెట్రో ప్రాజెక్టు… పూర్తయ్యింది… కానీ సరిగ్గా సర్వీస్ లేదు, సాంకేతిక సమస్యలు… విసిగిపోయిన ఒకాయన థూ, ఇదేం మెట్రో, అస్సలు బాగోలేదు, బాగా మెరుగుపడాలి అని తిట్టాడనుకొండి… పక్కనే ఉన్న పే-ద్ద మనిషి ఒకాయన ‘‘నువ్వు ఓ పిల్లర్ వేసింది లేదు, తట్ట మోసింది లేదు, పట్టాలకు వెల్డింగ్ చేసింది లేదు, నీ బతుక్కి ఒక్క బోగీ తయారు చేసింది లేదు, నీకు తిట్టే హక్కు లేదు, నోరు ముయ్యి’’ అంటే ఎలా ఉంటుంది..? మన టికెట్టు, మన డబ్బు, మన జాగాలో బాజాప్తా పట్టాలేసుకుని, దందా చేసుకుంటుంటే… బాగుందో లేదో చెప్పే హక్కు లేదా ఓ కస్టమర్‌కు..? అదేమంటే రైలు పట్టాలు వేసి ఉండాలా..?
మార్కెట్‌లో ఒకడు టూత్ పౌడర్ రిలీజ్ చేశాడు, బాగా లేదు, అది సరుకు, జనోద్ధరణ కోసం తయారు చేయలేదు… వినియోగదారుడిగా దాని నాణ్యత గురించి వెల్లడించేందుకు పెద్ద హక్కులు, అగ్రిమెంట్లు కావాలా..? నీకు చేతనైతే నువ్వు కూడా ఓ టూత్ పౌడర్ తయారు చేసి ఉంటే తెలిసేది అని ఎవడైనా అంటే మనకు ఎలా ఉంటుంది..? సినిమా కూడా ఓ సరుకే… నచ్చితే నచ్చిందీ అంటారు… లేకపోతే నచ్చలేదు అంటారు… సోషల్ మీడియాలోనో, మీడియాలోనో, యూట్యూబ్ చానెల్‌లోనో వ్యక్తీకరిస్తారు… దాన్ని కూడా తిట్టేస్తే దాన్నేమనాలి..? మీరు సినిమా తీస్తే తెలిసేది అనే వాట్ల మాటలు మాట్లాడితే ఎలా..?
వైసీపీ నాయకుడు అని చెప్పబడుతున్న, షాళా షాళా డబ్బున్న ఓ సినీ నిర్మాత కమ్ మస్తు సంపాదన ఇచ్చే సంస్థలున్న పొట్లూరి వరప్రసాద్ ఒక్కసారిగా ట్విట్టర్‌లో విరుచుకుపడ్డాడు… ఎవరూ ఏమీ అనకూడదట ఆర్ఆర్ఆర్ సినిమాను… ప్రత్యేకించి గ్రేటాంధ్ర మీద మండిపడుతున్నాడు… BANGREATANDHRA అని పిలుపునిస్తున్నాడు… అసలు ఈయన భాష ఎలా ఉందో ఓసారి చదవండి…
Ads
కొడుకుల కుత్తుకలు కోయాలి, గర్వపడండిరా కొడకల్లారా,.. ఇవీ ఆయన వాడిన పదాలు… అదేమిటయ్యా అంటే ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటాడు… మరి సినిమా మీద విమర్శ, విశ్లేషణ కూడా ఫ్రీడం ఆఫ్ స్పీచ్ కిందకు రాదా..? నాకు ఈ సినిమా నిర్మాతలతో, దర్శకులతో, హీరోలతో ఏ సంబంధమూ లేదని డిస్‌క్లెయిమర్ కూడా ఇచ్చాడు… ఎవడైనా ఫలానా సినిమా నాకు నచ్చలేదు అని రాస్తే, చెబితే వాడి కుత్తుక కోసేయాల్సిందేనా ఇక… ఈయన ఏపీ రాజధానిగా చెప్పబడుతున్న బెజవాడ లోకసభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయాడు…
తెలుగోడు అయినందుకు రాజమౌళి తీసిన సినిమాను కచ్చితంగా ఓన్ చేసుకోవాలా..? పొగడాలా..? రివ్యూ రాస్తే సినిమావాళ్లంతా తిరగబడాలా..? ఆ భాషే కాదు, ఆ ధోరణే విచిత్రంగా, ప్రమాదకరంగా కనిపిస్తోంది… కళకు కులంపిచ్చి అంటించింది ఎవరు ఇంతకూ..? ఇందులో జాతి గౌరవం ఏముంది..? జాతీయ సంపద ఎలా అయ్యాడు రాజమౌళి..? నెత్తురు ఉడికించేంత దేశభక్తి ఏముంది అందులో..?
ఒకడు వైన్స్ వెళ్లి ఓ బీర్ సీసా కొన్నాడు, కొత్త బ్రాండ్, రేటు చాలా ఎక్కువ, నచ్చలేదు, ఆ సీసాను ఆపక్కనే పగులగొట్టి బూతులు తిడుతూ వెళ్లిపోయాడు… ఒరేయ్, నీ మొహానికి ఎప్పుడైనా ఒక్క క్వార్టర్ చీప్ లిక్కరైనా తయారు చేసి అమ్మావా..? తెగ తిట్టేస్తున్నవ్ అంటామా..? అనగలమా..? ఆ ఒక్కడూ బీర్ బాగాలేదంటే బ్రూవరీ మూసేసుకోరు, అమ్మకాలు ఆగవు… తాగేవాడు తాగుతూనే ఉంటాడు… ఆర్ఆర్ఆర్ ఏమైనా అతీతమా..?!
సారు గారు మొన్నటి లోకసభ ఎన్నికల్లో ఓడిపోయాడుగా… ఇంకా నయం… టికెట్టు తెచ్చుకుంటే తెలిసేది, కనీసం వార్డు సభ్యుడిగానైనా పోటీచేస్తే తెలిసేది, కుత్తుకల్ని కొయ్యాలి ఒక్కొక్కడిదీ అంటూ వోటర్లపై పడలేదు… అవును గానీ… వాళ్లు కళకు కులం పిచ్చి అంటించారో లేదో తరువాత… అసలు మొత్తం సమాజానికే కులం కంపు అంటించింది ఎవరు..? కులంతో రాజకీయాలు చేసేది ఎవరు..? జస్ట్ ఆస్కింగ్…!! సినిమా వేశాక గంటకు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే మీ విజయవాడలోనే అన్నపూర్ణ థియేటర్ ధ్వంసం చేశారట, దీనిపై మీ స్పందన ఏమిటి పీవీపీ గారూ..!!
Share this Article