ఆమె ప్రజాప్రతినిధి కాదు… ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా కాదు… ఐనా ప్రభుత్వ కార్యాలయాల్ని తనిఖీ చేస్తుంది… దర్శిలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన లక్ష్మి, ఓడినా సరే తనే ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు మీద ఓ ఫోటో, ఓ వార్త కనిపించింది…
ఓ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తనిఖీలు చేసి, ఏకంగా సూపరింటిండెంట్ కుర్చీలో కూర్చుని అధికార దర్పం చూపిస్తుంటే, ఫాఫం ఆయనేమో ఎదురుగా కుర్చుని చేతులు కట్టుకుని విధేయతను ప్రదర్శించాల్సి వస్తోంది… తప్పదు, అధికారంలో ఉన్నవాళ్లతో ఎందుకు పెట్టుకోవాలి అనుకుంటాడు కదా…
Ads
చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజ వేడుకకు పోలీసు అధికారులు యూనిఫామ్‌లో హాజరై, ఒక కేకు తెప్పించి, కట్ చేయించి, చప్పట్లు కొట్టి… (కనీసం ఆ టోపీలైనా తీసి చంకల్లో పెట్టుకోలేదు) సంబరాలు చేసుకున్నారు… అంతకుముందు ఓసారి టోల్ గేట్ వద్ద ఈమె రచ్చ చేసిన వీడియో కూడా చూసినట్టు గుర్తు…
ఈ బర్త్ డే వేడుకల మీద పోలీస్ ఉన్నతాధికారులు సీరియసయ్యారనీ, పలువురు ఎస్ఐలకు షోకాజు నోటీసులు ఇచ్చారని వార్తలొచ్చాయి… నిజమే, ఎందుకంతగా సాగిలపడాలి పోలీసులు..? అసలు ఆమె ఎవరు..? ఎమ్మెల్యే భార్య అయితే ఆ ఏరియాకు సర్వంసహాధికారిణి అనుకోవాలా..? ఏమిటీ అధికార దర్పం..?
మరోచోట… ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు… అంతకుముందేమో ఎకరానికి 48 లక్షల ధరతో కొనుగోలుకు ఒప్పందం… అధికారం రాగానే మొత్తం 4 ఎకరాలు 30 లక్షలకు ఇవ్వాల్సిందేనని హుకుం… బాధితులపై కేసు పెట్టి మరీ బెదిరింపులు, దాడులు… ఇంకోచోట… తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి స్టేషన్ వద్ద ధర్నా… సీఎం క్షమాపణకై పట్టు…
అఫ్ కోర్స్… ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకన్నా వాళ్ల బంధువులు, కుటుంబసభ్యులు గట్రా ఎక్కువ దర్పం ప్రదర్శించడం ఇక్కడే కాదు, దేశంలో ప్రతిచోటా ఉంది… ఆఫ్టరాల్ గ్రామ వార్డు మెంబర్లే చెలాయించుకుంటూ ఉంటే, మాకేం తక్కువ, మరి అధికారం ప్రదర్శించుకోవడం కోసం కాకపోతే అధికారం వచ్చి ఫాయిదా ఏముంది అంటారేమో ఆఫ్ ది రికార్డుగా…! ఈ ధోరణి ఇలాగే పెట్రేగితే అంతిమంగా అది చంద్రబాబు మీద వ్యతిరేకతకు దారితీస్తుంది… తనే పగ్గాలు వేయాలిక…
ఒక పిఠాపురంలో నాగబాబు అధికారులతో భేటీలు వేసినా అంతే, అది జనంలోకి నెగెటివ్‌గానే వెళ్తుంది… అంతకుముందు వైసీపీ హయాంలో కూడా అంతేకదా… ఉదాహరణకు… రోజా… ఆమె తిరుమలకు పదే పదే పర్యటనలు చేస్తూ, అనేకమందిని వెంట తీసుకుని వెళ్లేది… మామూలు భక్తులకు ఇబ్బందులు తలెత్తినా ఆమెదంతా డోన్ట్ కేర్ పాలసీ… పైన చెప్పుకున్న ఉదాహరణలన్నీ అవినీతో, అక్రమమో, కుంభకోణమో, మరొకటో కాదు… అనుచిత ప్రవర్తన..! ప్రతి చోటా ఇదే కథ…!
కాస్త భరిస్తే సరి, వీళ్లతో ఎందుకు వైరం అనుకుని అధికారులు, ప్రభుత్వ సిబ్బంది కూడా సర్దుకుపోవడమే… ఐఏఎస్, ఐపీఎస్‌లు సహా ప్రభుత్వ ముఖ్యులు ఓ దుష్ట కూటమిగా మారి, ఒక ధనిక వ్యాపారి కోసం… ఏకంగా కాదంబరి జెత్వానీ అనే ఓ ముంబై నటిని విజయవాడకు తీసుకొచ్చి, అక్రమంగా నిర్బంధించి, వేధించిన అరాచకమైన ఎపిసోడ్ చదువుతున్నాం కదా… అది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నమాట… (ఈ కథలో అసలు ట్విస్టులు ఇప్పుడే మొదలయ్యాయి… ఇదొక వెబ్ సీరీస్‌లాగా చాన్నాళ్లు కొనసాగుతుంది…) సో, టీడీపీ, వైసీపీ అనే తేడాలేమీ ఉండవు ఇందులో… ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు ‘ప్రదర్శించుకోవడమే’… జనం చీదరించుకున్నా సరే…!!
Share this Article