.
Subramanyam Dogiparthi
……… రొమాన్స్ , ఎమోషన్ , సెంటిమెంట్ , డ్రామా , సస్పెన్సుల కలబోత 1986 జనవరిలో వచ్చిన ఈ శ్రావణ సంధ్య సినిమా … 1+2 సినిమా . బాగుంటుంది . కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాతృక తమిళంలో వచ్చిన పౌర్ణమి అలైగల్ సినిమా . తమిళంలో శివకుమార్ , అంబిక , రేవతిలు నటించారు .
Ads
కధ కూడా బాగుంటుంది . ఓ పెద్ద లాయర్ గారు కూతురిని , మేనల్లుడిని ఒకేలా చూసుకుంటూ ఇద్దర్నీ లాయర్లను చేస్తాడు . మేనల్లుడిని అల్లుడిని కూడా చేసుకుంటాడు . అమ్మాయి గారికి భర్తంటే అలుసు , నిర్లక్ష్యం . చచ్చేంత ప్రేమ కూడా . అల్లుడు గారికి అవమాన భారం , ఉక్రోశం , వగైరా . తన శక్తిని , ప్రతిభను చూపించాలనే తపన .
ఈ స్థితిలో ధనాల్న ఓ మర్డర్ కేస్ వస్తుంది . ఊళ్ళో పెద్దాయన , ఓ దేవాలయ ధర్మకర్తని మరో హీరోయిన్ సుహాసిని నడిరోడ్డు మీద షూట్ చేసి పైలోకాలకు పార్సిల్ చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోతుంది . ఆ కేసుని టేకప్ చేయమని పూజారి గారు పెద్ద లాయర్ని అడుగుతాడు . తండ్రీకూతుళ్ళు తిరస్కరిస్తారు . తన పటిమను చూపించాలని తహతహలాడి పోతున్న అల్లుడు కేసును టేకప్ చేస్తాడు .
భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి . అల్లుడు గారు ఇంట్లోనుంచి వెళ్ళిపోతారు . ఆ కేసు విషయంలో భార్యాభర్తలు పబ్లిక్ ప్రాసిక్యూటరుగా , డిఫెన్స్ లాయరుగా ఒకరిని ఒకరు ఎదుర్కొంటారు . సుహాసిని ఆ హత్య చేయటానికి ప్రేరేపించిన కారణాలను సైకలాజికల్ కోణంలో వివరించి ఆమెను కేసు నుండి బయటపడవేసి చప్పట్లు కొట్టించుకుంటాడు .
అయితే ఈలోపు భార్య నిర్లక్ష్యానికి గురయిన హజ్బెండ్ శోభన్ బాబు సుహాసిని ఆప్యాయతకు దగ్గరవుతాడు . కాసేపు 1+2 కధ నడుస్తుంది . చివరకు భార్య విజయశాంతి రాజీకొచ్చి భర్తను కావాలని అనుకుంటుంది . సుహాసిని సామాజిక సేవకురాలిగా మారి శోభన్ బాబు , విజయశాంతిలను కలపటంతో శుభం కార్డ్ పడుతుంది . ఇదీ కధ .
ఇద్దరు భామల మధ్య నలగటం , భార్యతో గొడవల రావటం , వగైరా పాత్రలు శోభన్ బాబు ట్రేడ్ మార్క్ . చాలా బాగా నటించారు . భార్య అంటే ప్రేమ , పిచ్చి . ఆమె చేత తుస్కారించబడే సన్నివేశాలలో బాగా నటించాడు . విజయశాంతి గ్లామర్ డాల్ గానే కాకుండా తలపొగరు స్త్రీగా , కెరీరుకి ప్రాధాన్యత ఇచ్చే లాయరుగా బాగా నటించింది .
సినిమాను మలుపు తిప్పే పాత్ర సుహాసినిది . భార్యాభర్తల ఇగో సంఘర్షణలు జరుగుతూ ఉండే సమయంలో ధనాల్న గొల్లపూడి మారుతీరావుని షూట్ చేసి ప్రేక్షకులు ఉలిక్కిపడేలా చేస్తుంది . సుహాసిని నటనను మెచ్చుకోవాలి . భర్తతో కూడా కాపురం చేయలేనంతగా షాకుకు గురయిన పాత్రలో బాగా నటించింది . మానసిక సంఘర్షణను బాగా ప్రదర్శించింది . శోభన్ బాబు జీవితంలో నుంచి తొలిగి పోయే సీన్లలో ఇంకా బాగా నటించింది .
ఈ ముగ్గురి తర్వాత అభినందించవలసింది రావు గోపాలరావుని , సుమిత్రని . కూతురు అల్లుళ్ళ మధ్య నలిగిపోయే మనిషిగా చక్కగా నటించారు . డాక్టరుగా , కుటుంబ శ్రేయోభిలాషిగా సుమిత్ర చక్కగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో రమణమూర్తి , సుత్తి జంట , కె విజయ , ఝాన్సీ , హరిబాబు , ప్రభృతులు నటించారు .
చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ సెలయేరులా పారుతుంది . నేటి తరం సంగీత ఢాంఢాం గార్లు తప్పక చూడాలి . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి . వేటూరి పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు . ముఖ్యంగా ప్రియతమ లలనా పాట .
సంగీతం ఎంత బాగుంటుందో అంతే అందంగా కోదండరామిరెడ్డి చిత్రీకరించారు . శివశంకర్ నృత్యాలను బాగా కంపోజ్ చేసారు . మరో చక్కని 1+2 పాట సీతకు ప్రాణం శ్రీరాముడే . శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్ల మధ్య నలుగుతూ బాగుంటుంది . రండి శ్రీవారు రాదు ఈరోజు శోభన్ బాబు , విజయశాంతిల డ్యూయెట్ , ఇంకా ఇంకా హత్తుకో అంటూ సాగే డ్యూయెట్ శోభన్ బాబు , సుహాసినిల మీద బాగా చిత్రీకరించబడ్డాయి .
ఎమోషన్ , డ్రామా , కోర్ట్ సీన్లు ఉన్న సినిమాల్లో డైలాగ్స్ ఎలా ఉండాలో అలా పదునుగా వ్రాసారు గణేష్ పాత్రో . శోభన్ బాబు సైకిల్ మీద వస్తుంటే విజయశాంతి ఎగతాళి చేస్తుంది . రెండు ఎలక్షన్లలో ఆ సైకిల్ గుర్తే తెలుగు దేశం పార్టీని గెలిపించిందని రావు గోపాలరావు చెపుతాడు . అలాంటి సమకాలీన డైలాగులూ ఉన్నాయి .
మజాల్ అనే టైటిలుతో హిందీలోకి కూడా రీమేక్ అయింది ఈ సినిమా . హిందీలో ప్రత్యర్ధులు శ్రీదేవి , జయప్రద , జితేంద్ర నటించారు . ఇక్కడ శోభన్ బాబు, అక్కడ జితేంద్ర… మన బాపయ్యే దానికి దర్శకుడు… నిర్మాత శ్రీకాంత్ నెహతా… అనగా జయప్రద భర్త… తమ సొంత సినిమాలోనూ తనకు పడని, మాటల్లేని శ్రీదేవిని తీసుకోవడం విశేషమే…
మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా బాగుంటుంది . తప్పక చూడతగ్గ సినిమా . అక్కడక్కడ కాస్త సాగతీత ఉంటుంది . కోదండరామిరెడ్డి కదా ! ఓవరాలుగా బాగుంది అని అనిపించాడు . సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులు చూడొచ్చు . ఇంతకుముందు చూడని ఇతర సినీ ప్రేమికులు కూడా చూడొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article