.
( Subramanyam Dogiparthi ) ….. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన , మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి . భగవద్గీతలోని ఈ శ్లోకం తెలియని వారు ఉండరు బహుశా . ఈ శ్లోకంతోనే ఈ శుభోదయం సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత ఉషశ్రీ సూక్తి కొనసాగుతుంది .
బహుశా ఈ తరానికి ఉషశ్రీ గొంతు తెలియదు . మా తరం వాళ్ళ చెవుల తుప్పును , బుర్రల్లోని తుప్పును వదిలించిన కంఠం అది . మానవుడు పని చేసుకుంటూ పోవటమే ఒక యంత్రంలాగా . ఫలితం గురించి ఆలోచించటం అనవసరం . బాగా పనిచేస్తే వద్దన్నా అదే రేంజిలో ఫలితం ఉంటుంది . Performance and reward are always proportional .
Ads
ఇలాంటి విలువైన సందేశాన్ని అందించిన చక్కటి , సంగీత భరిత చిత్రం . అయితే కె విశ్వనాథ్ స్థాయిలో ఆడలేదు . ప్రేక్షకులకు ఎక్కలేదు . అయిననూ గొప్ప సినిమాయే . పనిదొంగలు , బధ్ధకస్తులు , వాయిదారాయుళ్ళు , చిలక జోస్యాన్ని నమ్ముకునే వ్యర్ధజీవులు , ఊరపందుల్లాగా ఇంట్లో వాళ్ళ మీద, ఊళ్ళో వాళ్ళ మీద పడి తినేవాళ్ళు తప్పక చూడవలసిన సినిమా . ఇలాంటి వాళ్ళను తాళ్ళతో కట్టేసయినా చూపించాల్సిన సినిమా .
ఏదో ఒక రోజు మహారాజయోగం పట్టనున్నదని పనిచేయకుండా పగటి కలలు కనే ఒక దిగువ మధ్య తరగతి యువకుడి కధ . ఓ ధనవంతురాలి కుమార్తెకు లైనేసి పెళ్లి చేసుకుంటాడు . ఆ అమ్మాయి ఆదర్శవంతురాలయిన కష్టజీవి . పెళ్ళయిన తర్వాత హర్మ్యం నుండి సాధారణ గృహానికి తీసుకుని వెళ్ళిపోతుంది పనిదొంగ భర్తని .
కేన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి తన యావదాస్తిని దానం చేస్తుంది . పనిదొంగ భర్త సంసారాన్ని ఈదాల్సి వస్తుందని ఇంట్లోనుంచి పారిపోయి ఓ ఆశ్రమానికి చేరి సన్యాసుల్లో కలిసిపోతాడు . అక్కడ ఊరక కూర్చోబెట్టి పంచ భక్ష్య పరవాణ్ణాలను పెట్టరని తెలుసుకొని ఖిన్నుడు అవుతాడు . బిడ్డతో భార్య అక్కడకు చేరుకుని , భర్తకు బిడ్డ మీద ప్రేమ కలిగేలా ప్రవర్తిస్తుంది . మొత్తం మీద పనిదొంగకు పరివర్తన కలిగి శుభోదయం అవుతుంది .
కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్నీ విశ్వనాధుడివే . దర్శకత్వం ఓకే అయినా కధ , స్క్రీన్ ప్లే బిర్రుగా ఉండవు . బలహీనంగానే ఉంటాయి . బహుశా అందువలనే ఆయన లెవెల్లో ఆడలేదు . ఆ మాత్రం అయినా ఆడటానికి ముఖ్య కారణం కె వి మహదేవన్ శ్రావ్యమైన సంగీతం , వేటూరి వారి అద్భుతమైన సాహిత్యం , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మల గాత్రం .
కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా , గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పాటలు సూపర్ డూపర్ హిట్ . నటనమాడెనే , కస్తూరి రంగ రంగ , ఆ చింత నీకేలరా , సరసాల మనుగడ వదిలి , రాయైతే నేమిరా , అసతోమా సద్గమయ పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . చిత్రీకరణ కూడా బాగుంటుంది .
చంద్రమోహన్ కధానాయకుడి పాత్రలో బాగా నటించాడు . ఒక పాటలో శాస్త్రీయ నృత్యాన్ని కూడా కాస్త ట్రై చేస్తాడు . ఇంకో మూడు నాలుగు అంగుళాలు ఎత్తు ఉంటే చాలామందిని తినేసేవాడు . హీరోయిన్ సులక్షణకు పెద్దయ్యాక మొదటి తెలుగు సినిమా . బేబీ డాలీగా అప్పటికే సుపరిచితం . బాగానే చేసింది . ఇతర పాత్రల్లో భానుప్రకాష్ , అన్నపూర్ణ , సాక్షి రంగారావు , ప్రభృతులు నటించారు . ప్రేక్షకులు గుర్తుంచుకునే నటి మనోరమ . ఆమె నటన గురించి చెప్పేది ఏముంది ! ఈ సినిమాలో మంచి పాత్ర ఆవిడది .
ఈ సినిమాలో చూపించిన శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మశ్రమం గురించి ఒక్క మాట చెప్పాలి . ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి 1960s లో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో గీతా మందిరాలను ప్రారంభించి గీతోద్యమం చేసారు . మా నరసరావుపేటలో పట్టాభిరామ స్వామి వారి దేవాలయంలో ఆయన గీతామందిరాన్ని ఏర్పాటు చేయటం నాకు తెలుసు . మా ఊళ్ళో ఆయన్ని నేను చూసాను .
జంధ్యాల సంభాషణలు చాలా బాగుంటాయి . ఈరోజు ఆయన జయంతి కూడా . వారికి నా నివాళి . ఈ సినిమాను విశ్వనాధే దర్శకత్వం వహించి హిందీలో కామ్‌చోర్ అనే టైటిలుతో తీసారు . హిందీలో సక్సెస్ అయింది . రాకేష్ రోషన్ , జయప్రదలు ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగులో సులక్షణ బదులు జయప్రద అయి ఉంటే బాగా ఆడి ఉండేదేమో !
పనిని బట్టే ఫలితం ఉండేది అనేది ఈ సినిమా వైఫల్యం ద్వారా విశ్వనాధుడికి కూడా తెలిసి వచ్చి ఉండాలి . ఇలాంటి కధాంశంతోనే 1992 లో ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాను ఇ వి వి సత్యనారాయణ రాజేంద్రప్రసాద్ , రావు గోపాలరావులతో తీసాడు . బాగానే ఆడింది కూడా .
ఏది ఏమయిననూ చూడతగ్గ సంస్కారవంతమైన , శుభ్రమైన , సందేశాత్మక సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పెట్టేసుకోండి . బధ్ధకించకండి . కష్టే ఫలే సూత్రాన్ని నమ్మండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article