మళ్లీ ప్రేక్షకుడి దృష్టిని మొత్తం తనపైకి మళ్లించుకుంది సాయిపల్లవి… శ్యామ్ సింగరాయ్ సినిమాను నిలబెట్టిన ప్రధాన కారణాల్లో ఆమె కూడా ముఖ్యమైందే… ప్రత్యేకించి ప్రణవాలయ పాటలో నర్తన గానీ, దేవదాసి పాత్రలో తన పాత్రోచిత నటన గానీ ఆకట్టుకునేలా ఉన్నయ్… శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో ఆమె మాట్లాడటానికి రెడీ అయినప్పుడు, ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆహుతులు కేకలు వేస్తే తమ అభిమానాన్ని ప్రదర్శించి, కాసేపు మాట్లాడనివ్వలేదు, ఆమె కన్నీళ్లపర్యంతం అయిపోయింది… వర్తమాన తెలుగు సినిమా తారల్లో ఇంత పాపులారిటీ ఆశ్చర్యం అనిపించింది… మొన్నటి లవ్ స్టోరీ, నేటి శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో ఆమెను చూశాక ప్రేక్షకాభిమానానికి అర్హురాలే అనిపించింది… రేప్పొద్దున విరాటపర్వం సినిమాకూ ఆమే ప్రధానం కాబోతోంది…
ఇదెందుకు చెప్పుకోవడం అంటే… అసలు తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఏమీ ఉండదు, ఏవో నాలుగు పిచ్చి గెంతుల డాన్సులు, అరకొర బట్టలు, అయిదారు సీన్లు చాలు… జస్ట్, హీరో పక్కన నిలబడాలి అంతే… కానీ మెల్లిగా తెలుగు కథ కూడా మారుతోంది… కొత్త దర్శకులు వస్తున్నారు… నాయికా పాత్రకూ ప్రయారిటీ ఇస్తున్నారు… శ్యామ్ సింగరాయ్ తీసిన రాహుల్ సాంకృత్యన్ కొత్తతరం దర్శకుడే… ఓ దేవదాసి పాత్రలో సాయిపల్లవి మెరిట్‌ను భలే వాడుకున్నాడు… ఆమె డాన్స్ కోసం ఓ పాటనూ పెట్టాడు… నిజానికి సినిమా ఫస్టాఫ్‌లో కథ సోసో… నాని పోషించిన వాసు పాత్ర, ఏదో ఫిలిమ్ మేకర్ కావాలనుకోవడం, కృతి శెట్టితో లవ్వు, తన సినిమా కథ కాపీ అనే ఆరోపణలకు గురికావడం సోసో అనిపిస్తాయి… కానీ ఎప్పుడైతే నాని శ్యామ్ సింగరాయ్ పాత్ర ఎంటరవుతుందో, సాయిపల్లవితో తన కథ ముడిపడి ఉన్న సీన్లు మొదలవుతాయో అక్కడి నుంచి సినిమా గమనమే మారిపోయింది…
Ads
రెండు భిన్న పాత్రల్ని నాని బాగా చేశాడు… అఫ్ కోర్స్, తనకు నటన ఎవరూ కొత్తగా నేర్పనక్కర్లేదు… (కాకపోతే గాంభీర్యం, రౌద్రం, కాస్త రస్టిక్ నేచర్ ఇప్పటికీ నానికి అంతగా పట్టుచిక్కనట్టు అనిపిస్తుంది…) వాసు పాత్ర పెద్దగా పరిగణనలోకి రాదు గానీ శ్యామ్ సింగరాయ్ పాత్రలోకి నాని పరకాయ ప్రవేశం చేశాడు… తన ఆహార్యం, తన లుక్కు, తన భాష, తన ఎమోషన్స్ ఆ పాత్రకు కుదిరాయి… కృతి అందంగా ఉంది… కానీ పెద్దగా కథాపరంగా ప్రయారిటీ లేని పాత్ర… తెరపై ప్లజెంటుగా కనిపించింది… మడోనా సెబాస్టియన్ వోకే… అయితే..?
అవును గానీ రాహుల్ సాంకృత్యన్ భయ్యా… క్లినికల్ హిప్నాసిస్‌లో మనిషి పునర్జన్మ ఏమిటో ఖరారు చేయొచ్చా..? మనిషి పునర్జన్మ తరువాత పాత జన్మ తాలూకు తత్వం అలాగే కంటిన్యూ అవుతుందా..? కోర్టుల్లో ఈ పునర్జన్మల మీద విచారణలు కూడా జరుగుతాయా..? సరే, ఓ భిన్నమైన కథను ఎంచుకున్నవ్, రొటీన్ కథల చట్రం నుంచి తెలుగు సినిమాను బయట పడేయటానికి నువ్వూ ఎంతోకొంత ప్రయత్నిస్తున్నావు, గుడ్… గత కాలంలోకి కూడా బాగానే తీసుకెళ్లావు… వర్తమానానికీ గతానికీ ఓ పునర్జన్మ లింకు పెట్టావ్… అన్నీ వోకే… కానీ సామాజిక దురాచారాలపై తన రచనల ద్వారా పోరాడిన ఓ రచయిత హత్యకు గురికావడానికి కారణాలు మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు భయ్యా… పాటలు బాగా తీశావ్, కొన్నిచోట్ల క్లాసిక్ టచ్ కనిపించింది… ప్రత్యేకించి ఓచోట మూన్ లైట్ రొమాన్స్… ఎక్కడా అశ్లీలం, అసభ్యత జోలికి పోలేదు… దిక్కుమాలిన యాక్షన్ సీన్ల మీద ఆసక్తి చూపించలేదు… సాఫీగా నడిచిపోయింది, కానీ కాస్త క్లైమాక్సే కాస్త వీక్… ఓవరాల్‌గా రాహుల్ సాంకృత్యాయన్, నువ్వు పాస్…! ((ఈ కథనం పూర్తిగా ఓవర్సీస్ మిత్రుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాయబడింది…))
Share this Article