తమ కోవిడ్ వేక్సిన్ కోవి షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని నిజమేనని కంపెనీ అంగీకరించింది కదా… ఐతే చాలా తక్కువ కేసుల్లో మాత్రమేనని చెప్పుకుంది, కంపెనీపై పరిహారం దావాలు వేయడానికి ఇండియాలో ఉన్న అడ్డంకుల గురించి, వేక్సినేషన్ తరువాత ఎన్ని నెలల వరకూ ఆ ప్రభావం ఉంటుందనే వివరాలు గట్రా బోలెడు వచ్చాయి…
అదే సందర్భంలో మన భారత్ బయోటెక్ వాళ్లు తెర మీదకు వచ్చి తమ వేక్సిన్ కోవాక్సిన్ సేఫ్ అనీ, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవనీ, సంపూర్ణంగా ప్రయోగపరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందాకే రిలీజ్ చేశామని చెప్పుకుంది గుర్తుంది కదా… దీంతో కోవాక్సిన్ తీసుకున్న కోట్లాది మంది హమ్మయ్య అనుకున్నారు… కానీ టైమ్స్ నవ్ మీడియా, ఎకనమిక్ టైమ్స్ తదితర మీడియా మరో బాంబు పేల్చాయి…
Ads
2021 జనవరిలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ యూజ్ కింద ఈ వేక్సిన్‌కు ఆమోదముద్ర వేసింది… బెనారస్ హిందూ యూనివర్శిటీ ఆధ్వర్యంలో సాగిన ఓ స్టడీ ప్రకారం ఈ కోవాక్సిన్ వేసుకున్న వాళ్లలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట… AESI ప్రభావం గురించి మహిళల మీద సాగించిన ఈ స్టడీలో రుతుస్రావ సమస్యలు, హైపో థైరాయిడిజం సహా మరికొన్ని సమస్యలూ కనిపించాయట…
కోవిషీల్డ్ వల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ పడిపోవడం వంటి టీటీఎస్ సమస్యలు రిపోర్టయ్యాయి కదా, కోవాక్సిన్ వల్ల ఆల్రెడీ ఇమ్యూనిటీ, కోమార్బిడిటీ సమస్యలున్నవాళ్లలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట… ప్రత్యేకించి కౌమార దశలోని వాళ్లకు… ఏయే సమస్యలు ఎంత శాతం కనిపించాయో ఆ రిపోర్ట్ వెల్లడించి, మరింత సీరియస్ పరిశోధన అవసరమనీ తేల్చింది…
బీపీ, శ్వాసకోశ సమస్యలు వంటివి ఆల్రెడీ ఉన్నవాళ్లలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట… సరే, ఆ రిపోర్ట్, ఆ స్టడీ కోసం తీసుకున్న శాంపిళ్ల సంఖ్య గట్రా తక్కువే కావచ్చుగాక… కానీ కోవిషీల్డ్ మాత్రమే కాదు, కోవాక్సిన్ కూడా అంత సేఫేమీ కాదనీ, ఎమర్జెన్సీ యూజ్ పేరిట ప్రయోగపరీక్షల ఫలితాల్ని పూర్తిగా నిర్ధారించుకోకుండానే రిలీజ్ చేసేశారనే సందేహాలకు బలం చేకూరుతోంది…
రేప్పొద్దున ఈ స్టడీ రిపోర్టు మీద ఖండనలు, వివరణలు కనిపించవచ్చుగాక… కానీ కోట్లాది మందికి వేక్సినేషన్ జరిగింది, అప్పటికి అర్జెంటుగా ఉపయోగించాలనే కారణంతో ఆమోదముద్ర వేశారు సరే, తరువాతనైనా కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య సంస్థల నిఘా, అధ్యయనం కొనసాగి ఉండాలి కదానే కీలకప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి జవాబు లేదు ఇప్పటికీ..! ప్రధాని నుంచి మాములు మనిషి దాకా అందరూ తీసుకున్నారు కదా అంటారా..? ఐనాసరే, సైడ్ ఎఫెక్ట్స్ మీద శాస్త్రీయమైన ఫాలోఅప్, ఓ నిర్దిష్ట విధానం అనుసరణ ఎందుకు లోపించిందనేదే కదా అసలు ప్రశ్న..!
Share this Article