.
సల్మాన్ ఖాన్ పనైపోయిందా..? ఇక రిటైర్ కావడం బెటరా..? ఇంత పేలవమైన నటన మునుపెన్నడూ ఏ సినిమాలోనూ కనిపించలేదు…… ఇలాంటి విమర్శలు జోరుగా వస్తున్నాయి… అవును, సికిందర్ మరీ నాసిరకం సినిమా… ఏ దశలోనూ వీసమెత్తు థ్రిల్ కలిగించని బోరింగ్ హెడేక్ మూవీ…
చివరకు సల్మాన్ ఫ్యాన్స్‌లో కూడా అసంతృప్తి… కథెందుకు… కాకరకాయ ఎందుకు..? స్టార్ కాస్ట్ ఉంటే చాలు, సినిమా నడుస్తుందనే పిచ్చి భ్రమల్లో బతికే నాగవంశీ వంటి టాలీవుడ్ పెద్దలు కూడా ఓసారి సికందర్ చూసి, పాఠం నేర్చుకుంటే బెటర్… ఓ పాపులర్ హీరో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో సక్సెస్ సాధించడం అనేది ఈరోజుల్లో అంత వీజీ కాదు…
Ads
అసలే మురుగదాస్ దర్శకుడు… ఒకప్పుడు ఏక్‌సేఏక్ బంపర్ హిట్లు, కొత్తతరహా కథలతో ఉర్రూతలూగించిన దర్శకుడు ఇతనేనా అనిపిస్తుంది… సర్కార్, దర్బార్… తరువాత ఈ సికందర్… శంకర్‌లాగే ఇతనిలోనూ ఓ మంచి క్రియేటివ్ డైరెక్టర్ చనిపోయినట్టేనా..? అవును, సల్మాన్ ఖాన్ కూడా హిట్ చూడక ఎంతోకాలమైంది..?
మరొకటి చెప్పుకోవాలి… జాతీయ స్థాయిలో అనూహ్యంగా వేల కోట్ల వసూళ్ల సినిమాలతో జైత్రయాత్ర సాగిస్తున్న రష్మిక మంథాను బ్రేక్ పడినట్టే దీంతో..? ఫాఫం సినిమాలో ఆమె పాత్ర బాగానే ఉన్నా, కథ ఆమె చుట్టే తిరిగినా, ఆమె లోపం ఏమీ లేకపోయినా సరే, స్థూలంగా సినిమాయే బాగాలేకపోతే తనొక్కతీ ఏం చేయగలదు..? సల్మాన్ వంటి హీరోయే చేతులెత్తేసిన స్థితిలో…
కాజల్ అగర్వాల్ ఈ పాత్రకు ఎందుకు అంగీకరించిందో బహుశా ఆమెకు కూడా తెలియదేమో… పిచ్చి నిర్ణయం… ఇలాగే పాత్రల ఎంపిక కొనసాగిస్తే ఇక ఆమె కెరీర్ ముగిసినట్టే అనుకోవాలి… పూర్ సెలక్షన్…
ఈమధ్య ఎక్కడో అన్నాడట సల్మాన్… మా సినిమాల్ని సౌత్‌లో చూడరు, మావాళ్లు మాత్రం సౌత్ సినిమాలు తెగచూస్తారు అని… ఓ అక్కసు కనిపిస్తోంది మాటల్లో… ఎస్, సల్మాన్, ఇలాంటి సినిమాల్ని మా మొహాన విసిరి కొడితే ఎవడు చూడాలి..? దమ్మున్న సినిమాలు కాబట్టే సౌత్ హీరోల సినిమాల్ని నార్త్ ప్రేక్షకులు చూస్తున్నారు, చూస్తారు…
జనం ఇంత ఛీత్కరిస్తున్నా సరే, మీ లోపాలు మీకు అర్థం కావు, చేసుకోవాలనే సోయి కూడా లేదు మీకు… హైదరాబాద్ సహా పలు సౌత్ నగరాల్లో స్ట్రెయిట్‌గా హిందీ సినిమాలు చూసే ప్రేక్షకులున్నారు… ఎటొచ్చీ పిచ్చి సినిమాలను గుడ్డిగా హీరో మీద అభిమానంతో చూసే దుస్థితిలో లేరు సౌత్ ఆడియెన్స్… పైగా ఔట్ డేటెడ్ రెండు మూడు కథల చెత్తా మిక్సింగ్ స్టోరీని…! అదీ అసలు విషయం…
ఓ రాజు, ప్రజలు ప్రేమిస్తుంటారు… భార్య మీద పిచ్చి ప్రేమ… ఆమె మరణిస్తే ఈ హీరో ఆమె కోరిక మేరకు అవయవదానం చేస్తాడు… వాళ్లను చూడటానికి వెళ్లే క్రమంలో భార్య మరణ కారణాల్ని, కారకుల్ని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకుంటాడు… అదే కథ… సల్మాన్ వంటి హీరో ఏడుస్తూ కూర్చుంటే ఎవడు చూస్తాడు డియర్ మురుగదాస్..?
పైగా బలమైన విలన్ లేడు… దాంతో హీరో పాత్ర ఎలివేట్ కాలేదు… సత్యరాజ్ తేలిపోయాడు… వెరసి ఏ విషయంలోనూ సల్మాన్ ఖాన్ సికిందర్ ప్రేక్షకులను మెప్పించేలా లేదు… మొన్న వచ్చిన ఛావా, స్కైఫోర్స్ మాత్రం కాస్త మినహాయింపు… హిందీ సినిమాల ఫ్లాపుల ప్రయాణం కొనసాగుతూనే ఉంది… సికిందర్ అందులో ఒకటి…!! ఈ సికందర్ విజేత కాదు, పరాజితుడు..!!
Share this Article