.
నిజంగా సిల్క్ స్మిత గురించి నిజాలు తెలుసా అందరికీ..? ఇంటిమేట్ సీన్లు, కేబరే డాన్సులు, వ్యాంప్ తరహా పాత్రలతో ఓ ఉర్రూతలూగించిన కేరక్టర్ నిజజీవితం ఏమిటో తెలుసా అందరికీ..?
ఈ ప్రశ్నకు సమాధానం లేదు… విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ చూసి అదే నిజజీవిత చరిత్ర అనుకుంటున్నారు అందరూ… కానీ కాదు… అది జస్ట్, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నానా చెత్తా రంగరించిన చరిత్ర… అందులో విద్యబాలన్ ఓ పాత్ర…
Ads
నిజానికి ఆమె ఎవరు..? తెలుగు మహిళ… ఏలూరు ఏరియా కొవ్వలి సొంతూరు… పేద కుటుంబం, నాలుగో తరగతితోనే ఆగిపోయింది ఆమె చదువు… అప్పట్లో ఆడపిల్ల చదువు అంటే అంతే కదా…
14 ఏళ్లకే పెళ్లి చేశారు… కుదురుగా లేదు సంసారం… భర్త, కుటుంబం పెట్టే వేధింపులతో విసిగి, ఓ రాత్రి ఏకంగా చెన్నై చేరింది… అక్కడ ఓ తన ఆంటీ దగ్గర చేరింది… తన ప్రథమ టార్గెట్ సినిమాలు కానేకాదు… జస్ట్, ఆ సంసార బంధాల నుంచి బయటపడటం…
ఓసారి ఏవీఎం స్టూడియోస్ సమీపంలోని ఫ్లోర్ మిల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఒక నిర్మాత దృష్టిలో పడింది… ఆ అప్పియరెన్సులోనే ఓ మాస్ మసాలా అప్పీల్ కనిపించింది తనకు… ఆ కళ్లు, ఆ పెదాలు… ఫిక్సయిపోయాడు… తన సినిమాలో తీసుకున్నాడు… అలా మొదలైంది తన కెరీర్…
వంది చక్రం అనే సినిమా… తమిళం… దుమ్ము రేపింది సినిమా… అందులో ఆమె పాత్ర పేరు సిల్క్, అప్పటికే ఆమె తన పేరును విజయలక్ష్మి నుంచి స్మితగా మార్చుకుంది, సినిమా తెర కోసం… దానికి సిల్క్ జతచేరింది ఈ సినిమాతో… ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు…
పిచ్చి డాన్సులు, గెంతులు… నాలుగైదు నిమిషాలు ఆమె కనిపించకపోతే సినిమా నడవదు అనేంత సెంటిమెంట్… స్టార్ హీరోల సినిమాలు ఆమె కోసం ఆగిపోయాయి… జస్ట్, నాలుగేళ్లు… 200 సినిమాలు… ప్రపంచ చరిత్రలోనే ప్రథమం… కానీ చివరకు ఏమైంది..?
సరే, అప్పట్లో… అంటే 1984లోని ఫిలిమ్ ఫేర్ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది… ముఖ్యాంశాలు ఓసారి సంక్షిప్తంగా పాయింట్ల వారీగా చూద్దాం…
- నువ్వు పెద్ద అహంకారివి, పొగరుబోతువి, నిర్మాతలను కూడా పురుగుల్లా చూస్తావు నువ్వు… తోటి ఆర్టిస్టులే కాదు, సీనియర్ ఆర్టిస్టుల పట్ల కూడా అగౌరవమే… నిజమేనా..?
. తప్పు… నేను వాళ్లకు కావాలి… నాకు వాళ్ల సినిమాల్లో పాత్రలు కావాలి… ఇక అవమానించడం, అగౌరవపరచడం ఏముంటుంది..? నిజం చెప్పండి, నిజంగానే వాళ్లను అవమానిస్తే ఇన్ని సినిమాల్లో పాత్రలు ఇస్తారా నాకు..? అవన్నీ మీడియా క్రియేట్ చేసిన పిచ్చి గాసిప్స్… బతకడానికి చెన్నై వచ్చినదాన్ని ఎలా బతకాలో తెలియదా నాకు..?
- ఎంతసేపూ ఈ వ్యాంప్ పాత్రలేనా..? ఎన్నాళ్లు ఇలా..?
. ఆ పాత్రలే వస్తున్నాయి… జనమూ అవే కావాలంటున్నారు… నేనేం చేయాలి..? నాకూ ఉంది, సావిత్రిలాగా, సుజాతలాగా, సరితలాగా చేయాలని… కానీ ఆ పాత్రలు ఇచ్చేవాడెవడు..?
- వర్తమానంలో నువ్వు అభిమానించేది..?
. భారతి రాజా చాలా మంచి దర్శకుడు. ఆయనతో పాటు బాలు మహేంద్రతో కూడా పనిచేయడం ఇష్టం. ఆయన పరిపూర్ణవాది. నేను నటించిన ఉత్తమ నటుడు కమల్‌హాసన్. తెలుగులో చిరంజీవి బెటర్. ఇద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు కూడా…
- శివాజీ గణేషన్‌ను కూడా అవమానించావట… ఆయన ముందే కాళ్లు బారజాపి కూర్చున్నావట..?
. తప్పు, రిలాక్స్ అవుతున్నప్పుడు అలా కూర్చుంటే నాకు ఉపశమనం… చిన్నప్పటి నుంచీ అంతే… అంత పెద్ద సీనియర్ నటుడిని నేనెందుకు అగౌరవపరుస్తాను..? అలా చేస్తే ఇండస్ట్రీలో ఉంటానా..? ఎవడో జర్నలిస్టు ఏదో రాస్తాడు… పట్టించుకోను…
- ఎంజీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ ప్రోగ్రామ్ బహిష్కరించావుట… ఎంత సాహసం..? తనను ధిక్కరిస్తే చెన్నై సినిమా రాజకీయాల్లో దేవుడిని ధిక్కరించినట్టే కదా…?
. ఇదీ తప్పే… మరుసటి రోజు నేను చిరంజీవితో కలిసి ఓ తెలుగు సినిమా షూటింగుకు వెళ్లాలి… టైమ్ లేదు, ఆ ప్రోగ్రామ్ వెళ్లలేదు… టైట్ షెడ్యూల్… నేనేం చేసి ఉండాల్సిందో మీరు చెప్పండి… నిర్మాతకు నష్టం కలిగించాలా..? అలా చేస్తే బట్టకట్టగలనా ఈ ఇండస్ట్రీలో…
- నీమీద ఈ ప్రచారాలు ఏమిటి..? నీ అసాధారణ ప్రవర్తన వెనుక ఏముంది నీకు..?
. మీకో సంఘటన చెబుతాను… ఎంఎస్ విశ్వనాథన్ తెలుసు కదా… ఏదో కమర్షియల్ టూర్ కోసం ఆయనతోపాటు సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది… ఆయన కుటుంబం మొత్తం వచ్చింది… నేను స్వతహాగా సిగ్గరిని… స్టేజీల మీద డాన్సులు చేయలేను… మాట్లాడలేను కూడా… ఆయనకు ముందే చెప్పాను కూడా… కానీ ప్రేక్షకులు డాన్స్ కావాలని చుట్టుముట్టారు… పోలీసులు నన్ను రూములోకి తీసుకుపోవల్సి వచ్చింది…
ఆయనేమంటాడూ అంటే… నా గదికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తే తప్ప ఫ్యాన్స్ ఊరుకునేట్టు లేరు అంటాడు… నేను నో అన్నాను… అప్పటికప్పుడు నన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు… ఇండస్ట్రీ అలా ఉంటుంది… రా పాస్‌పోర్టు కోసం నిర్వాహకుల్ని బతిమిలాడి చెన్నె చేరాను… కస్టమ్స్‌లో కొంత అపరాధ రుసుం చెల్లించాను… తీరా ఆరుగురు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా చెప్పుకుని వచ్చారు, మొత్తం చెక్ చేశారు, రాంగ్ కంప్లయింట్ అని వెళ్లిపోయారు…
నేను ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలి…? ఇంత దుర్మార్గమైన వాతావరణంలో నేనెలా బతకాలి..? నేను స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఎవడో కంప్లయింట్ చేశాడట… ఇవన్నీ తట్టుకుని నిలబడ్డాను కాబట్టే ప్రతి ఒక్కరికీ నామీద కోపం, ఏదో అక్కసు…!!
ఇదీ చదవండి ఓసారి… https://muchata.com/the-last-day-in-silk-smithas-life/
Share this Article