.
భరత్ భూషణ్… 1920లో మీరట్‌లో పుట్టాడు… తండ్రి రాయ్ బహదూర్ మోతీలాల్ ఓ లాయర్… కొడుకు కూడా తనలాగే లాయర్ కావాలని కోరిక… కానీ భూషణ్‌కు సినిమా నటుడు కావాలని కోరిక… అలీగఢ్‌లో డిగ్రీ అయిపోగానే ముంబైకి వచ్చాడు… ఫేమస్ డైరెక్టర్ మెహబూబ్ ఖాన్‌కు ఇవ్వడానికి ఓ రికమండేషన్ లెటర్ కూడా పట్టుకొచ్చాడు…
అలీబాబా్ చాలీస్ చోర్ అనే సినిమా పనిలో సదరు మెహబూబ్ ఖాన్ బిజీ… భూషణ్ కష్టమ్మీద ఆయన్ని పట్టుకుని ఈ లెటర్ చూపించాడు… కానీ మెహబూబ్ దగ్గర ఒక్క పాత్ర కూడా లేదు… కనీసం ఆ నలభై మంది దొంగల్లో ఒక దొంగ పాత్ర కూడా దొరకలేదు… నిరాశపడిపోయాడు భూషణ్… ఏదో చాయ్ బండి దగ్గర ఎవరో చెప్పారు… డైరెక్టర్ రామేశ్వరశర్మ భక్త కబీర్ సినిమా తీస్తున్నాడు, వెళ్లి ట్రై చేయి అని..!
అవకాశం అక్కడే ఉంది… సదరు శర్మ భూషణ్‌కు ఆ సినిమాలో కాశి నరేష్ వేషం ఇచ్చాడు… నెలకు 60 రూపాయల జీతం… ఎన్నాళ్లు షూటింగ్ అంటే అన్నాళ్లకే అగ్రిమెంట్… 1942లో సినిమా రిలీజైంది… భూషణ్ అదృష్టం బాగుంది… అనేక సినిమాలు చేశాడు… బ్రదర్ హుడ్, సావన్, జన్మాష్టమి, బైజు బావ్రా, మిర్జా గాలిబ్ తదితరాలు…
Ads
భూషణ్‌కు మరింత అదృష్టం పట్టింది… బంగళాలు కొన్నాడు, ఖరీదైన కార్లు కొన్నాడు… ఈలోపు భూషణ్ అన్న రమేష్ ఓ సలహా ఇచ్చాడు… డబ్బు ఉంది కదా, మనమే సినిమా తీద్దాం అని..! అలాగే చేద్దామన్నాడు భూషణ్… బసంత్ బహార్, బర్సాత్ కీ నైట్ సినిమాలు సూపర్ హిట్… పేరొచ్చింది… సర్కిల్ పెరిగింది… డబ్బొచ్చింది… అన్నీ బాగుంటే మరి విధికేం పని ఇక… వంకర చూపు పడేసింది…
అదే సోదరుడు రమేష్ ఇంకో సలహా ఇచ్చాడు… ఇంకా సినిమాలు తీద్దాం, నా కొడుకును హీరోను చేద్దాం అన్నాడు… భూషణ్ ఎప్పటిలాగే సరే అన్నాడు… తీరా ఏమైంది…? తీసిన సినిమా తీసినట్టుగా ఫట్… డబ్బులన్నీ మాయం… పైగా అప్పులు… అందరూ మొహాలు చాటేశారు… వచ్చి పలకరించే జాడ లేదు… అప్పటిదాకా నమస్తేలు పెట్టి, మస్తు మర్యాద చూపిన వాళ్లంతా కనిపించడం మానేశారు… అంతేకదా, వెలిగే సూర్యుడికే సలాం కొడుతుంది ఇండస్ట్రీ…
బంగళాలు అమ్మేశాడు… కార్లు కూడా… పెద్దగా ఫీల్ కాలేదు, నిర్వికారంగా ఉన్నాడు… కానీ తన లైబ్రరీ బుక్స్‌ను రద్దీ పేపర్ కింద అమ్మే క్షణం వచ్చినప్పుడు మాత్రం విలవిల్లాడిపోయాడు… పేరు పోయింది… ప్రతిష్ట పోయింది… ఒకప్పుడు కార్లలో తిరిగిన తను బస్సు కోసం క్యూలలో నిల్చుంటున్నాడు…
ఓరోజు ఓ జూనియర్ ప్రొడ్యూసర్… జూనియర్ ఆర్టిస్టుగా ఓ వేషం ఉంది చేస్తావా అని ఆఫర్ ఇచ్చాడు… ఇదీ డెస్టినీ అంటే..! ఏం చేస్తాడు..? ఆ పాత్ర పోషించాడు… కడుపు నిండాలి కదా… అనుకోకుండా ఏదో జబ్బు వచ్చి పడింది… దానికి చికిత్స లేదు, అసలు తనను పట్టించుకున్నవాడే లేడు…
1992లో చివరకు కన్నుమూశాడు అనామకంగా… చివరి క్షణంలో తను చెప్పిన మాట… ‘‘మరణం గురించి అందరికీ తెలుసు… కానీ బతకడం ఎలాగో మాత్రం చాలామందికి తెలియదు… నాకైతే అస్సలు తెలియదు, తెలియలేదు… తెలిసొచ్చేనాటికి బతుకే ముగిసిపోతోంది…’’
Share this Article