అనుకోకుండా ఎన్టీవీలో రష్మితో ఓ యాంకరిణి సంభాషణ వీడియో ఖర్మకాలి చూడబడ్డాను… జబర్దస్త్‌లో వెకిలి పదాలు, వెగటు భాష, అవన్నీ చూస్తూ పిల్లలు ఏమైపోతారు అంటూ ఈమె ఏదో అడిగింది… దానికి రష్మి ‘‘అవునండీ, ఆ షో రాత్రి తొమ్మిదిన్నర తరువాత… అప్పుడు పిల్లల్ని టీవీలు ఎవరు చూడమన్నారు..? పడుకోవాలి కదా… అది అడల్ట్స్‌ను ఉద్దేశించిన షో…’’ అని ఏదో సొల్లింది… అవును, అంతే… ఒక రష్మి నుంచి, ఒక అనసూయ నుంచి, మింగుడు భాషకు ప్రాచుర్యం కల్పించిన ఓ హైపర్ ఆది నుంచి అంతకుమించి ఏమీ ఆశించలేం… బూతుకు పట్టం కట్టే మల్లెమాల కంపెనీ నుంచి కూడా అంతే… అంతటి ముసలిపరువంలోని రామోజీరావే ఆ టేస్టుకు ముగ్డుడైపోతుంటే ఇంకెవరు ఏం మాట్లాడతారు..?
కానీ జ్ఞానపీఠ అవార్డు పొందిన ఓ పెద్ద కవి కూడా అలాగే మాట్లాడితే దాన్ని ఏమనాలి..? దానికి సరైన పదం ఎవరికి వాళ్లే అన్వేషించుకోవాలి… 1972 నాటి సినిమా పత్రిక విజయచిత్రను తిరగేస్తుంటే ఆయన సమర్థన ఒకటి సింగిల్ కాలమ్‌లో నిలువునా కనిపించి, భా-ఘా ఆశ్చర్యపరిచింది… ఒక్కొక్కప్పుడు రచయిత మామూలుగా రాసే మాట, చిత్రీకరణకు వచ్చేసరికి అసభ్యత స్ఫురించేలా కనిపించవచ్చునట… నన్నుచూడు అని రాస్తే, చిత్రీకరణలో మొహం గాకుండా వక్షభాగాన్ని చూపిస్తే రచయితను తిడితే ఎలా..? తనెలా బాధ్యుడు అని ఉల్టా దబాయిస్తున్నాడు ఆయన…
అశ్లీల, ద్వంద్వార్థ పదాలకు బాధ్యులు రచయితలే కాదు, ఆ దృశ్యమూ, ఆ పాత్రలు బాధ్యత వహించాలి అట… ఆహా, ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి… ఏదో ఏదో అవుతున్నది అని రాస్తే అది మామూలు నుడికారం, నాకు అదోలా ఉంది, ఏదోలా ఉంది, గుండెలో ఏదో అవుతున్నది అని మనం సామాన్యంగా వాడుతూ ఉంటాం… అందులో అసభ్యత, అశ్లీలం ఉండవు, చిత్రీకరణలో అసభ్యత కనిపించవచ్చును… అని ఏదేదో విఫలసమర్థన ప్రయత్నం చేశాడు… నన్ను చూడు అని రాసినా, ఏదో ఏదో అవుతున్నదీ అని రాసినా… సదరు దర్శకుడు ఏం చూపించడానికి అలా రాయించుకున్నాడు అనేది కదా అసలు ప్రశ్న… దాన్ని దాటేసి… నో, నో, మేం శుద్ధపూసలం అని దులిపేసుకుంటే ఎలా సినారె…?
Ads
సపోజ్, చల్లగా లేస్తోంది, మెల్లగా లేస్తోంది అని రచయిత రాశాడు… ఏ భావాన్ని స్ఫురించడానికి అలా రాశాడు…? దాన్నెలా చిత్రీకరిస్తారో తెలిసే కదా రాసింది… గుగ్గుగుగ్గు గుడిసె ఉంది, మమ మమ మంచముంది అని రాసిన రచయితకు తెలియదా ఏ సందర్భంలో దాన్ని వాడతారో… ఓరోరి యోగి నన్ను కుదిపెయ్ రో, నన్ను నమిలెయ్ రో, నన్ను కొరికెయ్ రో అని రాయించబడిన పాట దేనికోసమో కవికి తెలియదా..? ఎక్కడెక్కడో చెయ్ వెయిరా, అక్కడేదో చేసెయ్ రా, కసి కౌగిలివై రా రా, నను పిట పిట పిండెయ్ రా… ఈ పాట సంగతేమిటి..? ఇలా బొచ్చెడు… అసలు ఆత్రేయను బూత్రేయ అని పిలిచేవాళ్లు కదా…
వేటూరి మీగడ అనే పదాన్ని తన పాటల్లో యాభైవేల సార్లు రాసి ఉంటాడు బహుశా… తొడిమ తెరిచే తొనల రుచికే… కూడా రాసింది తనే… ఇదేమిటండీ కవిగారూ అనడిగితే, నిర్మాత అడిగిన సరుకును సప్లయ్ చేయాలి కదా అంటాడు, అదొక పిచ్చి సమర్థన… ఏదో చివరలో పూజా హెగ్డే కాళ్ల భజన చేశాడు గానీ తన కెరీర్‌లో సిరివెన్నెల చాలావరకూ కాస్త పద్ధతిగానే ఉన్నాడు…
బూతు పాటలు నిజంగా 70, 80, 90 బాపతు సినిమాల్లోనే ఎక్కువ… అదీ ఎన్టీవోడి మాస్ పాటల్లో మరీ ఎక్కువ… ఇప్పటి పాటల్లో ఆ వెగటు పదాల వాడకం తక్కువే… అప్పటి చక్రవర్తి తరహా సంగీతం, ఆ పాటలు వింటుంటే, ఇప్పటి పాటలు చాలా చాలా మెరుగు అనిపిస్తాయి… అఫ్‌కోర్స్, ఇంత పెద్దమనిషి ఫోజు పెట్టే నీతుల కీరవాణి కూడా అతీతుడేమీ కాదు… ఓ టెన్నీసు బంతుల పాపా నీ బంతులకంతటి ఊపా..? వంటి తిక్క ప్రయోగాలు బోలెడు… తెలుగు సినిమా పాటల్లోని అశ్లీలం గురించి రాస్తూ పోతే ఒడవదు, తెగదు… సినారె సమర్థన చూశాక, రష్మి సమర్థన చూశాక… పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు… పాపం శమించుగాక..!! (రెండేళ్ల నాటి స్టోరీ ఇది)…
Share this Article