.
Sai Vamshi ……… స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి… ఎవరికి బిడ్డల్ని కనాలి?
అవును! స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి? ఎవరికి బిడ్డల్ని కనాలి? క్షయ రోగంతో విచిత్రవీర్యుడు మరణిస్తే అంబిక, అంబాలిక వ్యాసుడి ద్వారా బిడ్డల్ని కన్నది ఎవరికి? వారు వ్యాసుడి పిల్లలా? విచిత్రవీర్యుడి పిల్లలా? శాపం వల్ల పాండురాజు సంసారానికి దూరమైతే కుంతి ధర్మరాజు, భీముడు, అర్జునుడినీ, మాద్రి నకుల, సహదేవులను కన్నది దేవతలకా? పాండురాజుకా? వారు ఎవరి బిడ్డల్ని కన్నట్లు?
Ads
వంశాభివృద్ధి పేరిట స్త్రీ ఒక సాధనంగా మారిందిన అనుకోవాలా? భారతం నిజంగా జరిగిందని నమ్మేవారు, ఇవాళ తమ భార్యకో, కోడలికో పిల్లలు లేకపోతే దేవతల్ని పిలవగలరా? మహర్షుల్ని పిలిచి కార్యం జరిపించగలరా? పోనీ ఒకరి భార్య మరో వ్యక్తితో బిడ్డని కంటానంటే ఒప్పుతారా? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఇటీవల దేశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏమని చెప్తోంది?
సరే.. ఇలాంటి సమస్యే ఓ మహిళకు వచ్చింది. పేరు ‘సింగారవ్వ’. తండ్రి నీచుడు. చిన్నతనంలోనే శవం చేత కూతురికి తాళి కట్టించిన దుష్టుడు. ఆ తర్వాత తాళి తెంచేసి, ఆస్తి కోసమే అదంతా చేశానని సర్దిచెప్పాడు. తన ఇంట్లో పనిచేసే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసి ఆమె తమ్ముడు మరియ కత్తితో అతణ్ని చంపేందుకు రాగా, ఆ వేటుకు ఆమెనే బలిచేశాడు. అక్కను చంపాడన్న నేరం మోపి మరియను పోలీసులకు పట్టించాడు.
సింగారవ్వ పెరిగి, పెద్దయ్యాక తండ్రి ఓ జమీందారు సంబంధం చూశాడు. వైభవంగా పెళ్లి చేశాడు. జమీందారు భవనానికి సింగారవ్వ తన స్నేహితురాలు శీనింగితో కలిసి వెళ్లింది. భర్తది రాజవంశం. అతను మంచివాడే కానీ నాటకాల పిచ్చి. భార్య కన్నా నాటకాలే ప్రాణం. అతను అమాయకుడని, ఇట్టే మోసపోగలడని సింగారి గ్రహించింది.
అయితే నపుంసకుడన్న విషయం మరికాస్త ఆలస్యంగా తెలుసుకుంది. స్త్రీ ఒళ్లు తాకితే చాలు మూర్చతో పడిపోతాడు. అలాంటి వ్యక్తితో సంసారం ఎలా? బిడ్డను కనడం ఎలా? రకరకాల ఆలోచనల అనంతరం ఓ స్వామీజీ కనిపించాడు. నట్టనడిరాత్రి వేళ పడకగదిలో పూజ చేస్తే పిల్లలు పుడతారన్నాడు.
నిజమని నమ్మి భర్తకు తెలియకుండా అతణ్ని తన భవనానికి పిలిచింది. వచ్చినవాడు పూజ చేస్తూ గుండె ఆగి చచ్చాడు. దేవుడా! ఇప్పుడేంటి గతి? ఆ శవాన్ని ఎలా మాయం చేయాలని ఆమెకూ, ఆమె స్నేహితురాలికీ ఆందోళన.
అప్పుడొచ్చాడు మరియ ఆపద్బాంధవుడిలా! జైలుకు వెళ్లినవాడు ఎలా తిరిగొచ్చాడో తెలియదు. కానీ ఈ ఆపదలో అతనే సాయం చేయాలి. కానీ అతని ఉద్దేశం వేరే. సింగారవ్వ తనతో పడుకుంటేనే ఈ పనిచేస్తానని షరతు పెట్టాడు. లేకపోతే స్వామీజీ చావు విషయం నీ భర్తకు చెప్తానన్నాడు.
ఆ క్షణాన ఆమె ఏమీ చెప్పలేదు. అతను బలవంతం చేయలేదు. గండం గడిచింది. స్వామీజీ శవం మాయమైంది. కానీ మరియ ఆ ఇంటిని వదలలేదు. ఆమె భర్తకు అనుచరుడిగా మారాడు. చుట్టపుచూపుగా ఇంటికొచ్చిన ఆమె తండ్రికి మరియ కనిపించాడు. పగతో తనను చంపుతాడన్న భయం పుట్టింది. కూతురితో బేరం మొదలుపెట్టాడు. ఏమని?
‘నీకెలాగూ పిల్లలు పుట్టరు. నీ తమ్ముడు, అంటే నా కొడుకుని దత్తత తీసుకొని, ఆస్తంతా వాడి పేరు మీద రాసెయ్’ అన్నాడు. ఈ ఆలోచనతోనే తన తండ్రి తనకొక నపుంసకుడి చేత పెళ్లి చేయించాడన్న విషయం సింగారవ్వకు అర్థమైంది. తండ్రి మీద అసహ్యం కలిగింది. అతని మాటకు ససేమిరా అంది.
అలా అయితే మరియతో నీకు సంబంధం ఉందని నీ భర్తకు చెప్తానని బెదిరించాడు. అటు భర్తతో సుఖం లేదు. ఇటు ఇంట్లో మరియ ఒత్తిడి, ఇప్పుడు తండ్రి తన మీద చేస్తున్న అన్యాయం. సింగారవ్వకు లోకమంతా చీకటిగా మారింది. ఏం చేసేది? తను బిడ్డను కంటేనే భవిష్యత్తు. కానీ ఎలా?
భర్తను బలవంతం చేయక తప్పదు. చేసింది. కానీ ఆయన మూర్చపోవడం తప్ప లాభం లేదు. ఇటు తండ్రి నుంచి ఒత్తిడి. ఆ క్షణాన ఆమెను మరోసారి మరియ ఆదుకున్నాడు. ఆమె తండ్రిని చంపి తన పగ తీర్చుకున్నాడు. ఆమె భర్త పోగొట్టుకున్న ఆస్తి పత్రాలను తిరిగి తెచ్చాడు.
సింగారవ్వ తండ్రి మీద పగ తీర్చుకోవడం తప్ప తనకు ఆమె మీద ఏ కోరికా లేదని వివరించాడు. ఆమెకు తత్వం బోధపడింది. తన జీవితాన్ని తానే దిద్దుకోవాలని నిశ్చయించుకుంది. అతనితో కలిసి, శారీరక సుఖాన్ని పొందింది. గర్భవతి అయ్యింది.
భర్త అమాయకుడే కానీ, ఏమీ తెలియని వాడు కాదు. ఆమెను నిలదీశాడు. సింగారవ్వకు ఇప్పుడు భయం లేదు. తనకంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉంది. ధైర్యంగా నిజం చెప్పింది. తానేమీ తప్పు చేయలేదని, బిడ్డలు లేని ఆడదానిలా బతకలేకే ఈ పని చేశానని వివరించింది.
భర్త తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన పనిని ఉత్తరంలో రాసి, తుపాకీతో తనను తానే కాల్చుకుని మరణించాడు. మరోసారి సింగారవ్వ జీవితం అగాథంలో పడే సమయాన మరోమారు మరియ వచ్చి ఆ ఉత్తరాన్ని చింపేసి, ఆ తుపాకీని పట్టుకొని తానే ఆయన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. జైలుకు వెళ్లాడు. సింగారవ్వ బతుకు బాగుపడింది. కొన్నాళ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది. కథ పూర్తయింది.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార రాసిన కన్నడ నవల ‘సింగారవ్వ మత్తు అరమనె ’(సింగారవ్వ మరియు రాజభవనం) కథ ఇది. ఈ నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు టి.ఎస్.నాగాభరణ కన్నడలో ‘సింగారవ్వ’ సినిమా తీశారు.
2003లో ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ఈ సినిమాలో సింగారిగా ప్రేమ అద్భుతంగా నటించారు. ఆమె భర్తగా నపుంసక పాత్రలో అవినాష్ (‘చంద్రముఖి’లో రామచంద్ర సిద్ధాంతి ఫేం) నటించడం నిజంగా సాహసం.
అత్యంత గంభీరంగా కనిపించే అవినాష్ ఆ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని, గొంతును పూర్తిగా మార్చుకున్నారు. కొత్త నటులు చాలా స్ఫూర్తి పొందాల్సిన విషయాలవి. ‘సింగారవ్వ మత్తు అరమనె’ నవలను కె.సురేష్ తెలుగులోకి ‘సింగారవ్వ’ పేరుతో అనువదించారు.
ఈ కథకున్న మరో విశేషమేమిటంటే, దర్శకురాలు సౌమ్య వర్మ దర్శకత్వంలో, ప్రముఖ కన్నటి లక్ష్మీ చంద్రశేఖర్ ప్రధాన పాత్రలో దీన్ని నాటకంగా మార్చారు. 2013లో పలు ప్రఖ్యాత వేదికలపై ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
మీరు ఈ సినిమా చూడండి. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అందమైన సంగీతం, అపురూపమైన సినిమాటోగ్రఫీ, గొప్ప నటన.. అన్నీ కలిసిన చిత్రం ఇది. అనువాద నవల కూడా చదవండి. కథలో కొంత మార్పు ఉన్నా రెండూ ఎంచదగ్గ విశేషాలే!
మరి నాటకం? ఎవరైనా ‘సింగారవ్వ’ కథను తెలుగులో నాటకంగా మారిస్తే బాగుంటుంది. ఆ ప్రయత్నం జరగాలి. – విశీ (వి.సాయివంశీ)
Share this Article