రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ చైత్ర హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు… తెలంగాణ పోలీసులు తమ తుపాకీకి ఏ ఎన్కౌంటర్ మరక అంటించుకోలేదు… న్యాయం జరిగిపోయింది… అబ్బే, పోలీసులు ఏమీ చేయలేదు… ఎలాగూ ఉరి తప్పదు, ఎన్కౌంటర్ తప్పదు, తప్పించుకోలేను అనే భయంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా..? ఎస్, అదే నిజమని నమ్మేద్దాం… ఖండించాల్సిన పనిలేదు, హక్కుల గుంజాటన అసలే అక్కర్లేదు… వాడు తన ఆత్మకు తనే జవాబు చెప్పుకున్నాడు, శిక్ష విధించుకున్నాడు… అంతే, అదే అనుకోవాలి… అదే బలంగా చెప్పాలి… ఎందుకు..? అలాంటోడికి ఈ లోకంలో బతికే హక్కు లేదు… అదొక చీడపురుగు… మన చట్టాలు, మన వ్యవస్థలు వాళ్లను శిక్షించలేవు… ప్రజలంతా చెప్పేది అదే… సో, ‘ఆత్మహత్య కథ’ను సమర్థిద్దాం… ఏం, దిశ ఎన్‌కౌంటర్‌ను సమర్థించలేదా..? చైత్ర నిందితుడినీ ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేయలేదా..? ఏదో ఒకటి… చచ్చాడా లేదా..? దట్సాల్…!!
నిజం ఏమిటంటే..? మన న్యాయవ్యవస్థ నేరస్థుల్ని వేగంగా శిక్షించలేదు… కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సత్వరం శిక్షించే ఖాకీ తుపాకీని మాత్రం బోనులో పెట్టి విచారిస్తుంది… అందుకే ఈ ఎన్కౌంటర్లు వంటి పాత పద్ధతులు పనికిరావేమో ఇప్పుడు… యూపీలో చూడండి, వాహనాలు బోల్తాకొడతాయి… ఒక ప్రమాదం… అంతే… శిక్ష పడాల్సిన వ్యక్తికి శిక్ష పడిపోతుంది, అంతే… సేమ్, ఆత్మహత్య కూడా..! ఇప్పుడూ హక్కులు కళ్లు తెరవొచ్చు, విచారణలకు ఆదేశాలు రావొచ్చు… జరగనీ, మన నేర శిక్షాస్మృతి తన విశ్వసనీయతను కోల్పోతున్న స్థితిలో… ఇదొక సంధిదశ… మంచికో చెడుకో… చర్చ జరగనీ… నిలువెల్లా నరకం అనుభవించిన ఓ ఆరేళ్ల పసిపాప ఆత్మ పకపకా నవ్వనీ… ఆ ఆత్మ కాస్త శాంతించనీ… ఇంతకుమించిన ప్రత్యామ్నాయాలు ఏమీ కనిపించని ‘న్యాయశూన్య దురవస్థ’లో… పోలీస్ మార్క్ తక్షణ న్యాయాన్ని వోకే వోకే అనాల్సిన స్థితి మనది…
Ads
పార్టీలు, నాయకులు, ప్రజలు, మీడియా, సోషల్ మీడియా బలంగా తీసుకొచ్చిన ఒత్తిడి… ‘నేనున్నాను’ అని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం స్పందించకతప్పని స్థితి… సాక్షాత్తూ ఓ మంత్రే చెప్పాడుగా, కాల్చేస్తాం అని… డిఫాక్టో సీఎం కేటీయార్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు అనే పాత ట్వీట్ మార్చేసి, వేట కొనసాగుతోంది అన్నప్పుడే తెలుసు… 10 లక్షల రివార్డు అన్నప్పుడే తెలుసు… బార్లు, వైన్లలో కనిపించొచ్చు, ఆర్టీసీ బస్స్టాండ్లలో కనిపించొచ్చు, సమాచారం ఇవ్వండి, ఫలానా రూపాల్లో ఉండొచ్చు అని ఫోటోలు రిలీజ్ చేసినప్పుడే తెలుసు… తెలుసు అంటే సందేహిస్తున్నారు అని..! ఇలాంటి వార్త ఏదో వినిపిస్తుందీ, బేస్ ప్రిపేర్ అవుతుందీ అని..! కాకపోతే ఈ సూసైడ్ కథ అనూహ్యం… జనం మెచ్చే సంఘటన ఇది… కాల్పులు, వాహనాలు తిరగబడటంకన్నా ఇదేదో సులువైన, చిక్కుల్లేని కొత్త పద్ధతిగా అనిపిస్తోంది జనానికి… ఈ వెధవ కామాంధుడి ప్రాణాలు పోతేపోనీలే, ఎవడికీ బాధ లేదు, కానీ… కొంపదీసి, ఓ కొత్త ఆనవాయితీగా మారిపోదు కదా…!! ఒక systematic legal procedure డిస్టర్బ్ కావడం లేదు కదా..!!
ప్రాథమిక సమాచారం ప్రకారం…. ఘట్కేసర్- వరంగల్ మధ్య స్టేషన్ ఘన్పూర్ మండలం, పామునూరు దగ్గర రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు… మృతుడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా అతడు హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించారట… ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది… ఐనా ఆ వివరాల్లో ఎవరికైనా ఏం ఆసక్తి ఉంటుంది..? ఆత్మహత్య, గుర్తింపు, కేసు నమోదు… ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంటుందిగా…!!
Share this Article