సింగర్ చిన్మయి… వర్తమాన సామాజిక అంశాలపైనా గొంతువిప్పుతుంది… వివక్షను కూడా ఇండస్ట్రీలో ఫేస్ చేసింది… ఏ ఇష్యూ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతుంది, సోషల్ మీడియాలో ఏదో కామెంట్‌తో తెర మీదకు వస్తుంది… అంతా వోకే… కానీ కొన్నిసార్లు ‘అతి’ చేస్తుంది… అదే ఆమెతో వచ్చిన చిక్కు…
నటి అన్నపూర్ణ విషయంలో కూడా అంతే… ఓవర్ రియాక్షన్… పైగా అన్నపూర్ణ మాటల్ని వింటూ వెక్కిరింపుగా మూతి తిప్పుతూ ఆమెను అవమానించింది ఓ సోషల్ మీడియా పోస్టులో… ఒకవైపు అన్నపూర్ణ నటనకు అభిమానిని అంటూనే వెకిలి ఎగతాళికి దిగింది… నిజానికి అన్నపూర్ణ ఏమందో, ఏ కంటెక్స్ట్‌లో ఏం చెప్పిందో పూర్వాపరాలు ఏమీ చూడకుండా, కొన్ని మాటలని పట్టుకుని ఆమె ఏదో మహిళా ద్రోహి అన్నట్టుగా చిత్రించడం అబ్సర్డ్…
మూడేళ్ల వయసు నుంచే నటనను వృత్తిగా చేసుకుంది అన్నపూర్ణ… ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంది… ఎస్, రకరకాల ఇష్యూస్ మీద ఆమెకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటిని ఆమె బయటికి వెల్లడిస్తుంది… ఏకీభవించకపోతే వ్యతిరేకించవచ్చు గానీ వెటకారాలు ఎందుకు..? ఆమె అనుభవమంత లేదు చిన్మయి వయసు… అన్నపూర్ణ వయసుకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, అగౌరవపరచొద్దు కదా…
Ads
ఏదో ఇంటర్వ్యూలో అన్నపూర్ణ మాట్లాడుతూ… ‘‘ఆ రోజుల్లో ఆడవాళ్లు అర్ధరాత్రిళ్లు బయటికి వచ్చేవారా.. ఆడదానికి ఎందుకు ఆ స్వతంత్రం కావాలి… రాత్రి 12 గంటల తర్వాత ఏం పని … చాలామంది చిన్న చిన్న బట్టలలో చాలా ఎక్స్పోజింగ్ గా కనిపిస్తున్నారు… ఎవరూ మనల్ని ఏం అనకూడదు, కానీ అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్టుగానే రెడీ అవుతున్నారు… ఎప్పుడూ ఎదుటి వాళ్ళదే తప్పు అనకూడదు, మన వైపు కూడా కాస్త ఆలోచించాలి’’ అంటూ చెప్పుకొచ్చింది…
ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ చిన్నయి… మూతి వంకర్లు తిప్పుతూ… ‘‘నేను అన్నపూర్ణ నటనకు అభిమానిని. ఆమె ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తోంది. ఫేవరెట్ అనుకున్నవాళ్లు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆమె చెప్పినదాని ప్రకారం.. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ జరిగినా ఉదయం సాయంత్రం మధ్యలోనే జరగాలి. ఆ తర్వాత లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదు అన్నట్టుగా ఉంది.
ఆమె చెప్పినట్లు రాత్రి సమయంలో మహిళా డాక్టర్లే ఉండొద్దు. ఆరోగ్యం బాగోలేకపోయినా రాత్రి ఆస్పత్రిలో ఉండకూడదు. ఆమె చెప్పిన రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు, ఉండకూడదు కాబట్టి.! ఇంట్లో బాత్రూం లేక తెల్లవారుజామునే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా.? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా.? అని ఎదురుచూస్తున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇండియాలో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ’ అని చెప్పుకొచ్చింది చిన్మయి…
నిజానికి అన్నపూర్ణ అర్థరాత్రిళ్లు పబ్బులు, క్లబ్బులు, పార్టీలు గట్రా తిరిగే మహిళల గురించి, వాళ్ల వస్త్రధారణ గురించి, ఎక్స్‌పోజింగ్ గురించి… బలాదూర్ తిరుగుళ్ల గురించి కామెంట్స్ పాస్ చేసిందే తప్ప మరీ చిన్మయి వెక్కిరించేంత టోన్‌లో ఏమీ తిక్క కామెంట్లు చేయలేదు… వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్లను ఆమె ఏమీ అనలేదు… ఒకవేళ నిజంగానే అన్నపూర్ణ వ్యాఖ్యలు బాగాలేవు, బాధ్యతారహితంగా ఉన్నాయి అనుకుంటే ఖండించడంలో తప్పులేదు, కానీ ఆ టోన్ అలా ఉండకూడదు…
ఒకవేళ అన్నపూర్ణ వయస్సు రీత్యా ఓ చాదస్తాన్ని కనబరిచిందీ అనుకుందాం, కానీ ఆ చాదస్తాన్ని మించిన రియాక్షన్ పట్ల చిన్మయిని ఏమనాలి..?! ఇవేమీ చిన్మయి వంటి ఓ రేంజ్ సామాజిక కార్యకర్త స్పందించాల్సినంత మగవివక్ష వ్యాఖ్యలు కూడా కావు కదా… ఆమె కూడా మహిళే… తన అభిప్రాయాన్ని కూడా చెప్పకూడదా..?
Share this Article