.
అందరూ అన్నీ రాశారు గానీ… ఆమె ఆత్మాభిమానం, అహం గురించి రాయలేదు… ఆమె వివాదాల్లోకి రాలేదు, హంబుల్ కేరక్టర్… తన పనేదో తనది… తన పాటేదో తనది… అంతే, కానీ కొన్నిసార్లు ఆమె మొండి… రాజీపడేది కాదు…
పద్మభూషణ్ ఇస్తే వద్దంది, దక్షిణాది కళాకారులకు పురస్కారాల్లో వివక్ష, తనకు ఆలస్యపు గుర్తింపు పట్ల ఆమె కినుక… ఆ తిరస్కరణకే కట్టుబడి ఉంది… తనకు నాలుగు జాతీయ అవార్డులు, అనేక రకరకాల అవార్డులు ఆమె సొంతం… అసలు ఆమెకు వేరే పురస్కారాలు దేనికి..?
Ads
కొన్ని విషయాల్లో ఆమె ఏమాత్రం ఫ్లెక్సిబుల్ కాదు… ఒకటి అనుకుందీ అంటే దానికి కట్టుబడి ఉంటుంది, అంతే… ఆమె ఇగో విషయానికి వస్తే మహానటి సావిత్రికి నేను పాడను అంది, దానికి కట్టుబడే ఉంది… సావిత్రికి ఎందుకు పాడను అన్నదో తెలియాలంటే..?
17 భాషలు, 50 వేల పాటలు, అనేక భక్తిగీతాలు, ప్రైవేటు సాంగ్స్… ఆమె స్వరం దక్కని నటి సావిత్రి… వివరాల్లోకి వెళ్తే.. సావిత్రి సినిమాలకు ఎక్కువగా పి. లీల, పి. సుశీల పాటలు పాడేవారు. ముఖ్యంగా ఆమె హావభావాలకు, నటనకు సుశీలమ్మ గొంతు మాత్రమే సరిగ్గా బాగా సరిపోతుందని సావిత్రి గట్టిగా నమ్మేది.

దీంతో తన సినిమాలకు సుశీల మాత్రమే పాడాలనే నియమం పెట్టుకుంది సావిత్రి. మామూలుగా అయితే అప్పటి దర్శక నిర్మాతలు లైట్ తీసుకునేవారు గానీ, సావిత్రి హీరోలకు దీటుగా స్టార్‌డమ్ అనుభవించింది కదా, ఆమె మాట చెల్లుబాటయ్యేది…
తనకు సుశీలే కావాలని సావిత్రి మంకుపట్టు విషయం తెలియని జానకమ్మ ఓ తమిళ సినిమాలో సావిత్రి పాటను ఆలపించింది. పాట కూడా ఎంతో అద్భుతంగా వచ్చింది. అయితే సావిత్రి మాత్రం జానకమ్మ పాడిన పాటను పక్కన పెట్టి మళ్లీ సుశీలతో పాడించి రీ రికార్డింగ్ చేయించింది. దీంతో నొచ్చుకున్న జానకమ్మ, తనకు అవమానంగా భావించింది… అప్పటి నుంచి సావిత్రి పాటలను పాడకూడదని నిర్ణయం తీసుకుంది…

‘‘సావిత్రికి సుశీల గాత్రం అంటే ఇష్టం. ఆమె అభినయానికి సుశీల అయితేనే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం. అందుకే నేను పాడతా అంటే ఆమె ఒప్పుకునేది కాదు. అలా ‘నీలీల పాడేద దేవ పాటను కూడా నేను పాడను’ అని చెప్పేశాను…
సావిత్రి సినిమా కావడంతో ఈ పాటను పాడటానికి 3 నెలలు పెండింగ్ లో పెట్టాను. చివరకు ఆ పాటలో సావిత్రి నటించడంలేదు అని దర్శక నిర్మాతలు చెప్పడంతోనే పాడటానికి అంగీకరించాను. కానీ చివరకు ఆ పాటలో సావిత్రి నటించింది’ అని ఏదో ఇంటర్‌వ్యూలో చెప్పుకొచ్చింది ఆమె…

తన వ్యక్తిగత ఆహార్యం విషయంలోనూ అంతే… మొదట్లో మంచి మంచి చీరలు, నొసటన పెద్ద బొట్టుతో భిన్నంగా కనిపించేది… తన భర్త మరణంతో సంచలన నిర్ణయం తీసుకుంది… అప్పటి హిందూ ఆచారాల మేరకు బొట్టును, రంగు చీరెల్ని, అలంకరణల్ని త్యజించింది… నిజానికి ఇండస్ట్రీలో పరిస్థితి భిన్నం… ఐనా తన నిర్ణయానికే కట్టుబడి ఉంది!!
Share this Article