.
చాన్నాళ్లయింది ఆ అమ్మాయి గురించి రాద్దామని..! వయస్సు 14 ఏళ్లు… తొమ్మిదో తరగతి… సింగర్… స్వస్థలం కాకినాడ… చాలామంది వర్దమాన గాయకులు పలు టీవీ మ్యూజికల్ షోలలో పాల్గొంటున్నారు… వెళ్తున్నారు…
మరి ఈమె గురించే ఎందుకు చెప్పుకోవాలి…? మంచి విద్వత్తు ఉంది ఈ అమ్మాయిలో… అల్రెడీ యానిమల్ సినిమాలో ఓ పాట పాడింది… కాస్త వయస్సు పెరిగి, ఈమేరకు టోన్‌లో పక్వత వచ్చాక ఆమెకు వెండితెర స్వాగతం పలుకుతుంది… ఖాయం…
Ads
ఈటీవీ పాడుతా తీయగా షోలో ఫస్ట్ రన్నరప్… ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో టాప్ 4లో ఒకరు… సరే, మ్యూజికల్ కంపిటీషన్ షోలలో క్రియేటివ్ టీమ్స్ పైత్యం, జడ్జిల చిత్తప్రకోపాలు అంతిమ విజేతలను నిర్ణయిస్తుంటాయి… శ్రోతల వోట్లు అనేది మరో డొల్ల యవ్వారం… నిజానికి ఈమె విజేత కావాలి…
ఇంకా దాని గురించి లోతుల్లోకి అవసరం లేదు గానీ…. ఎస్పీ చరణ్ పలుసార్లు పాట అయిపోగానే ఆప్యాయంగా హత్తుకుని, రాబోయే రోజుల్లో టాప్ ప్లేసుకు వెళ్తావని ఆశీర్వదించాడు… ఇంకొన్ని చెప్పుకుందాం… (సింగర్ కీర్తన అని యూట్యూబులో సెర్చి కొన్ని పాటలు వినండి, మీరే అంగీకరిస్తారు…)
- ఓ పాట అయిపోయాక జడ్జిగా ఉన్న ఫేమస్ సింగర్ కార్తీక్ చెబుతున్నాడు… ‘‘ఈ పాటను ఎస్పీ బాలుకు నేను ట్రాక్ పాడాను… చాలా కష్టమైంది నాకు… నువ్వు పాడిన దాంట్లో 50 శాతం పాడలేకపోయాను’’…చిన్ని చిన్ని ఆశ పాడుతుంటే ఆమె పాడిన తీరు మెచ్చుకుని, పలుసార్లు మళ్లీ మళ్లీ పాడించుకుని…. నేను నీ దగ్గర నేర్చుకున్నా అని సంబరడిపోయాడు…
- నీ లీల పాడెద దేవా పాట అయిపోగానే… సింగర్ సునీత, ఈ పాటను స్టేజీ మీద పాడటానికి నేను ఎప్పుడూ సాహసించలేదు, అంత భయం, నువ్వు అలవోకగా పాడావు అని స్టేజీ మీదకు వెళ్లి హత్తుకుంది…
- విజయప్రకాష్, గీతామాధురిల జడ్జిమెంట్ల గురించి, సూక్ష్మ రంధ్రాన్వేషల గురించి ఇక్కడ అవసరం లేదు గానీ… చంద్రబోస్ మాత్రం నిన్ను మెచ్చుకోవడానికి నా దగ్గర ఇక పదాల్లేవు అని చేతులెత్తేశాడు ఓ దశలో…
- అంతటి థమన్ కూడా ‘నిన్ను జడ్జ్ చేయడానికి ఈ వేదికలు, ఈ లైట్లు, ఈ ఖర్చు, ఈ జడ్జిలు అవసరం లేదు… నీకోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది’ అని ప్రశంసించాడు… థమన్ సర్టిఫికెట్ చిన్న విషయం కాదు…
ఆ అమ్మాయిలో అణకువ… ఎన్ని ప్రశంసలు వచ్చినా సరే, దేవుడు పాడిస్తున్నాడు, పాడుతున్నాను, ఫలితం నేను పట్టించుకోను అనే మాట… ఒకటీరెండు ఇంటర్వ్యూల్లో ఆమె మాటల్లో భలే మెచ్యూరిటీ కనిపిస్తుంది…
అబ్బే, సినిమా పాటలకు సంగీతాలు, సాహిత్యాలు ఏమిటండీ అంటారా..? కానీ కాదు, ఉన్నంతలో ఎవరు బాగా పాడారు అనేది ముఖ్యం… గమకాలు, ఆలాపనలు, సంగతులు, స్కేల్ వంటి టెక్నికల్స్ పక్కన పెట్టేయండి… కానీ పదాల ఉచ్చారణలో స్పష్టత, ఏ పదమైనా సరే అర్థం చేసుకుని ఆ భావాన్ని పలికించడం, ఏ జానరైనా రక్తికట్టించడం ముఖ్యం సినిమా పాటలకు…
కీర్తన అందులో పర్‌ఫెక్ట్… అన్నమయ్య కీర్తనల దగ్గర నుంచి షకలక బేబీ దాకా… ఆమె పాడని జానర్ లేదు… ఎక్కడా తొట్రుపాటు లేదు… నో కంప్లయింట్స్, ఓన్లీ కాంప్లిమెంట్స్… కీర్తనా బెస్టాఫ్ లక్… యు ఆర్ బ్లెస్‌డ్… యు ఆర్ గోయింగ్ టు రాక్…
Share this Article