ఫాఫం… మంగ్లీ ఏమంతా తప్పు చేసిందని..! దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆడింది, పాడింది… భక్తితో పులకించింది… అసలు ప్రతి శివరాత్రికి శివుడి మీద ఓ పాట షూట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటుంది… అది భక్తి, అది తాదాత్మ్యత… ఆ భక్తిలో పడి తానేం చేస్తున్నదో తనకే తెలియనంత భక్తి పులకింత… ఈ జర్నలిస్టులకు ఏమీ తెలియదు, ప్రతిదీ వార్తే… ప్రతి విషయాన్ని గోకుతారు… రచ్చ చేస్తారు… ఆయ్ఁ రెండు దశాబ్దాలుగా వీడియో చిత్రీకరణ మీద నిషేధం ఉంది, ఎవరినీ అనుమతించడం లేదు, అక్కడ మంగ్లి ఆట ఏంది..? పాట ఏంది..? అని రచ్చ చేస్తున్నారు…
కనీసం ఇలాంటి వీడియోలు చేసుకునేందుకు కాకపోతే ఇక ఎస్వీబీసీ సలహాదారు పదవి దేనికి మరి..? ఒక సలహాదారుగా చేసే సేవ అక్కడ ఏం ఉంటుంది మరి..? అసలు ఆ చానెలే పరమ దండుగ యవ్వారం… ఏం సలహాలు ఇవ్వాలి అక్కడ, ఇవ్వడానికి ఆమెకు అర్హత ఏముందని అని అడక్కండి, జగన్ భాయ్‌కు కోపం వస్తుంది, అసలు సలహాలు తీసుకునేవాడు అక్కడ ఎవడున్నాడు అని అడగండి… హమ్మా… ఏదో భక్తి ప్రదర్శనకు గుళ్లో ఆడితే, పాడితే ఇంతగా రాగాలు తీస్తారా..? ప్చ్, జర్నలిస్టులు ఓర్చుకోలేరబ్బా… ఎక్కడ ఏ వివాదం తవ్వొచ్చు అని చూస్తుంటారు…
సోవాట్..? రెండు దశాబ్దాలుగా నిషేధం ఉంది సరే, కానీ రూల్స్ పెట్టుకునేదే ఉల్లంఘించడానికి కదా… బ్రేక్ చేయడానికి కదా… జగ్గీ వాసుదేవ్ నిర్మించిన అంత పెద్ద ఆదిగురువు ఎదుట ఆడటం లేదా..? పాడటం లేదా..? పైగా శివయ్య నాట్యప్రియుడు, గానప్రియుడు… శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు… అలాంటి జీవజాతుల పూజల్నే స్వీకరించిన శివయ్య, కన్నప్ప అమాయక భక్తికి పరవశించిన శివయ్య మంగ్లి పాటను, ఆటను మాత్రం వద్దంటాడా ఏం..?
Ads
ఐనా వివాదాలకు వెరిస్తే మంగ్లి ఎలా అవుతుంది..? ఈ పాటల్ని యూట్యూబులో చూసి శ్రీకాళహస్తివాసులు నివ్వెరపోయారట… ఎందుకు..? ఆమె భక్తి స్పూర్తిని భరించలేకా..? అర్థం చేసుకోలేకా..? ఇక మంగ్లి వేసిన బాటలో అందరూ అక్కడే గానాబజానా పెట్టడం స్టార్ట్ చేస్తే ఎలాగనే ఆందోళనా..? స్వామి వారి సన్నిధి నుంచి నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో… కాలభైరవస్వామి విగ్రహం వద్ద, అమ్మవారి సన్నిధి నుంచి స్పటికలింగం మధ్య ప్రదేశంలో… టీంతో కలిసి ఆడిపాడిందట ఆమె… ఊ అంటావా, ఊఊ అంటావా పాడలేదు కదా, శివుడి పాటే కదా పాడింది… అర్థం చేసుకోరూ…
రాయలవారి మండపం, రాహుకేతు మండపంలో కూడా ఆమె డాన్స్ చేసిందట… సాయంత్రం ఆరు గంటలకే మూసేస్తే ఆమె కోసం ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి సహకరించారట… ఫాఫం, మంగ్లి భక్తితత్పరత అక్కడి సిబ్బందికి అర్థమైంది, ఆమె పొందిన పుణ్యంలో వాళ్లకూ వాటా ఉంటుంది… కానీ ఈ జర్నలిస్టులకే అర్థం కావడం లేదు… తిరుపతి పరిసరాల్లోని గుళ్లలో శ్రీకాళహస్తికి ఎంత ఆదరణ ఉందో కాణిపాకం గుడికీ అంతే ఆదరణ ఉంటుంది దాదాపు… గణేషుడి మీద పాటలేమైనా యూట్యూబ్ కోసం కొత్తగా చేసే ఆలోచన ఉంటే కాణిపాకం బెటరేమో ఆలోచించాలి మంగ్లి…!! ఈ వివాదాలు వస్తూనే ఉంటయ్, పోతూనే ఉంటయ్… గో ఎహెడ్…!!
Share this Article