Bharadwaja Rangavajhala…….. విద్యుత్ గాత్రం…. చిన్నప్పుడు ఓ దసరా పండక్కి బెజవాడ రామ్ గోపాల్ థియేటర్ లో కర్ణ వేశారు. కర్ణ అంటే బి.ఆర్ పంతులు తీసినది. శివాజీ గణేశన్ కర్ణుడుగా ఎన్టీఆర్ కృష్ణుడుగా నటించిన సినిమా. అందులో కర్ణుడ్ని చంపేయడానికి ముందు కృష్ణుడు మీద ఓ పాట చిత్రీకరించారు పంతులుగారు.
రారాజు కడ చేరి నీ రాత ఇటులాయే … వంచెనే విధిఆయెరా కర్ణా … వంచకుడు కన్నయ్యరా కర్ణా … వంచకుడు కన్నయ్యరా … అని సాగుతుంది ఆ గీతం … భువిలో దేహమ్ము నిలువదు నమ్మర, వగవక ఎదిరించరా కర్ణా అని పల్లవి.
అప్పటికి మనకు తెల్సిన తమిళ గాయకుడు సౌందర్ రాజన్ మాత్రమే. ఈ స్వరం అలా లేదు … చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇప్పటికీ ఆ పాట తరచూ ట్యూబులో వింటూ ఉంటాను.
Ads
ఎవరీ పాట పాడిందని బెజవాడ ఊర్వశీ థియేటర్ దగ్గర ఉండే క్యాసెట్ రికార్డింగ్ కొట్లలో అడిగితే వారు రికార్డుల మీద చూసి శీర్గాళి గోవిందరాజన్ అని చెప్పారు. అలా వీరితో తొలి పరిచయం. ఎవరీ శీర్గాళి గోవిందరాజన్ అని వాకబు చేయగా … శీర్గాళి గోవిందరాజన్ ఓ గొప్ప సంగీత విద్వాంసుడు అని తెల్సింది.
చిన్నతనం నుంచీ సంగీతలోకంలోనే ఉన్నాడు. మద్రాసు సంగీత కళాశాలలో సంగీతాభ్యాసం చేశారు. తరచు సంగీత కచ్చేరీలు చేస్తూనే ఉండేవారు. సినిమా పాటలు కూడా ఎక్కువగానే పాడారు. తెలుగులోనే దాదాపు పది పాటల వరకు పాడి ఉంటారు. ఇంకా ఎక్కువే పాడారేమో.
అందులో … గుర్తుండిపోయిన పాట మాత్రం భువిలో దేహమ్మే. ఎమ్మెస్వీ శీర్గాళితో ఎక్కువ పాటలు పాడించుకున్న సంగీత దర్శకుడు అనుకోవాలి. పాటలో సంగీత ప్రాధాన్యం, భక్తి భావం ముఖ్యంగా భక్త్యావేశం పలకాలంటే శీర్కాళి రావాల్సిందే అనేవారు తమిళ సంగీత దర్శకులు.
పోన్ వయెల్ అనే తమిళ సినిమాలో ఆయన తొలిసారి పాడారు. బంగారు భూమి పేరుతో అది తెలుగులో డబ్ అయి వచ్చింది. బంగారు భూమి అంటే క్రిష్ట శ్రీదేవిలది కాదండి … టి ఆర్ రామచంద్రన్ నటించినది. 1951లో వచ్చింది. ఎటి కృష్ణ స్వామి సంగీత దర్శకుడు. లోకమే చిత్రమయా అనే పాట శీర్గాళి పాడారు.
ఎమ్జీఆర్ నటించిన ఏకైక వీరుడు సినిమాలోనూ గోవిందరాజన్ పాట వినిపిస్తుంది. హృదయములు పులకించునో అనే డ్యూయట్ ను ఆయన ఎమ్మెల్ వసంతకుమారితో కల్సి పాడారు. తర్వాత పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం పేరుతో పంతులుగారు తీసిన సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతం పాడారు.
కెఎస్ఆర్ దాస్ తొలి చిత్రం లోగొట్టు పెరుమాళ్లకెరుకకూడా ఆయన పాడారు. తమిళ నాట ఆయన క్రేజ్ వేరు. అక్కడ వివిధ సాంస్కృతిక సంస్ధలు ఆయనకిచ్చిన బిరుదులు ఎక్కువ. సంగీత విద్వాన్ , ఇసై కాదల్, ఇసై అరసు, కళామామణి ఇలా అనేక పురస్కారాలు …
ఆయన ఇచ్చిన ప్రైవేట్ గీతాల్లో కూడా భక్తి పాటల సంఖ్యే ఎక్కువ. ఆయన పాడే భక్తి పాటల రికార్డులకు మంచి సేల్స్ ఉంటాయని సరస్వతీ స్టోర్స్ వారు ఆరోజుల్లో శీర్కాళికి గోల్డెన్ డిస్క్ బహూకరించారు. వెయ్యికి పైగా సినిమా పాటలు పాడిన శీర్కాళి గోవిందరాజన్ కొన్ని సినిమాల్లో నటించారు కూడా.
కేంద్ర ప్రభుత్వం నుంచీ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కానీ ఇంత ప్రతిభావంతుడైన గాయకుడు యాభై ఆరేళ్లకే వెళ్లిపోయారు. ఎనిమిదేళ్ల వయసులో కచ్చేరీ ఇచ్చిన బాలమేధావి ఆయన.
ఆయన పాట వింటే చాలా ఎమోషనలైజ్ అవుతాం. విద్యుత్ ను తన స్వరంలోంచీ శ్రోతల హృదయాల్లోకి పంప్ చేయడం ఆయన ప్రత్యేకత. కావాలంటే ట్యూబులోకి వెళ్లి శీర్గాళి గోవిందరాజన్ పాటలు వినండి …
ముఖ్యంగా భువిలో దేహంబు పాట వినండి … ఆయన పాడిన ప్రైవేటు రికార్డుల్లో భక్తిగీతాలు వినండి … శ్రోతల్లో భక్త్యావేశాలు పొంగుతాయి. విపరీతంగా ఛార్జ్ చేసేస్తాడాయన తన గాత్రంతో … ఒక్కసారి వింటే మరచిపోవడం తేలికకాని గాత్రాల్లో గోవిందరాజన్ ఒకరు. శీర్గాళి పాటలు వినడం ఒక అనుభవం … అంతే … అంత కంటే ఏం చెప్పగలం?
Share this Article