నిఝంగానే ఈలోకానికి ఎంత నిర్దయ..? ఎంత దుర్మార్గం ఈ సమాజానిది..? ఫాఫం… శ్రావణభార్గవి… గొంతు మధురం… కాకపోతే మెంటాలిటీయే శృతిరహితం… అయితేనేం..? ఇంత కర్కశంగా తిట్టిపోయాలా..? ఏదో మొగుడు హేమచంద్రుడితో విడిపోయింది, రోజూ ఇంట్లో గొడవల నుంచి విముక్తి పొందింది… సమయానికి సత్తయ్య ఆయుర్వద మందు దొరకలేదు, లేకపోతే ఇద్దరూ రాజీపడి, అలుముకుని అన్యోన్య సంసారం చేసేవాళ్లే… కానీ కుదర్లేదు… అదే ఫ్రస్ట్రేషన్‌లో ఉంది… ఏదో పిచ్చి వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టింది… ఇక తిట్టేయడమేనా..? ఎంత దారుణం..?
ఆ అన్నమయ్య ట్రస్టు వాళ్లకు, ఆ అన్నమయ్య వారసులకు మానవత్వం లేదు, సున్నితత్వం లేదు… భర్త వీడిన భార్య మనస్తత్వం తెలియదు… నాన్సెన్స్… ఏదో ఓ అన్నమయ్య కీర్తనను బ్యాక్‌డ్రాపులో పాడేసుకుని, తను ముస్తాబవుతున్నట్టు, ఏదో పుస్తకం చదువుతున్నట్టు… సిగ్గుతో పడక మీద మొహం దాచుకుంటున్నట్టు… ఏదో టిక్‌టాక్‌కు తక్కువ, రీల్స్‌కు ఎక్కువ తరహాలో ఓ వీడియో చేసుకుని, ఆత్మతృప్తి కోసం యూట్యూబ్‌లో పెట్టేసుకుంది… యూట్యూబ్ అంటేనే ఓ చెత్తా వేదిక కదా… వాడు ఏదైనా సరే, వోకే అనేస్తాడు… ఈ చెత్తా, నాసిరకం వీడియోను కూడా అంగీకరించేశాడు…
ఈమాత్రం దానికి ఆమె ఏదో పెద్ద నేరం చేసేసినట్టు..? చేయరాని ఏదో హిందూధర్మద్రోహం చేసేసినట్టు..? అన్నమయ్య పట్ల పాపం చేసేసినట్టు..? ఎందుకింత ట్రోలింగ్..?
Ads
మొగుళ్లతో పడక, ఫోఫోరా అని వదిలేసి, సొంతంగా బతుకుతున్న వాళ్లు ఎందరు తమ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎన్ని వీడియోలు పెట్టడం లేదు… అందరినీ ఇలాగే తిడుతున్నారా..? ఎస్, కాకపోతే ఆమెకు నోటిదూల ఎక్కువ… అదీ ఫ్రస్ట్రేషన్ నుంచి మొలకెత్తిందే అనుకోవాలి కదా… ‘‘ఏం..? నేను అసభ్యంగా కనిపించానా..? బరితెగింపు ప్రదర్శించానా..? అందులో ఏముందని..? గోదాట్లో దూకండి, నేనైతే వీడియో డిలిట్ చేయను, ఇక్కడ కాకపోతే ఇన్‌స్టా లేదా..? ఫేస్‌బుక్ లేదా..? ట్విట్టర్ లేదా..? అన్నట్టుగా కూడా ఎదురు తిరిగింది… ట్రోలర్లకు జవాబు చెప్పింది… అరె, కడుపులో నుంచి తన్నుకొచ్చిన బాధ బ్రదర్…
అదీ టెంపర్‌మెంట్ అంటే… అంతేనా… సద్బ్రాహ్మణ కులంలో పుట్టినదాన్ని, నాకు తెలియదా అన్నమయ్య కీర్తనలను ఎలా గౌరవించాలో అని కూడా సెలవిచ్చింది… ఓహో, అన్నమయ్య కీర్తనల గౌరవాన్ని, పవిత్రత కాపాడటంలో బ్రాహ్మలకు మస్తు బాధ్యత ఉందని ఆమెకు బాగా తెలుసట… బ్రాహ్మలు ఎవరూ అన్నమయ్య పదాలను అపవిత్రం చేయరట… ఎంతటి జ్ఞానం..? ఎంతటి అవగాహన..? ఈ మాట అన్నాకయినా ఆమెను వదిలేయాలి కదా… ఐనా ట్రోలుతూనే ఉన్నారు… ఎంతటి దుశ్చర్య..?
నిజానికి అదొక సబ్‌స్టాండర్డ్ వీడియో… అదెవరూ చూడరు… చూస్తే నవ్వుకుని, ఆమె మీద జాలిపడి, ఫాఫం పోనీలే అనుకుంటారు… అలా వదిలేస్తే సరిపోయేది… కావాలనే ఈ అన్నమయ్య ట్రస్టులు, అన్నమయ్య వారసులు… కావాలని ఏదో ముందస్తు ఒప్పందం మేరకే ఈ వీడియోను ప్రమోట్ చేయడానికి రచ్చ చేస్తున్నారా..? అలాగే అనిపిస్తోంది..? లేకపోతే అందులో ఏముందని..? అదేమైనా కళాఖండమా..?
ఏదో అలుసుగా దొరికాయి, అన్నమయ్య కీర్తనల్ని ఎవడైనా ఎలాగైనా భ్రష్టుపట్టించవచ్చుననే ధీమాతో, టీటీడీ అనే ఓ పిచ్చి, వేస్ట్ సంస్థ ఏమీ స్పందించదనే భరోసాతోనే కదా ఆమె ధైర్యం చేసింది… అర్థం చేసుకోకపోతే ఎలా..? శ్రావణా, నువ్వు ఆపకు… ఈసారి ‘‘జగడపు జనవుల జాజర- సగినపు మంచపు జాజర’’ కీర్తనను కుమ్మెయ్… ఎవరేమంటారో చూద్దాం… సద్బ్రాహ్మణ పిల్లవు, నీకు ఆమాత్రం మర్యాద, మన్నన, గౌరవం తెలియదా ఏం… హమ్మా…!! ఎవడైనా అడిగితే అంతా దైవాజ్ఞతోనే అని ఎదురు దబాయించొచ్చు… సరేనా..?!
Share this Article