.
మొన్నామధ్య కీరవాణి ఈటీవీ పాడుతా తీయగా షోలో మాట్లాడుతూ… వర్ధమాన గాయకులు సంగీత సాధనతోపాటు మిమిక్రీని కూడా అభ్యసించాలని సూచించాడు… దానికి కారణాలేమిటో కూడా చెప్పాడు… బాలసుబ్రహ్మణ్యం ఎదుగుదలకు ‘గొంతు మార్చి’ పాడటం కూడా ఓ కారణమేనన్నాడు…
అదే చూస్తుంటే… ఫేస్‌బుక్‌లో మిత్రులు Rochish Mon
Ads
ఇదే అంశంపై పెట్టిన పోస్టు కనిపించింది… బాగుంది… అది ఇదే…
మొహమ్మద్ రఫీ పలువురికి పాడినా, షమ్మీ కపూర్, మహ్మూద్ వంటి వాళ్లకు పాడిన సందర్భాల్లోనూ ఒక మేరకు వాళ్ల మెనరిజమ్స్ తో పాడారు కానీ ఏ నటుడికీ గొంతు మార్చి పాడలేదు. ఘంటసాల కూడా రామారావు, నాగేశ్వరరావు వంటి నటులకు గొంతు మార్చి పాడలేదు.
కన్నడ రాజ్ కుమార్ శరీరం అయితే శారీరం పీ.బీ. శ్రీనివాస్ అన్న మాట చలామణి అయింది. కానీ పీ.బీ. శ్రీనివాస్ రాజ్ కుమార్ గొంతును సాధించలేదు. అదే విధంగా రాజ్ కపూర్ కు ముఖేష్. కపూర్ కోసం ముఖేష్ గొంతు మార్చి పాడలేదు. కిషోర్ కుమార్ ఒక పాటలో ఆడ గొంతుతో పాడ గలిగినా రాజేష్ ఖన్నా, అమితాబ్ వంటి నటుల కోసం గొంతు మార్చి పాడలేదు.
మనదేశ సినిమాలో ఒక నటుడి కోసం తన గొంతు మార్చి పాడిన తొలి గాయకుడు తమిళ్ష్ టీ.ఎమ్. సౌందరరాజన్. 1954లో వచ్చిన తూక్కు తూక్కి సినిమాలో నటుడు శివాజీ గణేస(శ)న్ కోసం గొంతు మార్చి పాడారు టీ.ఎమ్. సౌందరరాజన్. అటు తరువాత ఎమ్. జీ. ఆర్., నాగేష్, జయశంకర్ వంటి నటులకు గొంతు మార్చి పాడారు సౌందరరాజన్.
నటుల గొంతును అనుకరించి పాడాలి అన్న ఆలోచనతో ప్రయత్నం చేసిన మన దేశ తొలి నేపథ్య గాయకుడు టీ.ఎమ్. సౌందరరాజన్! ప్రధానంగా శివాజీకి, ఎమ్. జీ. ఆర్.కు వేర్వేరు పంథాలలో పాడారు సౌందరరాజన్. అయితే ఆయన ఆ ప్రయత్నంలో ఏ మేరకు విజయవంతం అయ్యారు? సమాధానం చర్చనీయమే.
గొంతు మార్చి పాడడంలో నటులు జయశంకర్, శివాజీ పరంగా విజయవంతమైన సౌందరరాజన్ ఎమ్.జీ. ఆర్. వంటి నటుల విషయంలో అవలేదు. కానీ ఎమ్.జీ. ఆర్.కు పాడేడప్పుడు నాసల్ వాయిస్ తో పాడి ఎమ్.జీ. ఆర్. గొంతు అన్న భ్రమను కలిగించారు సౌందరరాజన్. శివాజీ పాట, ఎమ్.జీ.ఆర్. పాట అన్న తేడాను ప్రస్ఫుటంగా చూపించారు సౌందరరాజన్.
1956లో వచ్చిన భలే రాముడు సినిమాలో నటుడు రేలంగి కోసం పీ. బీ. శ్రీనివాస్ ఒక పాటను గొంతు మార్చి పాడారు. అయితే అలా నటుల కోసం గొంతు మార్చి పాడడాన్ని పీ. బీ. శ్రీనివాస్ కొనసాగించ లేదు. నటులకు గొంతు మార్చి పాడడం అన్న కళలో ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు!
బాలసుబ్రహ్మణ్యం ఎన్.టీ.ఆర్., నాగేశ్వరరావు మొదలుగా పలు భాషల నటులను అత్యంత గొప్పగా అనుకరించారు. శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, చంద్రమోహన్ వంటి నటులు మాత్రమే కాకుండా విజయచందర్ వంటి నటుల గొంతులను కూడా సమర్థవంతంగా సాధించారు బాలు.
ఇంకా మాడా, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, సురళి రాజన్, ద్వారకీష్ వంటి హాస్యనటుల గాత్రాలను కూడా ప్రతిభతో సాధించారు బాలు. రజనీకాంత్ , నాగేశ్వరరావు వంటి నటుల ఉచ్చారణ తీరును కూడా సాధించారు బాలు.
నటులకు గొంతు మార్చి పాడడం అన్నదాన్ని మిమిక్రీ అని కొంచపరిచే మధ్యతరగతి మాంద్యానికి పరిష్కారం ఉండదు; అది మాంద్యం లేదా జాడ్యం అది అంతే.
శ్రుతిలో, తాళంలో, స్వరంలో, భావంతో, moodతో, modulationతో గానంగా ఇతరుల గొంతులను సాధించడం ఒక ప్రతిభాత్మక కళ. ఆ కళలో బాలు అద్భుతం. బాలు స్థాయిలో పలువురు నటులకు గొంతు మార్చి పాడడం మరో గాయకుడు చెయ్యనిది, చెయ్యలేనిది. దేశంలోని అత్యంత ప్రతిభావంతుడైన గాయకుడు బాలు గానవైశాల్యంలో నటుల గొంతుల్ని సాధించడమూ ఒక విశేషాంశమే.
మామూలుగా మిమిక్రీ కళాకారులు సంభాషణలలో ఇతరుల గొంతులను సాధిస్తారు. కానీ శ్రుతి, తాళ, స్వర బద్ధమైన గానంలో ఇతురుల గొంతులను సాధించడం సాధారణమైనది కాదు. ఈ విషయంలో బాలు ప్రతిభ ఆశ్చర్యాత్మకం.
పలువురు నటుల గాత్రాల్ని గానంలో సాధించిన బాలు ఒక్క శివాజీ గణేస(శ)న్ గాత్రాన్ని మాత్రమే అంతగా పట్టుకోలేకపోయారు. బాగా చిన్నప్పుడు ఒక సందర్భంలో నేను బాలు గారిని “శివాజీ గాత్రాన్ని ఎందుకు సాధించలేక పోయారు?” అడిగాను. అప్పటికి విశ్వ విఖ్యాతమైన స్థితిలో ఉన్నారు బాలు.
నేను ఎంతమాత్రమూ పరిగణననీయమైన వాణ్ణి కాను; వయసులోనూ చాల చిన్న. అయినా నా ప్రశ్నకు చాలా గొప్ప సంస్కారంతో బాలు ఇచ్చిన సమాధానంతో బాలు ఏ స్థాయి కళాకారుడో నాకు అవగతం అవడానికి కొన్నేళ్లు పట్టింది. బాలు మహోన్నతమైన కళాకారుడు.
90వ దశాబ్దిలో గొంతు మార్చి పాడడం అన్న విషయాన్ని వదిలేశారు బాలు. నేపథ్య గాయకులు నటుల గొంతులను సాధించడం అన్న కళ టీ.ఎమ్. సౌందరరాజన్ తో మొదలై బాలసుబ్రహ్మణ్యంతో ఉచ్చస్థాయికి వెళ్లింది….. రోచిష్మాన్ 9444012279
Share this Article