శృతి, రాగం, తాళం, సంగతులు, నోట్స్, లయ… ఇత్యాది అంశాలు సగటు శ్రోతకు అక్కర్లేదు… పాడేవాడి గొంతులో శ్రావ్యత, వినిపించే ఆ పదాల భావం, మంచి ట్యూన్, సరిపోయే వాయిద్యాలు… వాడిని మరోలోకంలోకి తీసుకుపోవాలి… కేవలం డప్పుతో, మృదంగంతో అలరించిన గీతాలూ బోలెడు… ఇవన్నీ ఎందుకు ఒక్కసారిగా గుర్తొచ్చాయీ అంటే… వెంటవెంటనే సోనీ ఇండియన్ ఐడల్, ఈటీవీ స్వరాభిషేకం చూసినప్పుడు..! హస్తిమశకాంతరం ఉంది… ఒకప్పటి బాలు స్వరాభిషేకం వేరు, ఇప్పటి స్వరాభిషేకం వేరు… ఈ సగటు శ్రోత అభిప్రాయం మారలేదు, మారే అవకాశాన్ని కూడా ఈటీవీ ఇవ్వదు… ఇవ్వలేదు… ఆమధ్య టీమ్ పెర్ఫార్మెన్స్ పేరిట చెవుల్లో సీసం కరిగించి పోశారు… కానీ కాస్త పాటల ఎంపికలో ఈమధ్య టేస్ట్ కనిపిస్తోంది… అయితే సుమ వంటి మంచి వ్యాఖ్యాత లేకపోవడంతో, పాట ఆరంభానికి ముందే ఉసూరుమనిపిస్తోంది… డైరెక్టర్స్ స్పెషల్ అంటూ ఏదో ఎపిసోడ్ కనిపిస్తే కాస్త టెంప్టయిన మాట నిజమే… ఈ సిగపాయల మందారాలూ అని వినిపిస్తుంటే ఆహా ఎంత మంచిపాట అంటూ అలా ఉండిపోయా… కానీ తప్పు చేశాను అనిపించింది కాసేపటికే…
పుట్టింది కన్నడనాటే అయినా… కొన్ని వందల తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, మళయాళ, కన్నడ పాటలు పాటిన విఖ్యాత గాయకుడు… అప్పట్లో ఆస్కార్ దాకా వెళ్లిన ఓ పాట గాయకుల టీంలో తనూ ఉన్నట్టు విన్నాం, చదివాం… అంతటి గాయకుడు విజయప్రకాష్ గొంతులో ఆ దేవులపల్లి మధుర గీతం ఖూనీ అయిపోయిందే అని ప్రాణం ఒక్కసారిగా ఉసూరుమనిపించింది… ఆ పాటకు తను సూట్ కాడు, కాలేదు… ముందే చెప్పిట్టు శృతిలయజ్ఞానం వేరు, పదాలకు అనుగుణమైన భావాన్ని పలికించడం వేరు… పక్కన ఉన్న గోపికా పూర్ణిమ అలవోకగా, అందంగా పాడింది… ఈ మెడ చుట్టూ గులాబీలూ, మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం, వెన్నెల పారిజాతాలూ, వానకారు సంపెంగలూ, అన్నీ మనకు చుట్టాలేలే, వచ్చీపోయే అతిథులే… ఈ పదాలు చదువుతూ ఉంటేనే ఓ సంబరం, ఇక మంచి గాయకుల గొంతులో పడితే, మనం వింటే, ఇంకెంత సంబరం… అసలే దేవులపల్లి రచన.., అలతి పదాల అందమైన పొందిక… కానీ చక్రవర్తి ఈ కంపోజిషన్ చేశాడంటేనే ఎవరూ నమ్మరు అసలు… ఓ ప్రఖ్యాత ఫ్లూటిస్టు ఎవరో సహకరించాడట… బాలూయే ఎప్పుడో చెప్పాడు… ఇది చాలా వేరియేషన్స్ ఉన్న క్లిష్టమైన ట్యూన్… ఆరు రుతువులనూ ఆ ఒక్క పాటలో ఇమిడ్చేందుకు, ఆవిష్కరించేందుకు చాలా ప్రయాసపడిన తీరు వినిపిస్తుంది… మంచి ప్రయత్నమే… నిజానికి ఆరేళ్ల క్రితం ఆదే స్వరాభిషేకం వేదిక మీద బాలు, ప్రాణవి దీన్ని పాడారు… ఒరిజినల్ పాటలోకన్నా బాలు ఈ వేదిక మీద బాగా మెరుగుపరుచుకుని పాడాడు… ఇక ప్రణవి అయితే…
ష్ … గలగలమనగూడదు ఆకులలో గాలి
జలజలమనరాదు… అలలతో కొండవాగు
నిదరోయే కొలను నీరు… కదపకూడదు
ఒరిగుండే పూలతీగ ఊపరాదు… ఈ చరణం దగ్గర మధుర, మంద్రస్వరంతో.., ఆ పదాల్ని పదిలంగా పూలను పట్టుకుని లాలించినట్టుగా… శ్రావ్యంగా ఆలపించింది… వావ్…
Ads
సరే ఇక.., రేవంత్, కారుణ్య, సునీత వంటి గాయకులే ఏదో పాడాంలే అనిపిస్తున్నారు… ఆ అనవసర నవ్వులు కాస్త కట్టిపెట్టి, పాట మీద శ్రద్ధ పెడితే బాగుండు సునీత… ఘోరం ఏమిటంటే, అంత విద్వత్తు ఉన్న కల్పన కూడా టీమ్ పర్‌ఫామెన్స్‌లో ఒక పల్లవి కూడా సరిగ్గా పాడలేకపోయింది… (కూతురి జీవితం తాలూకు డిస్టర్బెన్సులో ఉన్నట్టుంది పాపం…) కట్ చేస్తే, ఇండియన్ ఐడల్ ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… అది ప్యూర్ కమర్షియల్ ప్రోగ్రాం… కోట్ల ఆదాయం… షోకు వచ్చే గెస్టులను బట్టి, వాళ్ల పాటల ఎంపిక ఉంటోంది, అదో దరిద్రం… కాకపోతే ఈ స్థితిలోనూ ఎలాంటి పాటనైనా అద్భుతంగా పాడుతున్నారు ఇప్పుడు దాదాపు ఫైనలిస్టులుగా ఉన్న ఆరుగురు గాయకులూ… అఫ్ కోర్స్, ఈసారి మొత్తంగానే గాయకుల ఎంపిక బాగుంది, ఎలిమినేట్ అయినవారు కూడా సూపర్ గాయకులే… ఆ పాటల ఎంపికతో పోలిస్తే స్వరాభిషేకం పాటల ఎంపిక ఇప్పుడు బాగుంటున్నది… కాస్త టేస్ట్ కనిపిస్తోంది… నిన్న ‘‘కలలెరుగని మనసుకూ కన్నెరికం చేశావు.., నువ్వాదరిని, నేనీదరిని, పల్లకి పంపిన తారకలూ’’ అన్నీ మదిదోచిన పాటలే… ఎటొచ్చీ, పాడేవాళ్లే కట్టుతప్పి పోతున్నారు… అసలు ఈ ప్రముఖులను బయటికి తోసేసి, వర్ధమాన గాయకుల్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు…? ఆమధ్య జీతెలుగు చానెల్ వాడు అట్టహాసంగా సరిగమప అంటూ ఓ సాంగ్స్ షో ప్రసారం చేయించాడు, మంచి గాయకులే వచ్చారు, కానీ షో నిర్వహణే అట్టహాసాలు, ఆడంబరాలు, ప్రదీప్ వెకిలి గారడీలు, పాటేతర కామెడీ ప్రదర్శనల నడుమ ఎక్కడో గాడితప్పి, మొత్తంగా షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది… ఎస్పీ బాలు కొడుకు చరణ్ తన నాన్న వారసత్వాన్ని కాసింతైనా నిలబెట్టాలీ అనుకుంటే చేయాల్సింది, ఆల్‌రెడీ పేరు తెచ్చుకున్న వాళ్లతో ఈ టీవీ కచ్చేరీలు కాదు, కొత్తవాళ్ల వెన్నుతట్టేలా షో చేయి బ్రదరూ… వాళ్లే బాగా పాడతారు… గ్యారంటీ…!! కడియాల అనిలో, కంకణాల సునీలో, మరెవరో… వింటున్నారా సార్..?!
Share this Article