రెండుమూడు విషయాల్లో ‘సార్’ సినిమాను మెచ్చుకోవాలి… హీరో ధనుష్‌ను, నిర్మాతలను, దర్శకుడిని కూడా మెచ్చుకోవాలి… ధనుష్‌కు ఇమేజ్ ఉంది… మార్కెట్ ఉంది… డిష్యూం డిష్యూం, యాక్షన్, మాస్ మసాలా, రస్టిక్, ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో ఓ సామాజిక సమస్యను చర్చకు పెడుతూ సినిమాను తీయడం అభినందనీయం… ఏవో నాలుగు పిచ్చి పాటలు పెట్టేసి, హీరో చేతిలో ఓ మెషిన్ గన్ పెట్టేసి, ఫట్ ఫట్ కాల్పులు జరిపించేసి, పాన్ ఇండియా పేరిట అయిదారు భాషల్లో తర్జుమా చేసి, రిలీజ్ చేసి, అయినకాడికి దండుకోవడం ఇప్పటి ట్రెండ్…
సార్ సినిమా అలా కాదు… ప్రైవేటు విద్య అవలక్షణాలు, దందాలతోపాటు కొడిగట్టిన సర్కారీ విద్యను ఓ కథగా చెప్పడానికి ప్రయత్నించింది… కాకపోతే కంటెంటు మంచిదే అయినా సరే, థియేటర్ కు ప్రేక్షకుడిని రప్పించి, కట్టిపడేసే కథనం, ప్రజెంటేషన్ లోపించింది… నిజానికిది లోతైన పెద్ద సబ్జెక్టు, అందులో కొన్ని సినిమాటిక్ మెరుపులు, మలుపులు ఉండాలి… ప్రేక్షకుడికి కొత్తగా అనిపించాలి… అవి లేకపోతే సినిమా థియేటర్ దాకా ప్రేక్షకుడిని రప్పించదు… సార్ సినిమాకు సంబంధించిన లోపం ఇదే…
తమిళంలో సినిమా తీసేసి, కనీసం తెలుగు మార్కెట్ కోసం చిన్న ప్రమోషన్ కూడా లేకుండా, తెలుగులోకి అడ్డదిడ్డంగా డబ్ చేసి, మనపైకి వదిలేయడం సగటు తమిళ నిర్మాతకు, దర్శకుడికి అలవాటు… తీసింది తెలుగు నిర్మాత దిల్ రాజే అయినా సరే వారసుడు సినిమాను తెలుగునాట ప్రమోట్ చేసే విషయంలో విజయ్ ధోరణి కూడా చూశాం… ఏమీ అనలేక అంతటి దిల్ రాజు అన్నీ మూసుకోవాల్సి వచ్చింది… వెరసి తెలుగులో వారసుడు ఫ్లాప్…
Ads
ధనుష్‌కు తమిళ మార్కెట్ ముఖ్యం, అయినా సరే సార్ సినిమాను తెలుగు సినిమాలాగే తీశారు… దర్శకనిర్మాతలు కూడా తెలుగే… దిల్ రాజుకూ వీళ్లకూ తేడా ఇదే… దిల్ రాజు మాత్రం అచ్చు తమిళ సినిమాలాగా తీశాడు వారసుడు సినిమాను…!!
సార్ సినిమా కంటెంటు చూస్తుంటే నారాయణ, చైతన్య కాలేజీలు, స్కూళ్ల కార్పొరేట్ దందాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, కోళ్లఫారాలు, జైళ్ల వంటి హాస్టళ్లు, వేల కోట్ల దోపిడీలు గుర్తొస్తుంటాయి… కొంతమేరకు కనెక్టయ్యేది ఇదే… తనికెళ్ల భరణి, సాయికుమార్ తదితరులు ఉన్నారు కానీ ప్రధానంగా సముద్రఖని, ధనుష్ పాత్రలు మాత్రమే ముఖ్యం…
మరీ హీరోయిన్‌ను ఉత్త అందాలబొమ్మగా చూపించడంకన్నా కాస్త మంచి పాత్రే ఇచ్చారు సంయుక్త మేనన్‌కు… ధనుష్ వంక పెట్టలేని తీరులో సహజంగా నటించాడు… మిగతావారు సో సో… ఒక ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల మాఫియా లీడర్ ఏకంగా మొత్తం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు పెద్దగా కనెక్ట్ కాదు, అక్కడే తేడా కొట్టేసినట్టుంది… విద్య మాఫియా మీద గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి… సో, సార్ అనే సినిమాలో కొత్తగా ఏం చెప్పారని ప్రేక్షకుడు ఆసక్తిగా గమనిస్తాడు, కానీ అదే లోపించింది… పైగా సంగీతం సోసో… పోనీలెండి, సగటు ఫార్ములా, ఇమేజీ బిల్డప్పుల చెత్తా సినిమాలతో పోలిస్తే సార్ సినిమా చాలా బెటర్… కాకపోతే ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే బాగుండు..!!
సందర్భమే కాబట్టి చెప్పుకుందాం… ప్రైవేటు విద్యను పూర్తిగా తీసిపారేయలేం, కాకపోతే దందాగా మారిన అవలక్షణాల్ని వ్యతిరేకించాలి… అదేసమయంలో ప్రభుత్వ విద్య అవలక్షణాలు కూడా బోలెడు… అందుకే చిన్న చిన్న పనులు చేసుకునేవారు సైతం అప్పులు చేసి మరీ ప్రైవేటు వైపు వెళ్తున్నారు తప్ప ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలని అనుకోవడం లేదు… ఆ కారణాల అన్వేషణ సరిగ్గా జరిగినరోజు, ప్రభుత్వం కొరడా పట్టుకున్నరోజున ప్రభుత్వ విద్య బాగుపడుతుంది… సమాంతరంగా ప్రైవేటు విద్య కూడా బాగుపడుతుంది… కానీ జరగనిది అదే…! ప్రభుత్వ విద్య పవిత్రమూ కాదు, ప్రైవేటు విద్య అవాంఛనీయం కూడా కాదు…!!
Share this Article