శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ . అందాల తార జయప్రదను స్టారుని చేసిన సినిమా . రంగులరాట్నం , సుఖదుఃఖాలు సినిమాల తర్వాత , వాటికి మించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి చంద్రమోహన్ కు వచ్చిన మహదవకాశం . కె విశ్వనాధ్ కళాతపస్విగా అవతరించడానికి శ్రీకారం చుట్టిన సినిమా . చంద్రమోహన్-జయప్రద జోడీ కెమిస్ట్రీ అద్భుతంగా పండిన సినిమా .
తెలుగు సినిమా రంగంలో సంగీత , నృత్యాలకు ప్రాముఖ్యతని ఇస్తూ సంస్కారవంతమైన సినిమాలను తెలుగు వారికి అందించే విశ్వనాథ్ కళా జైత్రయాత్రలో మొదటి అడుగు 1976 లో వచ్చిన ఈ సిరిసిరిమువ్వ కళాఖండం . మాతరంలో వారికి ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు . ఈ సినిమా సృష్టించిన కళానంద వర్షంలో తడిసిముద్దయిన వారిమే అందరం .
విశ్వనాథ్- వేటూరి- పసుమర్తి- మహదేవన్- బాలసుబ్రమణ్యం- సుశీలమ్మల సమిష్టి కృషి ఈ సినిమా . పాటలనన్నీ వేటూరే వ్రాసారు . తెలుగు సాహిత్య విద్యార్ధులకు ఒక్కోపాట ఒక్కో M Phil టాపిక్ . ఝుమ్మంది నాదం సై అంది పాదం , గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది , అందానికి పుత్తడి బొమ్మా , గోదారల్లే ఎన్నెల్లో గోదారల్లే పాటల గురించి ఎంత వివరించినా తనివి తీరదు .
Ads
విశ్వనాథ్ , బాపులకు సాంఘిక సినిమాలయినా , డిటెక్టివ్ క్రైం సినిమాలయినా రాముడ్ని , కృష్ణుడ్ని చూపకుండా సినిమాలు తీయలేరు . మా వూరి దేవుడు పాట ఆ కోవలోనిదే . ఊరేలేది , ఊరేగేది రెండూ ఆయనే అని రాములోరిని కీర్తించటం వేటూరికే సాధ్యం . చంద్రమోహన్ అద్భుతంగా నటించిన పాట రా దిగిరా దివి నుండి భువికి దిగిరా . డప్పు చరితార్ధం అయింది .
సుశీలమ్మకు ఈ సినిమాలో పాడిన పాటలకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు వచ్చింది . శంకరాభరణం కన్నా ముందే బాలసుబ్రమణ్యం తన గాత్ర సంపదను తెలుగు వారికి పంచిపెట్టేసాడు . ఇంక నృత్య దర్శకులు పసుమర్తి . జయప్రద నృత్యాలన్నీ నవరంగ్ సినిమాలో సంధ్య నృత్యాలను గుర్తుకు తెస్తాయి . అద్భుతంగా కంపోజ్ చేసారు .
కె వి మహదేవన్ back ground music , మూగది అయిన హీరోయిన్ పక్షుల్ని , ప్రకృతిని తన కుహూ కుహూలతో కిలకిలారావించిన సంగీతాన్ని ఆస్వాదించాల్సిందే . ఇంతటి చక్కటి , అందమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రిస్క్ చేసిన నిర్మాతల బృందం ఏడిద నాగేశ్వరరావు , కర్రి లచ్చారెడ్డి , యన్ భాస్కరరెడ్డి , యు చిన వీర్రాజులను అభినందించాలి .
నటనాపరంగా చంద్రమోహన్- జయప్రదల తర్వాత ముందు చెప్పుకోవాల్సింది సత్యనారాయణనే . పక్షవాతం వచ్చిన అసహాయ తండ్రిగా చాలా గొప్పగా నటించారు . తర్వాత గొప్ప పాత్ర ఫణికుమారి ధరించిన సుమ పాత్ర . ఈ పాత్రను విశ్వనాథ్ బ్రహ్మాండంగా మలిచారు . పనికిరాని వెధవ కట్టిన తాళిబొట్టుని అమ్మి , తన శీలాన్ని కాపాడిన వ్యక్తికి సాయం చేయటానికి ముందుకు వచ్చే పాత్ర . హేట్సాఫ్ విశ్వనాథ్ . ఇంత విప్లవాత్మక సందేశాలను ఒక్క విశ్వనాథ్ మాత్రమే ఇవ్వగలరేమో ! సప్తపది ఆ కోవలోనిదే కదా !
కవిత ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసింది . దేవదాస్ కనకాల , రమాప్రభ , నిర్మలమ్మ , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు . ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయ్య వారి పాత్ర , ఆ పాత్రలో అద్భుతంగా నటించిన జె వి రమణమూర్తిని . సత్యనారాయణ తర్వాత ఆయన పాత్ర , ఆయన నటనే గొప్పగా ఉంటాయి .
ఈ సినిమాకు జంధ్యాల , వేటూరి సంయుక్తంగా సంభాషణల్ని అందించారు . పాటలాయన మాటలాయన కూడా అయ్యారు . ఈ సినిమాను విశ్వనాధ్ హిందీలో రిషికపూర్- జయప్రదలతో తీసారు . జయప్రదను హిందీ రంగానికి పరిచయం చేసి , వైజయంతిమాల , వహీదా రెహమాన్ , హేమమాలిని , రేఖల తర్వాత ఉత్తరాదిన మరో సూపర్ హీరోయిన్ గా ఎదగటానికి దోహదపడ్డ సినిమా సర్గం .
ఎన్నిసార్లు చూసానో ఈ సినిమాను ? ఎన్నిసార్లు చూసినా తనివితీరని సినిమా సిరిసిరిమువ్వ . ఈతరంలో చూడనివారు ఎవరయినా ఉంటే వెంటనే చూసేయండి . యూట్యూబులో ఉంది . ఆస్వాదించండి . సంగీత నృత్య వర్షంలో ముద్దయిపోవచ్చు . టివిలో వస్తే అసలు మిస్ కావద్దు . An unmissable visual feast . ఇంత గొప్ప కళాఖండాన్ని మనకు అందించిన విశ్వనాథ్ మహాశయునికి నివాళి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article