.
విధి చేయు వింతలన్నీ.. మతిలేని చేతలేనని…. అంటాడు ఆత్రేయ, మరోచరిత్ర సినిమాలో… సందర్భం వేరు, దానికి తగినట్టు కూర్చిన సాహిత్యం వేరు… కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ చదవగానే గుర్తొచ్చే పాట మాత్రం అదే…
అయితే ఇక్కడ విధి తన మతిలేని చేతను తనే దిద్దుకుంది, అదీ విశేషం… వివరాల్లోకి వెళ్తే… ఇది సినిమా స్క్రీన్‌ప్లేను తలపించేలా నిజ జీవితంలో నెదర్లాండ్స్‌లో చోటుచేసుకుంది. భారతదేశంలో శిశువులుగా ఉన్నప్పుడే అనాథాశ్రమాలలో చేర్చబడి, వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లిన ఇద్దరు సోదరీమణుల భావోద్వేగ పునఃకలయికకు సంబంధించిన కథ ఇది…
Ads
వివరాలు ఇలా ఉన్నాయి… నేపధ్యం – తొలి పరిచయం… (1996) భారత సంతతికి చెందిన మీనా జెల్టింక్ (43), మినల్ టిజ్సెన్ (44) వేర్వేరు కుటుంబాల ద్వారా నెదర్లాండ్స్‌లో పెరిగారు. వీరిద్దరి ఇళ్ల మధ్య దూరం కేవలం 130 కిలోమీటర్లు మాత్రమే. 1996లో దత్తత తీసుకున్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో వీరు టీనేజర్లుగా మొదటిసారి ఎదురుపడ్డారు.
ఎటువంటి రక్తసంబంధ వివరాలు తెలియకపోయినా, వారిద్దరి మధ్య ఏదో తెలియని బలమైన ఆకర్షణ ఏర్పడింది. ఇద్దరి పోలికలు ఒకేలా ఉండటంతో స్నేహితులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆ చనువుతో వారు ఉత్తరాల్లో సరదాగా ఒకరినొకరు “సిస్” (Sis) అని పిలుచుకునేవారు.

కానీ కాలక్రమేణా జీవిత మార్పుల వల్ల ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 15 ఏళ్ల పాటు వారి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.
డీఎన్ఏ పరీక్షతో అద్భుత నిజం వెలుగులోకి… తన జన్మసంబంధ మూలాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో 2026 ఏప్రిల్‌లో మినల్ టిజ్సెన్ ప్రముఖ జెనెటిక్ టెస్టింగ్ సంస్థ ‘మై హెరిటేజ్’ (MyHeritage) ద్వారా డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నారు. ఫలితాలు వచ్చినప్పుడు మొబైల్‌లో “మీనా: సోదరి” అని 100 శాతం మ్యాచ్ చూపించడంతో ఆమె మొదట నమ్మలేకపోయారు.
ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మీనా పాత ఫొటోలు, వివరాలు పరిశీలించాక, టీనేజ్‌లో తాను ప్రాణస్నేహితురాలిగా భావించిన ‘మీనా’నే తన సొంత సోదరిగా గుర్తించి నివ్వెరపోయారు.
భావోద్వేగ పునఃకలయిక … (2026 ఆగస్టు 11) చివరికి చిన్ననాటి స్నేహితులుగా పరిచయమై, రక్తసంబంధం ఉన్న తోబుట్టువులని తేలిన ఆ సోదరీమణులు 2026 ఆగస్టు 11న నెదర్లాండ్స్‌లోని డెన్ బాష్ (‘s-Hertogenbosch) పట్టణంలో అత్యంత భావోద్వేగ వాతావరణంలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ఇన్నాళ్లుగా నా గుండెలో ఏదో తెలియని వెలితి, లోటు ఉండేది. ఇప్పుడు సరిగ్గా మిస్సయిన పజిల్ ముక్క దొరికినట్లయింది. నిన్ను చూస్తుంటే కచ్చితంగా ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది” అని మీనా భావోద్వేగానికి గురయ్యారు.
“మేము సోదరీమణులమని తెలియకముందే మంచి స్నేహితులమయ్యాం. నిజానికి మేమెప్పుడూ అక్కాచెల్లెళ్లమే, కాకపోతే ఆ విషయం దేవుడు మాకు చాలాకాలం పాటు దాచాడు” అని మినల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సోదరీమణుల అరుదైన, హృద్యమైన పునఃకలయిక నెట్టింట ఎంతో వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తోంది…
Share this Article