Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పార్లమెంటులో తన కుటుంబం మీద పాక్షిక సత్యాలే వెల్లడించిన ఏచూరి..!!

September 16, 2024 by M S R

ఏచూరి వంటి తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా?
………………………………………………………………………

ఇండియాలో ఎంతటి గొప్ప రాజకీయ నాయకుడైనా తాను అన్ని మతాలకూ సమ దూరంలో ఉండే లౌకికవాదినని, తనకు కులం పట్టింపు లేదని చెప్పుకోవడానికి తన జీవితంలో వాటికి సంబంధించిన అనుకూల అంశాలనే వెల్లడిస్తాడు. ఈ విషయంలో తాను అతీతుడిని కాదని మొన్ననే కన్నుమూసిన జగమెరిగిన తెలుగు మార్క్సిస్టు కామ్రేడ్‌ సీతారామ్‌ ఏచూరి ఏడేళ్ల క్రితం పార్లమెంటులో నిరూపించుకున్నారు.

నాటి మద్రాసు నగరంలో పుట్టిన సీతారామ్‌ తాను విద్యాభాసం చేసిన తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ నుంచి ఎన్నికయ్యే అవకాశం లేకపోవడంతో సీపీఎంకు సంఖ్యాబలం ఉన్న పశ్చిమ బెంగాల్‌ నుంచి 2005, 2011లో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యసభలో పన్నెండేళ్లు సాగిన సభ్యత్వం ముగుస్తున్న సందర్భంగా ఏడేళ్ల క్రితం 2017 ఆగస్ట్‌ 10న ఏచూరి వీడ్కోలు ప్రసంగం చేశారు.

Ads

ఆ రోజు మాట్లాడుతూ, ‘‘ హైదరాబాద్‌లో కొన్నేళ్లు చదివాక ఢిల్లీ వచ్చి ఉన్నత విద్యాభ్యాసం చేశాను. విద్యార్థిగా ఢిల్లీ వచ్చి ఇక్కడే ఢిల్లీ మహిళను (సీమా చిశ్తీ) పెళ్లాడాను. ఆమె ఇంటి పేరు చిశ్తీ. ఈ ఇంటిపేరు ఇస్లాం అనుసరించే సూఫీ పరంపరకు చెందిన ప్రముఖులది. నా భార్య తండ్రి చిశ్తీ. ఆమె తల్లి రాజపూత్‌. అందులోనూ 8వ శతాబ్దంలో ఢిల్లీ వచ్చి స్థిరపడిన మైసూరు రాజపుత్‌ కుటుంబానికి చెందిన మహిళ ఆమె తల్లి.

మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. నా భార్య ఈ ఇద్దరు వేర్వేరు వర్గాలకు చెందిన తల్లిదండ్రులకు పుట్టింది. దక్షిణాది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువకుడినైన నాకు ఈ వైవిధ్యభరితమైన కుటుంబంలో పుట్టిన యువతితో పెళ్లయింది. ఆమెకు, నాకూ పుట్టిన కొడుకు ఏ పేరుతో (మతం–కులం విషయంలో) చలామణి అవుతాడు? ఇంతకీ అతను ఎవరు? అతను బ్రాహ్మణుడా? అతను ముస్లిమా? అతను హిందువా? అతను ఎవరు?

ఇంత కుటుంబ నేపథ్యం లేదా వైవిధ్యం కారణంగా అతన్ని భారతీయుడని తప్ప మరే ఇతర మాటతో పిలవడం కుదరదు. ఇది మన దేశం. ఇది నా ఆదర్శం. నేను నా కుటుంబ వైవిధ్యం గురించి చెబుతున్నాను. నా కొడుకు వంటి వాళ్లు దేశంలో ఎంత మంది ఉంటారు? అదే ఇండియా అంటే మరి. ఇలాంటి ఇండియాకు మనమంతా పరిరక్షకులం, అధ్యక్షా!’’ అంటూ సీతారామ్‌ ఏచూరి ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. ఆయన చెప్పినదంతా నిజమే.

మతాంతర వివాహం చేసుకున్న తెలుగు వైదిక బ్రాహ్మణుడు ఈ సీతారామ్‌. ఆయన తన రాజ్యసభ తుది ప్రసంగంలో చెప్పినదంతా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాక్షిక సత్యం మాత్రమే. బీబీసీ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రసిద్ధ మీడియా సంస్థల్లో ఉన్నత పదవుల్లో పనిచేసిన సీమా చిశ్తీని పెళ్లాడడానికి ముందు కామ్రేడ్‌ ఏచూరికి పశ్చిమ బెంగాల్‌ బెంగాలీ కుటుంబానికి చెందిన వీణా మజుందార్‌ అనే బైద్య కుటుంబంలో పుట్టిన వామపక్షవాది కూతురు ఇంద్రాణీ మజుందార్‌తో వివాహమైంది.

దిల్లీ జేఎన్యూలోనే చదువుకున్న సీతారామ్‌కు 1980లో పెళ్లికావడానికి ముందు పదేళ్లకు పైగా సుదీర్ఘ రిలేషన్‌షిప్‌ ఉంది. వారికి కొడుకు ఆశీష్, కూతురు అఖిల పుట్టిన కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆశీష్‌ 34 ఏళ్ల వయసులో 2021లో కొవిడ్‌–19 తో మరణించాడు. అఖిల ఒక యూనివర్సిటీలో చరిత్ర బోధించే ప్రొఫెసర్‌. అఖిలకు స్కాట్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర, యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌లో బోధించిన అనుభవం ఉంది.

దిల్లీ మహిళ సీమా, సీతారామ్‌ల కొడుకు దానిష్‌. ఈ కొడుకు గురించే రాజ్యసభలో చేసిన తన చివరి ప్రసంగంలో సీతారామ్‌ ఏచూరి వివరంగా ప్రస్తావించారు. తాను లౌకికవాదినని చెప్పుకోవడానికి సీమాతో పెళ్లి, దానిష్‌ (ఈ పేరు ముస్లింలు ఎక్కువ పెట్టుకుంటారు) జననం ఆయనకు చక్కగా ఉపయోగపడ్డాయి. అంతకు ముందు తన బ్రాహ్మణ కులానికే చెందిన బెంగాలీ మహిళ ఇంద్రాణీ మజుందార్‌తో పెళ్లయిన విషయం పార్లమెంటులో కామ్రేడ్‌ ఏచూరి ప్రస్తావించకపోవడం తెలుగు మార్క్సిస్టుల తెలివితేటలకు నిదర్శనం.

సందర్భాన్ని బట్టి అవసరమైన మేరకు వ్యక్తిగత వివరాలు బయటకు చెప్పడం తెలుగు రాష్ట్రాల రాజకీయనాయకులకు అలవాటే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు కూడా చానాళ్ల క్రితం తనకు, తన కుటుంబానికి ప్రాంతీయ విభేదాలు, వివక్ష లేవని నిరూపించుకోవడానికి ఓ విషయం ప్రస్తావించేవారు.

వైరుధ్యాలు వెంటాడిన నేత ఏచూరి
……………………………………..
తన మరదలిని ఆంధ్రాప్రాంతమైన కాకినాడ ఏరియా వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశామని కేసీఆర్‌ పదేపదే గుర్తుచేసేవారు. ఇదే తరహాలో ఏచూరి కూడా తన కుటుంబానికి సంబంధించిన ఒక పార్శ్వాన్ని మాత్రమే చూపించి తానొక గొప్ప లౌకికవాదినని ప్రకటించుకునే ప్రయత్నం రాజ్యసభలో చేశారని ఈరోజు ‘ద ప్రింట్‌’ అనే న్యూజ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించిన ఏచూరి ప్రసంగ పాఠం చదివాక తెలిసింది.

1947 ఆగస్టు 15 తర్వాత పుట్టిన భారత మార్క్సిస్టుల్లో ఒక్క ఏచూరి మాత్రమే కాదు ఆయనకు ముందు సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మరో ‘దక్షిణాది దిల్లీ’ నేత ప్రకాశ్‌ కారాట్‌ (కేరళలో మూలాలు) కూడా తన భాషా వర్గానికి (మలయాళీ) చెందని ప్రముఖ మహిళను పెళ్లాడారు. 1948లో బర్మాలో తండ్రి ఉద్యోగం చేస్తుండగా పుట్టిన మలయాళీ నాయర్‌ అయిన ప్రకాశ్‌ కారాట్‌ భార్య కామ్రేడ్‌ బృందా దాస్‌ కలకత్తాకు చెందిన ఉన్నత కుటుంబంలో జన్మించారు.

ఆమె తండ్రి సూరజ్‌ లాల్‌ దాస్‌ అప్పుడే పాకిస్తాన్‌లో భాగమైన లాహోర్‌ నుంచి కలకత్తా వచ్చి స్థిరపడిన పంజాబీ ఖత్రీ. బృందా తల్లి అశ్రుకణా మిత్రా బెంగాలీ కాయస్థ. అయినా ఏనాడూ తన వైవిధ్యభరితమైన వ్యక్తిగత వివరాలు పార్లమెంటులో చెప్పుకునే అవకాశం కామ్రేడ్‌ కారాట్‌కు రాలేదు. ఆయన రాజ్యసభ సహా ఏ చట్టసభకూ ఎన్నికయ్యే ప్రయత్నం చేయకపోవడమే దీనికి కారణం.

మళ్లీ సీతారామ్‌ ఏచూరి విషయానికి వస్తే– తన ముందు సీపీఎం జనరల్‌ సెక్రెటరీగా పనిచేసిన ప్రకాశ్‌ కారాట్‌ మాదిరిగానే ఈ తెలుగు వైదిక మార్క్సిస్టు కూడా ఢిల్లీ కేంద్రంగా పార్టీలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఎస్‌ఎఫ్‌ఐ నేత. అయితే, దశాబ్దాలపాటు దేశంలో ఏకైక ఆధిపత్య పాలకపక్షంగా కొనసాగిన కాంగ్రెస్‌తో సంబంధాల విషయంలో ఈ ఇద్దరు నేతలవీ భిన్న మార్గాలు.

సీపీఎం మొదటి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య గారు కాంగ్రెస్‌ పార్టీని గట్టిగా ఏనాడూ వ్యతిరేకించలేదు. కేరళ తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన మలయాళ నంబూద్రి బ్రాహ్మణుడు ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ మాత్రం ఏనాడూ కాంగ్రెస్‌తో రాజీపడలేదు. 1959లో తన ప్రభుత్వాన్ని అన్యాయంగా కూలదోసిన (నాటి ప్రధాని పండిత నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ పట్టుదల కారణంగా) కాంగ్రెస్‌ పై మెతక ధోరణి ఎప్పుడూ ఈఎంఎస్‌ అవలంబించలేదు. అన్ని మతాల మతోన్మాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన గొప్ప దక్షిణాది బ్రాహ్మణ మార్క్సిస్టు నంబూద్రిపాద్‌.

అయితే, ఆయన తర్వాత సీపీఎం పగ్గాలు తీసుకున్న పంజాబీ జాట్‌ సిక్కు కామ్రేడ్‌ హర్‌కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌తో పొత్తు, సఖ్యత అనే వైఖరిని విజయవంతంగా, ఫలవంతంగా అనుసరించిన కమ్యూనిస్టుగా చరిత్రలో మిగిలిపోయారు. ప్రకాశ్‌ కారాట్‌ పైన చెప్పుకున్నట్టు తన మలయాళీ కామ్రేడ్‌ నంబూద్రిపాద్‌ బాటలో పయనిస్తూ ఏకకాలంలో హిందూ, ముస్లిం మతోన్మాదంతో పోరాడారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరంలో సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలను నిలబెట్టారు.

ఈ క్రమంలో కమ్యూనిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఊహించనలవి కాని స్థాయిలో అదృశ్యమైనాగాని నమ్మిన బాటను విడవలేదు ‘ వెల్‌ డ్రెస్డ్, గుడ్‌ లుకింగ్‌ ’ మార్క్సిస్ట్‌ ప్రకాశ్‌ కారాట్‌. జేఎన్యూలో, ఎస్‌ఎఫ్‌ఐలో, సీపీఎంలో తనకు సీనియర్‌ అయిన ప్రకాశ్‌ కారాట్‌ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో (2005–2015) కాంగ్రెస్‌తో పెద్దగా శత్రుత్వం లేకుండా మెలిగిన సీతారామ్‌ ఏచూరి ఒక విషయంలో గట్టిగా నిలబడ్డారు.

మన్మోహన్‌సింగ్‌ను కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం అంశంలో పార్లమెంటు లోపల, వెలుపల యూపీఏ, కాంగ్రెస్‌ పార్టీలను తన వాగ్ధాటితో, లేఖలతో గడగడలాడించారు ఏచూరి. అయితే, 2014 నుంచీ కాంగ్రెస్‌తో మరీ ముఖ్యంగా నెహ్రూ– గాంధీ కుటుంబ పెద్దలైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సంత్సంబంధాలను మరణించే వరకూ నడుపుతూనే ఉన్నారు ఏచూరి. ఈ కారణంగానే హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం మహాసభల్లో ఏచూరి కాంగ్రెస్‌ అనుకూల పంథాను ప్రకాశ్‌ కారాట్‌ అనుకూల వర్గం చివరి వరకూ గట్టిగా వ్యతిరేకించింది.

1999లో సోనియాగాంధీని కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయపక్షాల మద్దతుతో ప్రధాన మంత్రిని చేయడానికి పంజాబీ సిక్కు కామ్రేడ్‌ సుర్జీత్‌ చివరి క్షణం వరకూ విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. కాని, ఆయన బాగా అభిమానించిన యూపీ నేత ములాయంసింగ్‌ ఆఖరి క్షణంలో మనసు మార్చుకోవడంతో సుర్జీత్‌ పథకం అమలు కాలేదు. అలాగే, గాంధీ కుటుంబంతో చక్కటి అనుబంధం పెంచుకున్న సీతారామ్‌ ఏచూరి కూడా సుర్జీత్‌ మాదిరిగానే రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయకుండానే కన్నుమూయడం సుందరయ్య, సుర్జీత్, సీతారామ్‌ వంటి కమ్యూనిస్టులకు గొప్ప ‘చారిత్రక విషాదం’… (మెరుగుమాల నాంచారయ్య)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions