నిజానికి ఇదేమీ నిఖిల్, దుల్కర్ నడుమ పోటీ ఏమీ కాదు… కాకపోతే పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? సీతారామం, కార్తికేయ-2 రెండూ వేర్వేరు జానర్లు… సీతారామం వైజయంతి మూవీస్ వాళ్లది… స్వప్న దగ్గరుండి కథను, కథనాన్ని, పాటల్ని, షూటింగ్‌ను చూసుకుంది… అశ్వినీదత్ డబ్బు పెట్టలేక కాదు, ఐనా సరే, ఎక్కడెక్కడో తిరిగి, షూటింగు కంప్లీట్ చేసి, 30 కోట్లతో సినిమాను పూర్తి చేయించింది ఆమె…
కొందరికి నచ్చకపోవచ్చుగాక… కానీ స్థూలంగా సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది… క్లాసిక్ సినిమా అనే పేరొచ్చింది… లాజిక్కులు పక్కనపెడితే వీసమెత్తు అసభ్యత, అశ్లీలత, వెగటుతనం లేకుండా సున్నితమైన ఉద్వేగాలను రంగరించి, కుటుంబమంతా కలిసి బేఫికర్‌గా చూడగల సినిమాగా మలిచింది స్వప్నా దత్… సినిమా మీద మౌత్ టాక్ టీవీ వీక్షణం మీద కూడా కాస్త పనిచేసినట్టుంది… స్టార్ మాటీవీలో నవంబరు 20న ప్రసారం చేస్తే 7.68 రేటింగ్ వచ్చింది… అదీ హైదరాబాద్ బార్క్… మొత్తం కలిపితే ఎనిమిదన్నరో, తొమ్మిదో వచ్చి ఉంటుంది.,..
జనం టీవీల్లో సినిమాలు చూడటం మానేస్తున్న ఈరోజుల్లో ఈమేరకు రేటింగ్స్ రావడం మరీ నిరాశాజనకం ఏమీ కాదు… బెటరే… 30 కోట్ల పెట్టుబడికి థియేటర్ రెవిన్యూయే 100 కోట్ల దాకా వచ్చినట్టుంది… ఓటీటీ, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ గాకుండా…! బిజినెస్ లెక్కల్లో ఇది సూపర్ హిట్టే… స్వప్న మరో సీతారామం తీయడానికి భరోసా వచ్చినట్టే… రష్మిక సరే, కానీ దుల్కర్, మనకు కొత్త నటి మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్లోకి ఇంకాస్త వెళ్లినట్టే… ఇక కార్తికేయ-2 విషయానికి వస్తే…
Ads
నవంబరు 22న జీతెలుగు టీవీలో కార్తికేయ-2 ప్రసారం చేశారు… నిజానికి ఇది బంపర్ హిట్ సినిమా… అదొక మ్యాజిక్… ఆ సక్సెస్‌ను నిర్మాతలే అంచనా వేయలేకపోయారు… హిందీలోకి కూడా డబ్ చేశారు కదా… దుమ్మురేపింది థియేటర్లలో… జస్ట్, 15 కోట్లు పెడితే… 120 కోట్లు వచ్చి పడ్డాయి… ఆ ఖర్చులోనే స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ దేశాల్లో కూడా షూట్ చేశారు… ఇదీ సినిమా నిర్మాణ వ్యయం ప్లానింగ్ అంటే… నిజంగా మెచ్చదగినదే…
హిందీలో మొదట 53 షోలు పడితే… అయిదే రోజుల్లో దాన్ని 1575 షోలకు పెంచాల్సి వచ్చింది ప్రేక్షకుల డిమాండ్ మేరకు… ఈ సినిమాతో నిఖిల్, అనుపమ కెరీర్లు ఒక్కసారిగా నాలుగైదు మెట్లు ఎక్కాయి… ఇంత హిట్టయింది కదా… కానీ టీవీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు… 6.68 రేటింగ్ మాత్రమే వచ్చింది… అంటే సీతారామంకన్నా తక్కువ… సరే, సినిమా సినిమాకు తేడా ఉంటుంది కానీ… సీతారామం వంటి ఓ మోస్తరు సూపర్ హిట్ సినిమాతో పోలిస్తే, బంపర్ హిట్ కొట్టిన కార్తికేయ-2 సినిమాకు తక్కువ రేటింగ్స్ రావడం ఓ విశేషం అనిపించింది… పైగా ఇప్పుడు ట్రెండ్ కూడా కాస్త ఫిక్షన్, కాస్త స్పిరిచువల్ బ్లెండ్ కదా… ఐనా సరే, కార్తికేయుడికన్నా సీతారాముడినే ఆదరించారు టీవీ ప్రేక్షకులు…!!
Share this Article