.
మనం కుబేర గురించే చెప్పుకుంటున్నాం… కానీ ఇదే సమయంలో రిలీజైన ఆమీర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్ గురించీ చెప్పుకోవాలి ఓసారి…
కుబేర 27.5 కోట్లు, సితారే జమీన్ 20 కోట్లు… నిజానికి ఆమీర్ ఖాన్ రేంజుకు చాలా తక్కువే… కానీ ఇది సగటు రొటీన్ కమర్షియల్ బాలీవుడ్ సినిమా కాదు… ఓ డిఫరెంట్ స్టోరీ… కుబేరలో ఎలాగైతే నాగార్జున, ధనుష్ తమ రొటీన్ కెరీర్ పాత్రలకు భిన్నమైన పాత్రలు చేశారో… ఆమీర్ ఖాన్ కూడా అంతే…
Ads
ఎస్, ఆమీర్ ఖాన్‌కు ఇదేమీ కొత్త కాదు… చాలా ప్రయోగాలు చేస్తాడు, చేయగలడు, ఆ టేస్టుంది తనకు… పైగా డిస్లెక్సియా బాపతు ఓ మానసిక అపసవ్యత మీద తారే జమీన్ పర్ సినిమా తీసి, హిట్ కొట్టిన అనుభవమూ ఉంది…
అంతేకాదు, స్వయంగా తన కొడుకు కూడా ఇదే వ్యాధి పీడితుడని అంటారు… అంటే, త్వరగా నేర్చుకోలేకోవడం, ఇతర పిల్లల్లా చురుకైన మెదడు ఎదుగుదల లేకపోవడం… సో, తనకు వ్యక్తిగతంగా కనెక్టయిన కథ…
తను సాహసి అని ఎందుకు అనుకోవాలి అంటే… ఇండియన్ సినిమాను ఓటీటీలు నిర్దేశిస్తున్న సమయం ఇది… వాటి గుత్తాధిపత్యాన్ని, పెత్తనాన్ని బ్రేక్ చేసేలా… యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని చెప్పాడు… గుడ్…
ఈ సినిమా విషయానికి వస్తే… హీరోలందరూ ఇలాంటి కథను యాక్సెప్ట్ చేయరు… ఆమీర్ ఖాన్ చేయగలడు… ప్రధానంగా ఈ కథలో మానసిక దివ్యాంగులను తొలుత తేలికగా తీసుకునే ఓ బాధ్యతారహిత, ఆవేశపరుడైన కోచ్… ఏదో శిక్ష అనుభవిస్తూ వాళ్లకు కోచింగ్ ఇస్తూ… తనే ఓ మనిషిలా మారడం మంచి స్టోరీ లైన్…
అసలు కోర్టు భిన్నమైన తీర్పుతో మొదలైన ఈ వైవిధ్యం చివరి దాకా కొనసాగుతుంది… సరే, నడుమ భార్య, తల్లి ఎట్సెట్రా ట్రాకులు అంతగా మెప్పించకపోయినా… ఆ పిల్లలతో స్నేహం, వాళ్లను డీల్ చేయడంలో పూసిన నవ్వులు బాగున్నయ్…
ఎస్, మరీ సినిమాటిక్‌గా ఆ పిల్లలు వరుసగా మ్యాచులు గెలవడం ఎలా ఉన్నా… ఈ సినిమాకు ప్రేరణగా ఉన్న ఒరిజినల్ సినిమాలో ఉన్న అదే బాస్కెట్ బాల్ ఆటను నేపథ్యంగా తీసుకోవడం ఇండియన్ ప్రేక్షకుడిని కనెక్ట్ చేయదు…
అప్పట్లో రాజమౌళి సై అనే సినిమాలో ఇలాగే బేస్‌బాల్ ఆట ఆధారంగా కథను నడిపాడు… పెద్దగా నచ్చలేదు అందుకే… ఈ బాస్కెట్ బాల్ కూడా అంతే… సరే, మరీ దంగల్ సినిమాలోలాగా క్రికెట్ ఎంచుకోలేరు గానీ, ఇంకేదైనా ఆట సెలెక్ట్ చేసుకుని ఉండాల్సింది…
ఆమీర్ ఖాన్ ఎంచుకున్న కథలో మెల్లిగా లీనమైతేనే సినిమాను ఎంజాయ్ చేయగలం… జెనీలియాలో పర్లేదు, మంచి నటి ఉందని ఇన్నేళ్ల తరువాత తెలిసింది… ఇక సినిమా సంగీతం, పాటలు, ఇతర నిర్మాణ విలువలు పర్లేదు, వంక పెట్టడానికి ఏమీ లేదు…
ఎస్, కొత్త కథలు రావాలి, మంచి టేస్టున్న భిన్నమైన కథలు రావాలి… అది హిందీలో కావచ్చు, ఇతర ఇండియన్ భాషల్లో కావచ్చు… రొటీన్, ఫార్ములా కథలు బ్రేక్ కావాలి… ఇదీ అదే… ఆహ్వానిద్దాం..!! ఎంతకాలం చూద్దాం… బూతులు, వెగటు కామెడీ ట్రాకులు, బీభత్సమైన హింస, నెత్తురు, పిచ్చి పాటలు, తిక్క స్టెప్పులు…
చివరగా… పిల్లలతో ఆ పాత్రలకు తగిన నటన రాబట్టడం ఓ పెద్ద టాస్క్… అందులో దర్శకుడు బాగా సక్సెస్.,.!! కానీ ఏమాటకామాట… పాత తారే జమీన్ పర్ సినిమా కదిలించినట్టుగా, ఎందుకో గానీ ఈ సితారే జమీన్ పర్ సినిమా అంతగా కదిలించలేదు..!! #sitarezameenpar , #genilia , #aamirkhan
Share this Article