ఓరోజు పార్వతి ఎందుకో చిరాగ్గా ఉంది… శివుడి రాకను కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తోంది… శివుడు ఆమెను సమీపించి, ఆమె చుబుకం పట్టుకుని, తన కళ్లల్లోకి చూస్తూ, గౌరీ ఏమిటీ పరాకు అనడిగాడు… నాకు అకారణంగా విసుగు వస్తోంది స్వామీ, నాకేదైనా వినోదాన్ని అందించే నాలుగు మాటలు చెప్పు స్వామీ అనడిగింది ఆమె… శివుడు ఓసారి సావధానంగా చూసి, సరే నేనొక ముచ్చట చెబుతాను విను…
శివుడు అప్పటికప్పుడు ఓ కథను క్రియేట్ చేసి చెప్పసాగాడు… ప్రపంచపు మొట్టమొదటి కథ అది… ఇది మధ్య హిమాలయాల్లో ఎక్కడో ఏ రహస్య రాతి గుహలోనో చెప్పబడి ఉంది… ఆ కథ అక్కడే ఆ మంచు పొరల నడుమ సమాధి అయిపోయేదేమో కానీ ఆ కథంతా ఆ మంచు ఉత్పాతంలో చిక్కుకుని, ఇంకా బతికి ఉన్న ఓ చిన్న పిట్ట పిల్ల విన్నది…
అది తనకు కనిపించిన ఓ చేపతో ఈ కథను షేర్ చేసుకుంది… చేప ఓ గంధర్వుడికీ, గంధర్వుడు ఓ యక్షుడికి చెప్పారు… కథ నోరు మారేకొద్దీ అనేక మార్పులు, చేర్పులకు లోనవుతుంది తెలుసు కదా… ప్రక్షిప్తాలు వచ్చి చేరతాయి, అసలు అంశాలు మాయమవుతాయి… ఈ కథ మనుషుల దగ్గరికి వచ్చేసరికి అసలు కథ ఎక్కడో పోయింది. ఇప్పుడు వినిపించే కథ అసలు శివుడు చెప్పిందే కాదు…
Ads
ఈ కథలోకి ఏవేవో పాత్రలు వచ్చి చేరాయి… అసలు ఒక్క కథగా లేదు, అనేక కథలు, అందులోనూ ఇంకొన్ని కథలు, వాటికి ఉపకథలు… అదొక అనంతమైన కథల నిధిలా మారింది… అదే బృహద్ కథ… దాన్నే తరువాత కాలంలో కథా సరిత్సాగరం అన్నారు… కథల్లో అనేక మలుపులు, ఈ పరిణామమంతా శివుడు నవ్వుతూ గమనిస్తున్నాడు… ఈ నవ్వు ఏమిటో తెలియక పార్వతి అయోమయంలోకి పడిపోతోంది…
ఒక్కసారి ఆలోచించండి… కథలు లేని జీవితం ఎలా ఉంటుందో… అసలు అలరించే హీరో లేకపోతే, భయపెట్టే విలన్ లేకపోతే, నవ్వించే కామెడీ లేకపోతే, ట్రాజెడీ కన్నీళ్లు పెట్టించకపోతే… ఒక సాహసం, ఒక స్వర్గం, ఒక నరకం… అసలు ఒక దేవుడే లేకపోతే జీవితం ఎంత నిస్సారం అయి ఉండేది… అందుకే కథ మన జీవితంలో ఒక భాగం… మనిషిత్వంలో కథ ఓ అంతర్భాగం అయిపోయింది…
ప్రపంచంలో మనిషి తప్ప మరే జంతువూ కథలు చెప్పదు… చెప్పలేదు… అసలు వాటికి కథలు చెప్పే అవసరమే కలగదు… అసలు వాటికి ఆ సౌకర్యం, సాంకేతిక నిర్మాణమే లేదు… మనకు నుదుటి వెనుక వైపు నియో ఫ్రంటర్ కార్టెక్స్ ఉంటుంది… అది మెదడులో ఒక భాగమే… దానికి కల్పనాత్మక శక్తి ఉంటుంది…. అదే మనకు మస్తు కథలు చెబుతుంది… చెప్పిస్తుంది…
అసలు జంతువులకు కథల అవసరం లేదు… ఆకలైతే ఏదో వేటాడి తింటాయి… లేదంటే ఆకులు, అలములు, దుంపలు, కాయలు, పళ్లు… దాహమైతే నీళ్లు తాగుతాయి… తిని, తాగాక దానికి వేరే పనిలేదు… రెస్ట్ లేదంటే తోటి జంతువులతో కలిసి ఆట, వేట… కానీ మనుషులు అలా కాదు… మనకు ఆకలి ఎందుకో తెలియాలి… దాహం ఎందుకో తెలియాలి… మనల్ని ఆలోచింపజేస్తుంది… మనకు వివరణలు కావాలి, జవాబులు కావాలి… సరైన జవాబు లేకపోతే ఏదో కథ చెప్పబడాలి… అలా అనేకానేక కథలు పుట్టుకొచ్చాయేమో…
మనిషి తన మాట వినడం లేదని కావచ్చు ఆకలినీ, దాహాన్ని సృష్టించాడు దేవుడు… మనిషికి శిక్షగా…! తను ఎవరు..? అది ఏమిటి..? ఈ ప్రశ్నల నుంచి బోలెడు కథలు పుట్టుకొచ్చాయా..? లేక కథలే కొత్త ఆలోచనల్ని పుట్టిస్తున్నాయా..? ఇదొక అంతం లేని వాదన… కథల నుంచి కథానాయకులు పుట్టుకొచ్చారా..? కథానాయకులున్నారు కాబట్టే కథలు పుట్టుకొచ్చాయా..? ఇండియన్ సినిమా కథకు సమానమైన సంక్లిష్టత ఇది…
అఫ్ కోర్స్, సైన్స్ ముందే పుట్టింది… మనం చెప్పే ప్రతి కథనూ అది తిరస్కరించింది… ఇప్పుడు సైంటిస్టులు దేవుడు లేడని మనకు చెబుతారు… ఈ హీరోలు, విలన్లు భ్రమలు, భావనలు తప్ప నిజాలు కావని చరిత్రకారులు కూడా చెబుతుంటారు… అసలు కథానాయకుడంటే నిర్వచనం ఏమిటి..? దానికి ఓ ప్రాతిపదిక లేదు, చెక్ లిస్టు లేదు… అవునూ, ఒకరికి హీరోగా కనిపించేవాడు వేరొకరికి విలన్‌గా కనిపించవచ్చు… ఇవన్నీ మన భావనలను బట్టి రూపాలు, గుణాలను మార్చుకుంటుంటాయి… మన కల్పన మన ఇష్టం..
ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ముందుగా టెలివిజన్ ఆఫ్ చేసి, వార్తా పత్రిక తెరవాలి… ఎన్ని రకాల కథలు మనకోసం సృష్టించబడుతున్నాయో మొదటి పేజీ నుంచి కూడా తెలుస్తుంది… ఒకే సంఘటనను కామెడీ చేస్తాయి, అవే అవసరమైతే ట్రాజెడీగా మారుస్తాయి… అసలు నిజం ఏమిటబ్బా అనే ఆలోచన మనల్ని విస్తుపోయేలా చేస్తుంది… బహుశా ఈ ప్రశ్నను, ఈ మథనాన్ని రేకెత్తించడం కోసమే శివుడు పార్వతికి ఈ కథ చెప్పి ఉంటాడు… (ఈ కథనానికి బాష్యాలు కష్టం… ఎవరి జ్ఞానం లోతును బట్టి వారికి అర్థమవుతుంది… ఇంగ్లిషులో కనిపించిన ఓ కథనానికి ఇది నా స్వేచ్చానువాదం…)
Share this Article