హనుమాన్, కాంతారా, కార్తికేయ… ఇంకేమైనా హిట్ సినిమాలుంటే… అన్నీ మిక్సీలో వేసి, తరువాత కిచిడీ చేసి… ఓ కథ వండి… ఓహ్ సూపర్ స్టోరీ లైన్ దొరికింది సుమీ అనుకున్నాడేమో దర్శకుడు… అదేనండీ శివం భజే సినిమా కథ గురించే…
ఇప్పుడు ట్రెండ్ అదే కదా… దేవుడు, ఫాంటసీ కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఓ కథ రాసుకున్నాడు… హిడింబ అని ఆమధ్య ఏదో ఇదే తరహా డిఫరెంటు సినిమాలో చేశాడు కదా, అదే అశ్విన్ బాబు హీరోగా తీసుకున్నాడు… కానీ ఎంత ఫాంటసీ అయినా, ఏ పురాణం ఫ్లేవర్ కలిపినా… జనాన్ని కన్విన్స్ చేసేలా ఉండాలి కదా…
అసలు ఫస్టాఫ్ అంతా లోన్ రికవరీ ఏజెంటుగా హీరో ఇంట్రడక్షన్, తన ప్రొఫెషన్… తెలుగు సినిమా అన్నాక హీరోయిన్ ఉండాలి కదా… దిగాంగన అనే సదరు హీరోయిన్‌తో లవ్వు ట్రాకు… తరువాత హీరో కళ్లు పోతే వేరే కళ్లు పెడతారు… తీరా చూస్తే అవి కుక్క కళ్లు అట… అవి పెట్టాక ఏవేవో పాత సంగతులన్నీ గుర్తొస్తాయి… ఆ కళ్లకే కనిపిస్తూ ఉంటాయి…
Ads
ఇక అక్కడి నుంచి కథలో దేవుడు, దేశ సరిహద్దులు, యుద్ధాలు, వ్యూహాలు, మాయలు, భ్రమలు… మన్నూమశానం… తీసేవాడికి చూసేవాడు లోకువ… అన్నింటికీ మించి వెగటు కామెడీ… హైపర్ ఆది అంటేనే ఆ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల తాలూకు వెగటు పంచులు గుర్తొస్తాయి… కుక్కతో హీరోకు సంబంధాన్ని అంటగట్టే డైలాగులు ఏం అభిరుచి..?
సినిమాల్లోనైనా ఆ ఇమేజీ నుంచి బయటపడాలనుకోవాలి కదా… నో, దర్శకుడు కూడా ఆది అంటే అదే తరహా పంచులు, జోకులు మస్ట్ అనుకున్నట్టున్నాడు… ఫాఫం ఆది… మరీ ఓచోట హీరోతో యూరిన్ పోయించే సీన్ మరీ ఏవగింపు కలిగేలా ఉంది… హైపర్ ఆది ఇదే తన మార్క్ అనుకుని, ఇలాగే కొనసాగితే… ఇక అంతే సంగతులు… పైగా దాన్ని పాతాళగంగతో పోల్చడం, షకలక శంకరుడి దవడ డైలాగ్ మరో నీచం…
ఇదీ దర్శకుడి టేస్టు… కథకు మస్తు మసాలాలు ఉండాలనుకుని… ఇలాంటి కామెడీ, అంతర్జాతీయ టెర్రరిజం, దేవుడు, జీన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, మెడికల్ సైన్స్, డివైనిటీ, యాక్షన్… పోనీ, ఆ డిఫరెంట్ కథకు డిఫరెంట్ క్లైమాక్స్ ఏమైనా ఉందా..? సోది క్లైమాక్స్… ఒక కాంతారా, ఒక హనుమాన్, ఒక కార్తికేయ తీయాలనే సంకల్పం మంచిదే గానీ… వెగటు కామిడీని రంగరించి, బోలెడంత మసాలా వేస్తే… ఇదుగో ఇలాంటి రుచీపచీ లేని కిచిడీ తయారవుతుంది… ఫాఫం అశ్విన్ బాబు…
Share this Article