‘‘హాఁ… హేమిటీ… సోనియా సారథ్యంలోని కూటమిలోకి జగన్, కేసీయార్ వచ్చి చేరాలా..?’’ అని హెడ్డింగు చదివి హాశ్చర్యపోయాచా..? అంతేలెండి… ఆ సంపాదకీయం రాసినవాడు, ఆ పత్రిక బాసు తప్ప దేశంలో ప్రతి ఒక్కరూ నోళ్లు వెళ్లబెట్టాల్సిందే… విషయం ఏమిటంటే..? ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా… శివసేన రాజకీయాల రూటే వేరు…
అప్పుడంటే బాల్ ఠాక్రే ఉండేవాడు… చాలా కథలు పడేవాడు… హిందుత్వ చాంపియన్ అనే పేరుండేది… ఆ కథ వేరే ఉండేది… ఈ పిల్ల చాంపియన్ ఆదిత్య ఠాక్రే వచ్చాడు కదా… ఎప్పుడైతే కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి, కుర్చీ ఎక్కాడో… హిందుత్వ పల్లకీని కిందపడేశాడో… దాని అస్థిత్వపు పునాదులే కదులుతున్నయ్… ఈయన గారికి ఓ శకుని ఉన్నాడు… పేరు సంజయ్ రౌట్… తన సలహాలతో ఆ శివసేనను ఇంకాస్త కాస్త లోతుల్లోకి నెట్టేస్తూ ఉంటాడన్నమాట…
శివసేన పత్రిక సామ్నాను తనే చూస్తుంటాడు… అందులో తాజాగా ఓ సంపాదకీయం… అది ఏమంటున్నదీ అంటే..?
Ads
‘‘ఇన్నిరోజులైనా రైతుల ఆందోళనలకు బీజేపీ ఎందుకు స్పందించడం లేదు..? మోడీ ఎందుకు లైట్ తీసుకుంటున్నాడు..? కారణం తెలుసా..? ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఫెయిల్యూర్… అసలు బలమైన ప్రతిపక్ష కూటమిగా తన పాత్ర తను పోషించడం లేదు… అందుకే బీజేపీపై పొలిటికల్ హీట్ ఫీల్ కావడం లేదు, దానికి అసలు ప్రెజరూ లేదు, అందుకే పట్టించుకోవడం లేదు… ఓ ప్రధాన ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించాలో దానికి అర్థం కావడం లేదు… ఫెయిల్…
ప్రభుత్వాన్ని నిందించకండి, అసలు ఓ ప్రతిపక్షంగా మీకు పోరాటం చేతనైతే కదా… యూపీఏ కూటమి ఓ ఎన్జీవో తరహాలో కనిపిస్తోంది ప్రస్తుతం… అసలు ఆ కూటమి సభ్యపార్టీలు రైతుల ఆందోళనల్ని సీరియస్గా తీసుకోవడం లేదు… ఎలా స్పందించాలో కూడా వాటికి తెలియడం లేదు…
బెంగాల్లో ఒక్క మమత మాత్రమే బీజేపీపై పోరాడుతోంది… ఆమెకు శరద్ పవార్ మాత్రమే మద్దతు పలుకుతున్నాడు… వేరే ఏ ఇతర ప్రతిపక్షమూ ఆమెకు బాసటగా నిలవడం లేదు దేనికి..? నిజానికి బెంగాల్లో యాంటీ-బీజేపీ రాజకీయాలకు కాంగ్రెస్ సారథ్యం వహించాలి కదా… ఏమైంది..?’’
‘‘తృణమూల్ కాంగ్రెస్, శివసేన, అకాలీదళ్, బహుజన సమాజపార్టీ, అఖిలేష్ పార్టీ, జగన్ రెడ్డికి చెందిన వైఎస్సార్సీపీ, తెలంగాణ నుంచి కేసీయార్, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, కర్నాటకలో కుమారస్వామి… వీళ్లంతా బీజేపీ వ్యతిరేకులే… కానీ ఈ పార్టీలేవీ కాంగ్రెస్ కూటమిలో లేవు… వాళ్లను అర్జెంటుగా కాంగ్రెస్ కూటమిలోకి, అనగా యూపీయేలోకి తీసుకొచ్చి, బలమైన పోరాటాన్ని నిర్మిస్తే తప్ప లాభం లేదు…’’
………. ఇలా చెప్పుకుంటూ పోయింది ఆ సంపాదకీయం… హహహ… మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలులో సరిగ్గా అడుగులు పడటం లేదు అని ఈమధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా మహారాష్ట్ర సీఎం ఠాక్రేకు ఓ లేఖ రాసింది కదా… అప్పుడే మొదలైంది ముసలం… ఎహె, ఊరుకోవమ్మా, చెప్పొచ్చావు గానీ అని నేరుగా అనకుండా… ముందు నీ యూపీఏ సంగతి చూసుకో అన్నట్టుగా ఈ సంపాదకీయం రాయబడింది… వెంటనే ఈ సంపాదకీయానికి కాంగ్రెస్ స్పందించింది… మాజీ సీఎం అశోక్ చవాన్ ‘‘శివసేన అసలు యూపీఏ మెంబర్ కాదు, మరి అది ఎలా ఉంటే నీకెందుకోయ్ తీట’’ అని కామెంట్ చేశాడు… నసీం ఖాన్ వ్యాఖ్య ఏమిటంటే… ‘‘మీకు కేవలం ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆధారంగా మద్దతు ఇస్తున్నామని గుర్తుంచుకొండి’…
సరే, వాళ్ల సంగతి వదిలేస్తే… ఈ పత్రిక బాధ్యులకు, శివసేన ముఖ్యులకు పలు రాష్ట్రాల రాజకీయాల్లోని సంక్లిష్టత ఏమాత్రం తెలియనట్టుంది… కేసీయార్ తన ప్రత్యర్థి బల్లేన్ని తెచ్చుకుని పక్కలో పెట్టుకుంటాడా..? జగన్ రెడ్డి అసలు కాంగ్రెస్ను మళ్లీ లేవనిస్తాడా..? అసలు వీళ్లిద్దరూ బీజేపీకి వ్యతిరేకంగా పోగలరా..? మరీ ప్రత్యేకంగా జగన్ బీజేపీతో విరోధం పెట్టుకునే స్థితిలో ఉన్నాడా..? ఆ బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి టీఎంసీ మీద పోరాటం చేయబోతున్నారనే సంగతీ తెలియదా..? హేమిటో, ఈ రాజకీయ అనుబంధ పత్రికలన్నీ ఇంతేనేమో… మన తెలుగు రాజకీయ పత్రికల్లాగే..!!
Share this Article