Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెజవాడ అంటేనే అట్లుంటది మరి… ఆరు రుతువులూ వేసవే ఇక్కడ…

May 18, 2023 by M S R

Chat at Heat: విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే సమసించి ఉంటాయని శతాబ్దాలుగా రుజువయిన సత్యం.

1. బండలు పగిలే మెండు ఎండల తీవ్ర వేసవి;
2. ఒళ్లు కాలి వేడెక్కే వేసవి;
3. వేడిగాడ్పుల వేసవి;
4. ఒక మోస్తరు వేసవి;
5. మామూలు వేసవి;
6. వేసవి కాని వేసవి- అని విజయవాడలో ఆరు రుతువులు ఉంటాయి.

ఇతర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ కంటే విజయవాడలో 45 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్నట్లు అనిపించడానికి, విజయవాడ కంటే నిప్పుల కొలిమే నయం అనిపించడానికి శాస్త్రీయమయిన కారణాలు తెలుసుకున్నా ఎండ నుండి ఉపశమనం ఉండదు కాబట్టి లోకం ఆ విషయాలకు పెద్ద విలువ ఇవ్వలేదు.

Ads

మనిషి అనాదిగా ప్రకృతితో పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. అలా విజయవాడ కూడా అనాదిగా ఎండలతో పోరాటం సాగిస్తూనే ఉంది. విజయవాడను బెజవాడ అనే వాళ్ళందరూ “బ్లేజ్ (మండే) వాడ” అని కూడా అంటుంటారు.

చర్మాన్ని వేడి సూదులతో గుచ్చినట్లు ఉన్నా, వడగాడ్పులకు మండి కళ్లు ఎరుపెక్కినా, అర గంట ఎండలో ఉంటే తపించి, నీరసించి కళ్లు తిరిగి పడిపోతున్నా విజయవాడ వేడి వేడి టీ లు తాగగలదు. సిగరెట్లు, బీడీలను మండించగలదు. వేడి వేడి మైసూర్ బోండాలు, పునుగులు, మిరపకాయ బజ్జిలు తినగలదు. బహుశా వేడికి వేడి తోడయితే చలువ చేస్తుందన్న “ఉష్ణం ఉష్ణేన శీతలం” ప్రమాణం దీనికి ఆధారమేమో!

మొన్న ఒకరోజు విజయవాడలో సూర్యుడు లేవక ముందే లేచి మచిలీపట్నం వెళ్లి అక్కడ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తిన ఉండగా బందరు పోర్టుకు శంకుస్థాపన జరగబోయే ప్రాంతంలో తెగ తిరగాల్సి వచ్చింది. వేడి గాలికి రేగే దుమ్ము కళ్ళల్లో పడుతోంది. మండే ఎండకు స్మార్ట్ ఫోన్ తెర మీద అక్షరాలు కనిపించడం లేదు. ఫోన్ వేడెక్కి దానంతట అదే ఆగి…దాని మనసు చల్లబడినప్పుడు మళ్లీ దానంతట అదే ఆన్ అవుతోంది. ఇన్నోవా చక్రాలు ఇసుకలో కూరుకుని బండి డ్రయివర్ నడిపినట్లు కాకుండా దాని ఇష్టమున్నట్లు వెళుతోంది. “దూరం బాధిస్తున్నా పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతుంది…” అన్న వచనకవి వాక్కు గుర్తుకు తెచ్చుకుని అలాగే బంగాళాఖాతం మీద పడ్డాను.

ఎడారిలో ఒయాసిస్సులా అక్కడ కూడా ఒక అభిమాని కనిపించి…నిలుచోండి సార్…ఎగసే అలల బ్యాగ్రౌండ్ లో ఒక ఫోటో తీస్తా…అన్నాడు. రోమ్ తగలబడుతుంటేనే ఫిడేలు వాయించాలి. ఎండలు తగలబడుతుంటేనే ఫోటోలు దిగాలి. అందునా ఎవరూ లేని ఏట్లో అభిమాని అడిగితే కాదనకూడదనుకుని అంతటి ఎండలో చల్లగా నవ్వుతున్నట్లు నటించి…నిలుచున్నా. చేతిలో గొడుగు లేదు. (ఎండకు గొడుగు పట్టడం అన్నది నామోషీ!) నెత్తిన టోపీ లేదు. నిమిష నిమిషానికి నీళ్లు తాగుతూ ఎలాగో మేనేజ్ చేశాను.

విజయవాడ నుండి బందరు అభివృద్ధి కార్యక్రమాలపై వార్తా కథనాలను రిపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా బృందంలో టీ వీ 9 హసీనా ఎండలో అంతా కలియ తిరిగి…కారెక్కి ఏ సీ లో కూర్చుని… నీళ్లివ్వండి సార్! అని నీరసంగా అడిగింది. ఒక వారం బయట తిరగకండి…ఎండలకు చస్తారు అని మనమే చెప్తాము…మనమేమో ఇలా ఎండల్లోనే పడి తిరుగుతున్నాం అని స్వగతంలో పైకి వినపడేలా అనుకుంది. భోజనాల తరువాత అందరూ నీరసించి మొహాలు వేలాడేసుకుని ఉంటే…హెచ్ ఎం టీ వి వినయ్, టెన్ టి వి దుర్గ మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడి నుండి కూడా రిపోర్ట్ చేసినట్లు వీడియో రికార్డ్ చేసుకువస్తామని వెళ్లారు.

చేసుకుని వచ్చారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల్లా మీరిద్దరూ ఎండలకు ఎదురెళ్లి రిపోర్టింగ్ యుద్ధం చేస్తున్నారని అక్కడున్న మిగతా మీడియా వారందరూ వారిని కాసేపు ఆట పట్టించారు. సాక్షి టీ వీ సతీష్ తో పాటు మిగతా రిపోర్టర్లు అంతంత సేపు ఎండలో నిలుచుని రిపోర్టింగ్ చేస్తుంటే…ఫీల్డ్ జర్నలిస్టుల కష్టం పగవాడికి కూడా వద్దు అనిపించింది.

చల్లటి కొసమెరుపు:- బందరులో విహార్ ఎక్స్ ప్రెస్ ది ట్రయిన్ రెస్టారెంట్. మనం ఆర్డర్ఇచ్చిన ఆహార పదార్థాలు టేబుళ్ల పక్కన అమర్చిన రైల్వే ట్రాక్ మీద గిన్నెల్లో ఆటోమేటిగ్గా వస్తాయి. మచిలీపట్నం ఎమ్మెల్యే, నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు పేర్ని నాని ఆ హోటల్లో మీడియా వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. పెరుగన్నం తిన్నా. ఆప్రికాట్ డిలైట్ స్వీట్ తిని కిందికి దిగి కారు కోసం ఎండలో నిలుచున్నా.

ఈలోపు ఒక ముసలామె కాళ్లకు చెప్పుల్లేకుండా కాగుతున్న రోడ్డు మీద నడుస్తోంది. పేర్ని నాని నెమ్మదిగా వెళ్లి…ఆమె చేయి పట్టుకుని హోటల్ కిందే ఉన్న బాటా షో రూములోకి తీసుకెళ్లి… ఆమెకు చెప్పులు తొడిగించి…ఇంతటి ఎండలో ఎందుకు తిరుగుతావు తల్లీ? జాగ్రత్త అని పంపారు. ఒకతను సెల్ ఫోన్లో దీన్ని చిత్రీకరించాడు. అది మీడియాలో వార్తగా కూడా వచ్చింది.

పొద్దుటి నుండి భగభగమంటూ నిప్పులు చిమ్మిన ఎండల్లో తిరిగిన వేడి…ఆమెకు తొడిగిన చెప్పుల దృశ్యంతో మాయమై...చల్లబడింది. బందరు హల్వా చప్పరిస్తూ, బందరు తొక్కుడు లడ్డు తింటూ విజయవాడ చేరుకున్నాను.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions