.
నాదం నీ దీవెనే… – మహమ్మద్ ఖదీర్ బాబు… (ఏప్రిల్ 23న జానకమ్మకు 88)… కావలిలో మొదటిరోజు మార్నింగ్ షో చూసి బయటికొచ్చినోడు నోరావలిస్తూ ‘స్టోరీ పిచ్చరు’ అన్నాడంటే ఆ సినిమా పోయినట్టు లెక్క. అదేంటి… సినిమాల్లో స్టోరీ ఉండదా? ఉంటుంది. కాని ఉత్త స్టోరీయే ఉంటే ఆ సినిమాలు పోతాయి.
‘అరె ఏమైందీ… ఒక మనసుకు రెక్కలొచ్చి’… సినిమా రాక ముందే ఈ పాట కావలి షాపుల్లో స్లీపింగ్ టేప్ రికార్డర్లలో మార్మోగిపోయింది. జానకి గొంతు. అప్పటికి ఇళయరాజా చిన్న ఊళ్లకు కూడా బాగా పూని ఉన్నాడు. ‘టేస్ట్’ ఉన్న కుర్రాళ్ల మ్యూజిక్ డైరెక్టర్ అతను. భారతీరాజా చిరంజీవి కాంబినేషన్ అట…
Ads
‘తీగనై మల్లెలు పూచిన వేళ’… బాలూతో జానకి హృద్యంగా పాడుతోంది. కాని సినిమా రిలీజయ్యాక ‘స్టోరీ పిచ్చరు’.
కావలి ఎంబ్రాయిడరీ షాపుల్లో, సెలూన్లలో ఎప్పుడొస్తుందో తెలియకపోయినా ఒక సినిమా పాటలన్నీ చాలా రోజులు వినిపించాయి. ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’… ‘మంచు కురిసే వేళలో’… ‘రంగులలో కలవో’… జానకి దళసరి గళం… సొగసరి జాలం… ఆ తర్వాత ఎప్పుడో చాలా ఏళ్లకు ఆ సినిమా వచ్చి హిట్ అయ్యింది.
అరవ డబ్బింగులైనా కొన్ని టక్కున అంటుకునేవి. ‘వసంత కోకిల’ రిలీజైతే మానస హాలుకు జనం క్యూ కట్టారు. శ్రీదేవిని, కమల హాసన్‌ను చూసినోళ్లు చూసుకున్నారు. సిల్క్ స్మిత కోసమే వెళ్లినోళ్లూ వెళ్లారు. కోరిక కళ్లకు కోరికున్న గొంతు కావాలి. నిండు సభలో మెండు దుస్తులతో ప్రదర్శించేదీ కళే. ఏకాంతమున ఉల్లిపొరల చాటున స్వేచ్ఛా వాంఛా విసర్గ హ్..హ్..హా కళే. పొదుపు కొద్దీ పాడేవాళ్లు అవతలకు జరిగి జానకి ముందుకు రావాలి. ‘ఊరించే వయసిది… లాలించే మనసిది’…
‘మాటే మంత్రమూ’… విన్నప్పుడల్లా జానకి ఎందుకు పాళ్లేదా అనుకుంటూ ఉంటాను. తగువు. ఇళయరాజాకూ జానకికీ తగువు. తన పాటలు మాత్రమే పాడటానికి జానకి ఎక్కువ టైమ్ ఇవ్వాలని ఇళయరాజా కోరిక. ఆమె గొంతేమో అందరికీ కావాలి. ఆమె రాలేనప్పుడల్లా అలిగి కొన్నాళ్లు దూరమయ్యి మళ్లీ బతిమిలాడుకుంటూ సంధికి వచ్చి… ఆమె తిప్పించి తిప్పించి తిరిగి కరుణిస్తే ‘ఏవేవో… కలలు కన్నాను… మదిలో’…
జానకితో కలిసి ఇళయరాజా తెలుగు సంగీతాభిమానులను వశపరుచుకుంటే ఈ మొగలి సంపంగి నషా గుబాళింపు గుచ్ఛంలోకి తూ.గో. మరువం దవనాలతో ఊడిపడ్డాడు వంశీ. ‘అరు.. అలు.. ఇణి’… అంటే ఏమిట్రా అని మొన్నొకరోజు మెసేజ్ చేశాడు అనంత్. అంటే ఏమిటి సార్ అని వంశీ గారికి మెసేజ్ చేశాను నేను. వంశీ సినిమాల్లో జానకీ గొంతు… ‘ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ…’…
- ఇళయరాజా కచ్చేరీలో చెప్పాడు– ‘వెన్నల్లో గోదారి అందం’… తనకు అంటే రాజాకు కావలసిన పిచ్‌లో పాడటానికి జానకి పంతం పట్టి 14 టేకులు తీసుకుందట. అంతకు ముందు రెండు గంటల పాటు ఆమె ఆ పాటను సాధన చేసింది. తర్వాత 14 సార్లు పాడింది. ‘గొప్పగా పాడటం ఎలాగూ ఉండేదే. ఏకకాలంలో అన్ని గంటలు ఆ స్థాయిలో పాడే శక్తి ఎక్కడిదా!’ అని చకితుడయ్యాడా వేయి తపస్సుల రుషి.
‘పాప పేరు మల్లీ… నా ఊరు కొత్త ఢిల్లీ’… రేడియోలో వస్తే మా అమ్మ ‘ఈ పాట ఎస్.జానకి పాడిందంట్రా… గొంతు మార్చి’ అన్నది. ఎలా తెలుసో. ప్రయోగాలు… ఆగని ప్రయత్నాలు చేసే కళాకారులు అట్టడుగు జనానికి చేరుతారు. ‘అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా’… ముసలవ్వలా పాడితే మా అమ్మ వింది. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పసిగొంతులో పాడటమూ వింది. కనిపెట్టింది.
అందుకే ఎస్.జానకిని ఎవరూ జానకి అనలేరు. ఎస్.జానకి అనే అనాలి. ఎస్.జానకి వలే ఈ జగాన మరో జానకి లేదు.
బాలూ సులభంగా పాడతాడు. జానకితో డ్యూయెట్స్ పాడుతుంటే జానకి ఇంకెంత సులభంగా పాడగలదో తెలుస్తుంది. ‘దగ్గర చేరి దస్కతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో’… ‘తొలి జన్మల నోముకీ దొర నవ్వుల స్వామికీ చెలిమై నేనుండిపోనా… చల్లగా’… ‘సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా… రాముడి సిత్తంలో కాముడు సింతలు రేపంగా’…. చిన్నప్పుడు ఒక పాట రేడియోలో ఎప్పుడు వచ్చినా ఆగిపోయే వాణ్ణి. అందులో జానకీ తన నువ్వును పాటగా పాటను నవ్వుగా చేసింది. ‘వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా… నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా… తొలి నవ్వుగా’…
హిందీలో లతా చేసిన కృషి తెలుగులో సుశీలమ్మది. హిందీలో ఆశా చేసిన విన్యాసం తెలుగులో జానకమ్మది. పోలిక కాదు. రెండు సమ, సమాంతర నక్షత్ర తోవలు. పోల్చాలంటే ఎస్.జానకి మీసాలు లేని కిశోర్ కుమార్.
‘తెరచాటొసగిన చెలులు శిలలకు… దీవెన జల్లులు చల్లిన అలలకూ’…
ఈ ఇష్టమైన పాటను అటుంచండి. ‘రాశాను ప్రేమలేఖలెన్నో’…లో జానకి చిన్న హమ్ చేస్తుంది రెండో చరణానికి ముందు. దాంతో బతకొచ్చు.
జానకమ్మకు 88 వచ్చాయి. ఏ పుణ్యానో తెలుగువారు ఈ గానఛాయ కిందకు వచ్చారు.
తెలుగు వారి నదులకు జత పడిన దివ్య గాననది ఎస్.జానకి.
మా నెల్లూరు కోడలు అనీ… ఆమె పుట్టిన నెలా రాశీ నాదీ అనీ.
‘భావనలొకటై సాగిపోయే వేళలో’…
– ఏప్రిల్ 22, 2026
Share this Article