.
మొన్నటి వార్తే… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వచ్చింది… ఏమిటంటే..? ‘‘తిరుమల వెంకన్నకు నిద్ర లేదు… ఇలా ఏకాంతసేవతో పరుండజేసి, నిమిషాల్లో నిద్రలేపి, దర్శనాలకు, ఆర్జితసేవలకు తయారు చేసేస్తున్నారు…’’ ఇదీ వార్త సారాంశం… నిజంగానే వెంకన్నపై అపరిమిత భక్తివిశ్వాసాలు ఉన్నవాళ్లను చివుక్కుమనిపించే వార్తే…
తను విశ్వపాలకుడు, ఐతేనేం, స్థానపాలకుల చేతిలో బందీ అయిపోయాడు… దేవుడికి సరైన నిద్ర ఉండటం లేదనే విమర్శలు ఇప్పటివి కావు… కానీ మరీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది… ఒక్కోసారి రాత్రి 2.50 దాకా ఏకాంతసేవలు జరిపించి, 7 నిమిషాల వ్యవధిలో తిరిగి తలుపులు తెరిచి, ఉదయపు సేవలు ప్రారంభిస్తున్నారనేది వార్త సారాంశం…
Ads
(అయ్యా, రాధాకృష్ణా… తిరుమల వెంకన్న కేవలం ఆంధ్రప్రదేశ్ దేవుడు మాత్రమే కాదు… తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన భక్తులున్నారు… ఏదో భౌగోళికంగా ఏపీలో ఉన్నంత మాత్రాన మరీ ఆ ప్రాంతాకే పరిమితం చేసేయకండి దేవుడిని… ఆయన వార్తలను…)
కొత్త చైర్మన్ రాగానే… ప్రక్షాళన చేస్తాన్, ఎఐ సాయంతో అందరికీ సత్వర దర్శనం చేయించేస్తాన్ అని ఏవేవో చెప్పాడు కదా… మరి ఇదెందుకు కనిపించలేదు… సనాతన ధర్మ వీర పరిరక్షణవాదికి ఈ వార్తలు ఎందుకు కనిపించలేదు… బీజేపీకి ఎందుకు పట్టలేదు… సరే, చంద్రబాబుకు ఇలాంటివి పెద్దగా పట్టవు గానీ… నిజంగా దేవుడిని నిద్రపోనివ్వరా..?
నవ్వొచ్చే విషయం ఏమిటంటే… రోజా ఈ వార్తను జతచేసి ఎక్స్ ఖాతాలో ఓ విమర్శను పోస్ట్ చేసింది… ‘‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది!
సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. జగనన్న పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేది. కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60 వేలకు పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు…
దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? ఇదేనా చంద్రబాబు గారి నమూనా ప్రక్షాళన? భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు’’….. అని రాసుకొచ్చింది…
విమర్శ పాయింట్ నిజమే గానీ… జగనన్న పాలనలో లక్ష మంది దర్శించుకునేవారా..? ఇప్పుడే బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారా..? అదీ రోజా చెప్పడమా..? మందలకుమందలుగా జనాన్ని కొండకు తీసుకెళ్తూ.., క్యూలను ఆపేసి, సగటు భక్తులను ఇక్కట్ల పాలు చేసిన రోజా ఈ విమర్శ చేయడమా…?
సరే, బ్రేక్ దర్శనాలల్లో ఎవరూ తక్కువ కాదు గానీ… స్వామికి కునుకు కూడా లేకుండా దర్శనాల్ని చేయిస్తే మరి జగనన్న బాపతు లక్ష దర్శనాల సంఖ్య పెరగాలి గానీ 60 వేలకు ఎలా పడిపోయిందమ్మా..?! హేమిటో… బీఆర్‌నాయుడు ఇంకా స్పందించినట్టు లేడు… పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నట్టున్నాడు..!!
తెల్లవారవచ్చె తెలియక నాస్వామి మళ్లీ పరుండేవు లేరా అనేది పులకింపజేసే ఓ భక్తిపాట… 1956లో చిరంజీవులు సినిమా కోసం మల్లారి రామకృష్ణశాస్త్రి రాసింది… ఇప్పుడది తిరుమల కొండ మీద పనికిరాదేమో… అసలు పడుకోనిస్తే కదా నిద్ర లేపడానికి..?! అంతర్యామి అలసితి సొలసితి అని అన్నమయ్య వాపోయాడు… ఇప్పుడు కునుకు కూడా లేక నిరంతరమూ భక్తులను కరుణిస్తూ, ఆశీస్సులిస్తూ ఆ దేవుడే అలసితి సొలసితి అని పాడుకునేట్టు చేస్తున్నారు ఆస్థానపాలకులు..!!
Share this Article