ఇప్పటికీ బాగా గుర్తుంది… ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ మొదలైన రోజులవి… నెల్లూరు నుంచి వాగ్దేవి అనే అమ్మాయి (ఆర్కిటెక్ట్ స్టూడెంట్) ఆడిషన్స్ థియేటర్ రౌండ్‌లో ‘అలై పొంగెరా’ అనే పాట ఎత్తుకుంది… ఆ వాయిస్ టెక్స్‌చర్, పాడే తీరుతో అంతటి థమన్ కూడా ముగ్గుడైపోయి, ఆ పరవశంతో పాడుతున్న ఆమె పక్కన నిలబడి మురిసిపోయాడు…
ఆ ఇంపాక్ట్ ఆమె విజేతగా ప్రకటితమయ్యేదాకా ఉండింది… ఏ వాయిద్యసహకారమూ లేకుండానే ఆర్గానిక్‌గా భలే పాడింది ఆమె… అది విన్నాక ఓ ఉన్నతాధికారి స్పందించి, ఆ పాట గురించి తన ఫీలింగును రాసి ‘ముచ్చట’లో ఖచ్చితంగా పబ్లిష్ కావాలనే కోరికతో ఓ మిత్రుడి ద్వారా పంపించారు… లింక్ ఇదుగో…
ఆహా… ఊత్తుక్కాడు వెంకట కవి – ఊపిరులూదే వేటూరి కవి… స్వరసౌభాగ్యం…
Ads
ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… సరైన స్వరమాధుర్యం అలా శ్రోతకు కనెక్ట్ కావాలి… నిజమైన స్వరస హృదయం అలా స్పందించాలి… తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫస్ట్ సీజన్ అలా బాగా కనెక్టయింది… కానీ అది క్రమేపీ స్వరాగాలాపన నుంచి జస్ట్, ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ షోగా మారిపోయి, మరీ ఇప్పుడైతే చికాకు పుట్టిస్తోంది… చెప్పడానికి ఏమాత్రం సందేహించడం లేదు…
కంటెస్టెంట్ల ప్రతిభ బాగుంటుంది… మెరికల్నే ఎంపిక చేస్తున్నారు, చివరకు కోరస్ కూడా మనసుపెట్టి పాడుతున్నారు… ఎటొచ్చీ పాటల సెలక్షనే అడ్డదిడ్డం… నిజమైన పాటగాడిని లేదా పాటగత్తెను బయటికి తీసుకురావాలంటే అన్నీ ‘అలై పొంగెరా’ పాటలే కానక్కర్లేదు… వైవిధ్యమున్న తెలుగు పాటలు బోలెడు… అవి కదా ఓ సింగర్‌లోని అసలైన ప్రతిభను బయటికి తీసేవి… థమన్ మ్యూజిక్ డైరెక్టర్, కార్తీక్ కూడా అంతే, గీతామాధురి సింగర్ కమ్ ఓ మ్యూజిక్ ట్రూప్ రన్ చేస్తోంది… మరెందుకు ఆలోచించడం లేదు ఈ కోణంలో…
ఒక చిత్ర, ఒక కోటి, ఒక డీఎస్పీ, ఒక రామజోగయ్య శాస్త్రి వంటి వాళ్లు వచ్చారంటే వాళ్లకు సినిమా పాటలతో ప్రత్యక్ష బంధం ఉంది… మరి ఒక విజయ్ దేవరకొండ, ఒక రష్మిక మంథన వస్తే… ఆ షోకు జస్ట్, ఓ స్వరేతర ఆకర్షణ తప్ప మరేమున్నట్టు..? పైగా కాసేపు వాళ్ల భజన… ఇది సరిపోదని అప్పుడప్పుడూ సినిమా ప్రమోషన్లు కూడా… మరీ ఒక సుమ అడ్డా, ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ స్థాయికి తీసుకుపోవాలా ఈ షోను..?
ఓ మోస్తరు సినిమా బడ్జెట్ పెడుతున్నప్పుడు… ఎస్, ఎక్కువ వ్యూస్ అవసరమే కావచ్చుగాక… కానీ అసలు ఆ షోలోని స్పిరిట్ పోతుంది కదా… క్రమేపీ నిజమైన సంగీత ప్రియులు దూరమవుతారు… వ్యూసే కావాలంటే ఆహా ఓటీటీ కూడా ఏదో ఓ జయప్రద డ్రామా కంపెనీ అని షో స్టార్ట్ చేయవచ్చు కదా… ఈ స్వరప్రయాసలు దేనికి..?
మరీ డబ్బింగ్ పాటలు చికాకు పుట్టిస్తున్నాయి… సాహిత్యం అర్థరహితం, తెలుగీకరించాక చివరకు అదేం భాషో ఎవడికీ అర్థం కాదు… బాలు వెళ్లిపోయాక ఈటీవీ సంగీత కార్యక్రమాలు దెబ్బతిన్నాయి… జీతెలుగు, స్టార్‌మా సరిగమపలు, సూపర్‌సింగర్లు మరీ వినోదాత్మకాలయ్యాయి… చివరకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కూడా ఆ రేంజుకు చేరిపోతే… అది ట్రాజెడీ… మంచి ఆర్కెస్ట్రా దొరికింది… థమన్ కాస్త టేస్ట్ చూపించొచ్చు కదా… మరీ ఈ కుర్చీ మడతబెట్టే రేంజుకు తీసుకుపోతే ఎలా..?!
Share this Article