ఇంటి ముందుకొచ్చే మనుషులు – మహమ్మద్ ఖదీర్‌బాబు
రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు అడగాల్సిన పనీ లేకపోవచ్చు.
సవరాలు చేసిస్తాం అని మురికిగా ఉన్న ఆ ముగ్గురు ఆడవాళ్లు ఆశగా చూసేవారు. కాసింత సద్దన్నం పెడితే రేకుడబ్బాలో ఉన్న చెక్కదువ్వెనలిచ్చి నక్కలోళ్లు చక్కాపోయేవారు. తీరిగ్గా నడిచే ఒంటెద్దు బండి నుంచి ఉప్పు శేర్ల లెక్కన చేటల్లో ఒంపుకు రావాలి. ముగ్గు పిండి అమ్మే ముసలామెకు మొదటగా మంచినీళ్లు అందించాలి. కట్టెల మోపు అమ్మేవారికి చెమట ఆరేలోపు డబ్బులిస్తేనే పుణ్యం.
నెయ్యి అమ్మేవాళ్ల మోసం ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. తేనె అమ్మేవాళ్లు తియ్యగానే మట్టి నాకిస్తారు. ప్లాస్టిక్ వస్తువులకు అతుకులు వేస్తామని వచ్చిన మనిషి పచ్చటి బిందెకు ఎర్రటి పాచ్ వేసేవాడు. కుడితి కోసం వచ్చే ఆడమనిషి అంతపెద్ద కుండను చులాగ్గా నడుముకు ఎత్తుకునేది. బావిలో పడ్డ వస్తువులను తీస్తాననేవాడు పలుచగా, రివటగా, అప్పుడే నీటి నుండి తీసిన గవ్వలా మెరుస్తుండేవాడు.
సోది చెప్పే అమ్మి రేడియో లేని వెలితిని పోగొడుతూ చాలాసేపు రాగాలు తీసేది. కబళం మీద ఆశ లేని బుడబుక్కలవాడు చిల్లర డబ్బులు తీసుకుని బొంగురుగా ఆశీర్వదించేవాడు. ముస్లింల ఇంటి ముందు కూడా హరిదాసు కమ్మని కీర్తన ఆలపించేవాడు. హిందువుల గడపలు ఫకీరు దువాను ఆహ్వానించేవి. సంవత్సరానికి ఒకసారి పసుప్పచ్చ బట్టల్లో యామాలసామి గుర్రాన ఊరేగి ఇంటింటినీ కటాక్షించేవాడు.
సత్రం వంకాయలు అమ్మే ఆమె తక్కెడలో మోసం ఉండేది కాదు. ప్రతి తెల్లారి చేపల బుట్టలతో వచ్చే బెస్త ఆడవాళ్లకు కపటం తెలిసేది కాదు. రంగురంగుల కోడిపిల్లలు ఆరు తీసుకుంటే రెండే బతికేవి. ఉడుము నుంచి తీసిన తైలం మోకాళ్లకు మంచిదని ఎవరో తచ్చాడేవారు. గాజుల మలారం దించి చేయి పట్టుకున్నాక డజనుకు రెండు కొసరుగా ఇవ్వాలి. చీరల మూట ఆసామి సులభ ఇ.ఎమ్.ఐలు కనిపెట్టేవాడు.
చెవిలో గుబిలి తీసేవాడితో మగాళ్లకు బేరం తెగేది కాదు. కక్కు కొడతాం అని వచ్చేవాళ్లు ఎండన కూచుని నున్నబడ్డ పొత్రాల ఒళ్లు హూనం చేసేవారు. సిరిచాపలు అమ్మేవారు కాసింత నడుము వాల్చే తీరిక లేక అదే పనిగా తిరుగుతుండేవారు. పాముబుట్టతో వచ్చినవాడు పైసలిస్తే తప్ప పడగను తట్టేవాడు కాదు. ఎలుగుబంటి స్వయంగా వచ్చి ఇచ్చే తావీదును భయం భయంగా కొనాల్సి వచ్చేది. కోతిని తెచ్చేవాడికి అంతగా మతింపు లేదు.
సోడాబండి వచ్చిందనే సంగతి సోడానే కయ్యిన కూసి దండోరా వేసేది. ఆకురాయి మీద సానపడుతున్న కత్తి చక్కున మెరిసేది. మల్లెల కన్నా ముందే వాటి పరిమళం వీధిలో ఆగి ఆగి ఒంటిని తాకేది. పీచుమిఠాయి గంట ఒన్ టూ త్రీగా మోగేది. చేతికి తీపి గడియారం చుట్టే మనిషి మొత్త చూసుకుని కూలబడ్డాడంటే మరి కదిలేవాడు కాదు. నల్ల ఈతకాయలు రుచా, పెద్ద ఈతకాయలు రుచా అంటే డబ్బును బట్టి ఉంటుంది.
ప్రతి విజయదశమికి కళుగోళ్లమ్మ తల్లి పల్లకీ ఎక్కి వచ్చేది. తొలి ఏకాదశికి విష్ణుమూర్తి రథమెక్కి వైభోగం తెచ్చేవాడు. శివరాత్రికి ఆదిదేవుడు తేరువుపై ఊరేగుతూ అభయమిచ్చేవాడు. మకరజ్యోతికి వెళ్లే స్వాములను సాగనంపుతూ ఆడపిల్లలంతా ప్రమిదలతో వెలుగు నింపేవారు. తప్పెట్ల మోతలో పీర్లు కవాతు చేసేవి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌కి బగించిన తెల్లని మినీ హారన్‌తో ఏసు పాటలు పాడుతూ క్రైస్తవ బృందాలు వచ్చేవి.
అమ్మ తరపు వాళ్లు వచ్చేవారు. అయ్య తరపు వాళ్లు వచ్చేవారు. అలిగిపోయిన వారు వచ్చేవారు. వచ్చి అలిగిపోయేవారు. తలుపు మూసిపెట్టడం చాలా అమర్యాదగా ఉండేది. మనుషులు వచ్చి పోయే ఇల్లంటే గౌరవం ఇనుమడించేది.
ఇప్పుడు కొన్నే ఉన్నాయి. చాలా పోయాయి. కొన్నే గుర్తున్నాయి. చాలా కనుమరుగైపోయాయి.
అపార్ట్‌మెంట్‌లూ, గేటెడ్ కమ్యూనిటీల వల్ల ఇంటిలో ఉండేవాళ్లు మాత్రమే ఇంట్లోకి బయటకూ తిరుగుతున్నాం.
పరాయి స్పర్శే ఎరగని, అయినవారు కూడా అడుగుపెట్టని వాకిళ్లలో నివసించుటే గదా నేటి నాగరికత…- April, 2024
Share this Article