.
( హరగోపాల రాజు వునికిలి) …. ముంబై తన ప్రాభవాన్ని కోల్పోతోందా..?
ముంబై ….దేశ ఆర్ధిక రాజధాని.. మరాఠా సంస్కృతికి మచ్చుతునక.. పార్సీ సంప్రదాయానికి ప్రతీక .. కానీ గత కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతుందా అని అన్పిస్తోంది.. నాటి బొంబాయికి నేటి ముంబైకి కొన్నిస్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.
Ads
ముంబైకి లైఫ్ లైన్ అనదగ్గది లోకల్ రైళ్ళు.. కచ్చితమైన సమయానికి పేరు. కోట్లాదిమంది ప్రయాణికులకు అత్యంత చవకైన ప్రయాణ సాధనం.
ఇప్పుడిప్పుడే మెట్రో రైళ్ళు వాటిపై ఒత్తిడి తగ్గిస్తున్నాయి. ఈ లోకల్ రైళ్లలో ఎన్నో జీవితాలు, సినిమాలను మించిన కధలు, లక్షలమంది చిరు వ్యాపారులకు తొలి మెట్టు. సమోసాల అమ్మకంతో రూ. లక్షలు గడించిన వారి కధలు విన్నాం.
డబ్బావాలాలు.. క్రమశిక్షణ, నమయ పాలన, అంతకుమించి విశ్వనీయతకు మారుపేరు. అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్ళలో పాఠంగా ఎక్కిన చరిత్ర. మారిన కాలంలో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో డెలివరీ ఇచ్చే సంస్థలు ఎన్నివచ్చినా 125 ఏళ్ల డబ్బావాలాలకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. (5 వేల మంది డబ్బావాలాలు 2 లక్షల మందికి నిత్యం వేళకు వేడి వేడి భోజనం అందిస్తున్నారు. వాళ్ళ ఛార్జీలు కూడా రూ.300- 1000 మధ్య).
ముంబై మెరైన్ డ్రైవ్ మహానగరానికి కంఠహారం లాంటిది ఈ పొడవైన సముద్రతీరం.. దీన్ని చూసే హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఇవతలి రోడ్డుకు నెక్లెస్ రోడ్డు అని పెరు పెట్టారేమో అనిపిస్తుంది. మెరైన డ్రైవ్ సొగసు ఇంకుముందులా లేదనిపిస్తుంది..
ఎందుకంటే వర్లి సీ లింకు బ్రిడ్జ్ ఈ అందాన్ని సగం కొట్టేసింది.. దీనికి అనుసంధానంగా సముద్రంలో నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ తీరం వెంబడే ఎన్నో. చెట్టపట్టాలు, నడకలు, పరుగులు, చర్చలు, వాదోపవాదాలు, షూటింగులు, డేటింగులు.. చౌపట్టి బీచ్లో గణేశ నిమజ్జనాలు.. బాంద్రా ఒడ్డున బాతాఖానీలు.
గేట్ వే ఆఫ్ ఇండియా తన రాజసాన్ని ఒలకబోస్తూ అరేబియా సముద్రంలోకి స్వాగతిస్తుంది. దాని పూర్వ వైభవ పరిరక్షణకు ఇప్పుడు మరమ్మతులు, పై పూతలు పూస్తున్నారు. ఇక్కడ కనీసం ఒక వందమంది ఫోటోగ్రాఫర్లు యూనిఫారాల్లో ఉంటారు. అందర్నీ అన్ని భాషల్లో పలకరిస్తూ ఫోటోలు తీస్తామంటారు.
తీవ్రవాద దాడులను తట్టుకుని టాటాల వ్యాపార సామ్రాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తాజ్ హోటల్ ని, సముద్రాన్ని మిమ్మల్ని ఒకే ఫ్రేమ్ లో బంధిస్తామని ఊరిస్తారు. ఒక్క ఫోటోకి రూ. 50 మాత్రమేనని, అయిదు నిమిషాల్లో కాపీ మీ చేతిలో పెడతారు.
మీరు వద్దు మా చైనా ఫోన్ లో తియ్యమన్నా నవ్వుతూ ఫోటో తీస్తారు. ఇక్కడ్నుంచి ఎలిఫెంటా గుహలకు బోటులో వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి రూ. 400 ఛార్జీ. సోమవారం గుహల సందర్శనకు సెలవు. వెళ్ళి రావాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది.
సిద్ధి వినాయక మందిరం : నగర నడిబొడ్డున కొలువైన గణాధిపతిని చూడకుండా వెళ్లాలంటే మనసు ఒప్పదు. సెలవు రోజులు మినహా సాధారణ రోజుల్లో దర్శనం తేలిగ్గా అవుతుంది. రూ. వంద, రూ. 300, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఉన్నాయి. ఇటీవల పెద్ద సమస్యగా మారిన పాదరక్షలకు ఏర్పాట్లు ఉన్నాయి.. అన్ని ఉచితమే.
ముంబాదేవి మందిరం : సముద్ర తీరానికి దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం తొందరగా చేసుకోవచ్చు. అందుకనే ముంబైగా మార్చారు.
మహాలక్ష్మి మందిరం : మహాలక్ష్మిగా, చదువుల తల్లిగా, శక్తి స్వరూపిణిగా మూడు రూపాలలో అమ్మవారు దర్శనమిచ్చే పురాతన ఆలయం. ఇక్కడికి దగ్గర్లోనే హాజీ ఆలీ దర్గా ఉంటుంది (సముద్రం మధ్యలో).
ఇక ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, స్టాక్ ఎక్స్ఛేంజి భవనం, వాంఖడే స్టేడియం, భిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేలు కలయిక ఈ మహా నగరం.
ఎనిమిది రోడ్ల కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయినా వాహనాలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో నిలుస్తాయి. హారన్ల మోత, ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు ఉండవు.
బస్టాపుల్లోనే కండక్టర్లు టిక్కెట్లు ఇస్తారు. ప్రయాణికులు వరసలో నిలుచుని తమ వంతు వచ్చాకే బస్సు ఎక్కుతారు. తొక్కుకోవడాలు, తోసుకోవడాలు, బస్సుని పట్టుకుని వెళ్ళాడాలు ఉండవు.
కాలీ- పీలి (నలుపు- పసుపు) టాక్సీలు, ఆటోలు మీటరు ఛార్జీనే వసూలు చేస్తాయి. గత మూడేళ్లుగా ముంబై మహా నగర పాలికకు పాలకవర్గం లేకపోవడంతో కమిషనర్ పాలనలో నడుస్తోంది. అందువల్లనేమో ఫుట్ పాత్ లన్నీ పాదచారులకే. ఒక్క దుకాణం కూడా కనిపించదు.
చవాన్లు, పాటిల్, బాలా సాహెబ్ ల పాలనా కాలం పోయింది. శిందేలు, బిందేల రాజ్యం వచ్చిందని, మీ ముంబైకర్ నినాదం కాలగతిలో కలిసిపోయిందన్న 35 ఏళ్లుగా టాక్సీ నడుపుతున్న రషీద్ భాయి ఆవేదనలో అర్ధం ఉందనిపించింది. బాల్ థాకరే సభలకు తాను క్రమం తప్పకుండా వెళ్ళేవాడినని.. ఆయన ఎప్పుడూ మానవత్వం గురించే మాట్లాడేవారని చెప్పారు.
రాష్ట్రాన్ని, నగరాన్ని ఏకతాటి మీద నడిపించగల నాయకత్వమే అసలు సమస్య అని ఆటో, టాక్సీ వాలాలు చెబుతున్నారు.
ముంబై మహా నగరానికి వలసల తాకిడి అపరిమితంగా పెరిగింది. ముఖ్యంగా బంగ్లా నుంచి వేలాదిగా వస్తున్నవారు ఎక్కువ గంటలు, తక్కువ వేతనాలకు పని చేయడం తమకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్న స్థానికుల రోదన అరేబియా సముద్ర ఘోషలో కలిసిపోతోంది. ( సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసింది బంగ్లా దేశీయుడే).
స్వాతంత్ర పోరాటంలో భాగంగా తిలక్ మహాశయుడు ప్రారంభించిన గణపతి బప్పా మోరియా ఉత్సవాలు, కృష్ణాష్టమి వేళ ఉట్టి కొట్టే పండుగలు మాత్రమే అక్కడ కొంత విశేషంగా కనిపిస్తాయి.
అండర్ వరల్డ్ నేరాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, రాజకీయ విద్వేష, కాం ట్రాక్టు, సుపారి హత్యలు పెరిగాయి. ఒకప్పుడు ముంబై అంటే ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ఇప్పుడు హై దారాబాద్, బెంగళూరుల్లో వాటిని తలదన్నేవి వచ్చాయి…..
Share this Article