కొన్నేళ్లు దాటాక… ఎన్ని కోట్లు సంపాదించాం, ఏయే హోదాలు వెలగబెట్టామనే కాదు… కాస్త ఆత్మతృప్తిని, కాస్త పుణ్యాన్ని సంపాదించి పెట్టే ఏదైనా చిన్న పనిని, ఛారిటీని చేశామా..? ఒక్కసారి వెనక్కి తిరిగి అవలోకిస్తే ఏమైనా కనిపిస్తున్నాయా..? అసలు మనలో పరులకు సాయపడే గుణం ఉందా..? అప్పుడప్పుడూ ఆ మథనం కోసం ఇలాంటి పోస్టులు చదవాలి… ఇది మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమే… ఈ స్టోరీలో కనిపించే ఉదాహరణ చాలా చిన్నది కావచ్చు… కానీ కనీసం ఆ చిన్న పనినైనా మనం ఎప్పుడైనా చేశామా..? ఒక్కసారి స్వీయపరీక్ష చేసుకుందాం… Gampa Harish… వాల్ మీద కనిపించిన ఓ పోస్టు… యథాతథంగా… (దానగుణమున్న మంచివాళ్లు బోలెడు మంది లోకంలో, అందరికీ మనసారా నమస్కరిస్తూ…)
నేను నా స్వంత పనిమీద ఊరేళ్తుంటే నిర్మల్ దాటాక హైవే మీద 80/90 స్పీడ్ లో కార్ నడుపుతున్నపుడు రోడ్డు పక్కన బారికేడ్ నీడలో ఒక దృశ్యం కనపడింది… ఒక తల్లి, మరో ఇద్దరు 5/6 yrs గల పిల్లలతో పాటు ఇంకో తల్లి ఒడిలో పసిగుడ్డు… ఆ లిప్తపాటు సమయంలోనే వారెందుకు ఎక్కడున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది…
వెంటనే వెనక్కు రాలేని హైవే పైన కొంచెం దూరం ముందుకెళ్ళి, U టర్న్ తీస్కుని, తన చెంత చేరి ఏం అయిందమ్మా ఇక్కడున్నావ్ అని అడిగాను… అప్పుడు సమయం మధ్యాహ్నం 11 అవుతుంది… అప్పుడు ఆమె చెప్పిన జవాబు మనసును కరిగించేసింది… ఎండలో పిల్లలకు కనీసం చెప్పులు కూడా లేవు… తన పేరు లచ్చిమి అని, 20 రోజుల పసికందుని ఒడిలో పెట్టుకుని, తనకున్న ఆస్తి ఈ 2 మూటలేనని, తన భర్త కొట్టి తన పుట్టింటికి కామారెడ్డికి వెళ్లిపొమ్మన్నాడని చెప్పింది… అయితే చేతిలో చిల్లిగవ్వ లేక నడుస్తూ బయలుదేరారట.. ఆ భానుడికి కూడా లచ్చిమి అంటే కోపమో ఏమో ఇంత బాధపెడ్తున్నాడనిపించింది…
Ads
మరి నా కార్ లో వస్తారా అని అడిగాను, ఆర్మూర్ వరకు దింపుతా అన్నాను…. సరే అని ఎక్కారు… ఎండ ఎక్కువే ఉండటంతో కార్ లో ఎక్కగానే ac చల్లదనాన్ని కొంచెం ముందుముందుకు వస్తూ అస్వాదిస్తున్నది లచ్చిమి కూతురు… పేరేంటే అని అడిగాను నవ్వుతూ, పొట్టి అంటూ సమాధానమిచ్చింది… మరెందుకే ముందు ముందుకు వస్తున్నావ్ అంటే ముందుకు వస్తే చల్లగా ఉంది అనే సమాధానం నన్ను ఒక ఉద్వేగానికి గురి చేసింది…. మనమెంత సుఖంగా ఉంటున్నామో కదా అని.అనిపించింది… తరువాత పొట్టితో కొద్దిసేపు ముచ్చటించాను… మాటల్లో వాళ్ళ నాన్న రోజు తాగి వచ్చి అమ్మను కొడతాడు అంటూ… రోజూ గొడవ చేస్తాడని చెప్పింది, ఏమ్ చేస్తాడనే మాటకు సంచులు కుడుతాడు అంటూ చెప్పుకొచ్చింది…. మాటల్లో ఆర్మూర్ వరకొచ్చాము.
ఆర్మూర్ ఎంట్రెన్స్ లో రోడ్డు పక్కన ఒక టేబుల్ మీద భోజనం తయారు అనే బోర్డు చూసి కారు ఆపాను …. ఆకలవుతుందా? అనే నా ప్రశ్న అనవసరంగా అడిగాను, వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థం అవుతోంది, ఎపుడు తిన్నారో ఏమో అనిపించింది… చికెన్ తింటారా అని అడిగాను… పిల్లాడి మాటల్లో ఆసక్తి చూస్తే వాని కడుపు నిండితే మన కడుపు నిండినట్లే అనిపించింది…. ముగ్గురికి భోజనం పెట్టించింది ఆ భోజన విక్రయదారు….
మాటల సందర్బంగా వీళ్ళ టాపిక్ చెప్తుంటే తను స్పందించిన తీరు చూస్తే ఈ లోకంలో ఇంకా మంచితనం ఉందనిపించింది… ఆ 20 రోజుల పసికందుని చూసి, తన కొడుకు కోసo ఉంచుకున్న చొక్కా, చెడ్డి తీసి ఇచ్చి, వీళ్ళను ఒక గుడిలో దింపండి, నేను నా వ్యాపారం అయిన తరువాత వెళ్ళి ఆమెను ఒక అనాధ ఆశ్రమంలో చేరుస్తాను, అవసరం అయితే ఇవాళ మా ఇంట్లో ఉంచుకుని, రేపు ఆశ్రమంలో చేర్చుతాను అని చెప్పుకొచ్చింది…
మనసులోనే చేతులెత్తి నమస్కరించాను….. కడుపు నిండా అన్నం తిన్నారు లచ్చిమి ఇద్దరు పిల్లలు… మరి చిన్నబాబు 20 రోజుల సంగతేంటి అని ఆరా తీస్తే, తల్లి సరిగా తినలేక పాలు లేవట, ఈ మాట వినగానే కళ్లెంట నీరు ఆగలేదు నాకు…. పాల డబ్బా ఉందంటూ నాకు తన ముల్లె తీసి చూపించింది లచ్చిమి… సరే అని మరో మారు కడుపు నింపే ప్రయత్నంగా భోజనం పార్సెల్ కట్టించి లక్ష్మి చేతికిచ్చాను….
వాటర్ బాటిల్ ఇచ్చాను.,.. తరువాత గుడి వైపుగా కారును మళించే నా ప్రయత్నాన్ని అడ్డుకుంది లక్ష్మి… ఎందుకనే సందేహానికి వాళ్ళ చుట్టాలు అక్కడ ఉంటారు, చూసి భర్తకు చెప్తే, మళ్ళీ వచ్చి కొడతాడు అనే మాటలో సమాధానం నాకు దొరికింది…. మామిడిపల్లి చౌరస్తాలో దింపమని కోరింది….
పిల్లలకు దగ్గర ఉన్న బేకరీలో చాక్లేట్స్ బిస్కట్స్ కొనిచ్చి, అక్కడే ఉన్న జ్యూస్ బండి చూసిన పిల్లలకు జ్యూస్ తాగించాను…. తరువాత 20 రోజుల పసిగుడ్డుకు ఓ పాల డబ్బా కొనిచ్చి, కొంత ఆర్థిక సహాయం చేసి నా దారెంట పయనమయ్యాను… మనసులో లక్ష్మికి పిల్లలకు ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకున్నాను… మనం రోజూ ఎన్నో వ్యర్థం అయిన ఖర్చులు చేస్తుంటాం, దాంట్లో కొంత ఆదా చేసయినా ఇలాంటి పనులు చేస్తే ఎంత సంతృప్తో కదా అనుకున్నాను…
Share this Article