Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దొంగమొగుడే… తనకు జీవితంలో ప్రతీ సెకనూ అర్ధవంతంగా ఉండాలి…

June 5, 2024 by M S R

Veerendranath Yandamoori…… అతని కంపెనీ చీరల్ని కట్టనిది అతని భార్య ఒక్కతే. ఆవిడ పేరు మాధవి. ఆమెదో చిత్రమైన మనస్తత్వం. ఒకరోజామె ఏదో ఫంక్షన్ కి నిండుగా అలంకరించుకుని వెళ్ళింది. ఫంక్షన్ కి వచ్చిన ఒకావిడ “నీకీ చీర నప్పలేదమ్మా” అని మాధవి మొహం మీదే అనేసింది. పక్కనున్న మరొకావిడ ఆ మాట అందుకుని, “అమె కేమిటమ్మా… మొగుడు చీరల కంపెనీ ప్రొప్రైటరు. చీరలు ఫ్రీగా వస్తాయి-” అంది. ‘ఫ్రీగా వచ్చిన చీరలు అంతకన్నా ఏం బావుంటాయిలే…’ అన్న ఉద్దేశ్యం ధ్వనించేట్టు.

అంతే! ఆ రోజునుంచీ మాధవి, రవితేజ టెక్స్‌టైల్స్ చీరలు కట్టటం మానేసింది. రవికి మొదట్లో అర్థం కాలేదు. దేశమంతా అంత క్రేజ్ తో ఉంటే, ఇంట్లో భార్యకి తమ చీరలు నచ్చకపోవటం…

“మీ చీరలు నాకు నప్పవు” అందామె ఒక్కమాటగా. అతడికి షాక్ తగిలినట్టయింది.

Ads

న… ప్ప…వు!

ఒక కొత్త రకం డిజైను మార్కెట్లోకి వచ్చి ఫెయిల్ అయిందంటే నష్టం లక్షల్లో ఉ౦టు౦ది. అందువల్ల అతడి కంపెనీలో నిరంతర శోధన జరుగుతూనే ఉ౦టు౦ది. రిసెర్చి డిపార్ట్‌మెంట్ ఖర్చే సంవత్సరానికి పాతిక లక్షలుంటుంది. అతని ఆఫీసు నుంచి కొందరు అజంతా, ఎల్లోరాలకి వెళ్ళి ఆ శిల్పాల డిజైన్లు కూడా చూస్తూ ఉంటారు.

చీరెలకీ సినిమాలకీ దగ్గర సంబంధం ఉంది. ఆ డిపార్ట్‌మెంట్ లో కొందరి పని ఎప్పుడూ కొత్త సినిమాలు చూడటమే. చూసి… శ్రీదేవి చీరలు, హేమమాలిని చీరల్లాటి కొత్త ‘ఫాషన్లు’ కనిపెట్టటమే.

ఎక్కువ ప్రత్యేకత లేకుండానే ఛాందినీ చీరలు పాపులర్ అవటానికి కారణం ఒక తెలుగు సినిమా ‘ప్రేమనగర్’! ప్రేమనగర్లో వాణిశ్రీ కట్టుకున్న ఛాందినీ చీర ఆ తరువాత ఎంతో పాపులర్ అయింది. (ఛాందినీ చీరలు రాజస్థాన్ సంబంధించినవి. ఒక రాష్ట్రానికి సంబంధించిన చీరలు మరో గారాష్ట్రంలో కట్టటం సాధారణమే అయినా ఇంత ఎక్కువ పాపులర్ అవటం అరుదు. కేవలం బెంగాల్ కాటన్స్, కలకత్తా నేత చీరలు, బెంగుళూర్ సిల్క్ మాత్రమే ఇలా పాపులర్ అయ్యాయి.) చక్కటి పెర్సనాలిటీతో హీరోయిన్ చీర కట్టుకున్న విధానం, ఆ రోజుల్లో ఒక క్రేజ్ కెరటాన్ని సృష్టించింది. జనం కేవలం ఆ చీరల్ని చూడటానికే ఆ చిత్రానికి వెళ్ళారన్నా అతిశయోక్తి లేదు. వీటిని TIE & DIE చీరలని కూడా అంటారు. బట్టలో రాయి పెట్టి కట్టేసి, రంగు అవసరం లేనిచోట రాయి మీద పాలితిన్ కవర్ పెట్టి రంగులో ముంచటం వల్ల వీటికి టై అండ్ డై చీరలని పేరొచ్చింది.

ఒక మోస్తరు షిఫాను మీద ప్రారంభమైన యీ చీరలు, వాణిశ్రీ పుణ్యమా అని పాపులర్ అయ్యి, ఇతరములైన కాటన్, సిల్క్ ల మీద కూడా ప్రింట్ చేయబడ్డాయి. చివరికి అన్ని ఫాషన్ల లాగే ఇవీ కాలగర్భంలో కలిసిపోయాయి.

ఆడవాళ్ళ ఫాషన్లు రోజురోజుకీ మారిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళ ‘మారబోయే కోర్కెలని’ ఆరు నెలల ముందుగా పట్టుకో గలిగినవాడే నిజమైన బట్టల వ్యాపారి! అందుకే రిసెర్చి డిపార్ట్‌మెంట్ మీద అంత ఖర్చు! భారతదేశంలో ప్రతి స్త్రీకి నప్పే చీర కనీసం ఒకటన్నా ఆ ఫాక్టరీ లో తయారవ్వాలి. లేకపోతే రిసెర్చి మీద ఇన్ని లక్షల ఖర్చు అనవసరం.

కాబట్టి… ‘నప్పవు’ అన్న ప్రశ్నే లేదు.

రవితేజ అహం దెబ్బతిన్నది.

yandamuri

“ఎందుకు నప్పవు? నాతో రా నేను సెలెక్టు చేస్తాను. విమల్, గార్డెన్ వెరైటీల్లో ఎన్ని రకాలున్నాయో, మన కంపెనీలోనూ అన్ని వెరైటీలున్నాయి.”

“ఏమఖ్కర్లేదు. ఫ్రీగా వచ్చినాయని అందరూ దెప్పి పొడవటానికా?”

“ఫ్రీ ఏమిటి?”

ఆమెకి అసలు విషయం చెప్పక తప్పలేదు. వింటో౦టే అతడికి నవ్వొచ్చింది. తన చీరలకి వంక పెట్టినందుకు కోపం కూడా వచ్చింది.

“చూడు మాధవీ! నువ్వు పొట్టిగా ఉంటావు. కుచ్చిళ్ళు ఎక్కువ పెట్టుకోవద్దని లక్షసార్లు చెప్పాను, పెద్ద పూసలు, ఎక్కువ నగలు పెట్టుకోకూడదని కూడా చెప్పాను. నువ్వు విన్లేదు. అంత వరకూ ఎందుకు? లావుగా ఉన్నవాళ్ళు ‘పెద్ద’ సైజు హాండ్-బ్యాగ్ ఉపయోగించకూడదని కూడా చెప్పాను. అదికూడా నీకు పట్టలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా పొట్టిగా ఉన్నవాళ్ళు కూర్చునేటప్పుడు కాళ్ళు రెండూ దగ్గిరగా పెట్టుకుని కూర్చోవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఈ తప్పులన్నీ నీలో పెట్టుకుని… మా చీరలని అంటావేం?”

అప్పటికే ఆమె ఏడుపు ప్రారంభించింది. “నేను లావుగా ఉన్నాననేగా… పొట్టిదాన్ననేగా….”

“చూడు మాధవీ! పొట్టి అనేది దేముడిచ్చిన శాపం. దానికి నువ్వేం చేయలేవు. కేవలం పొడుగు-పొట్టి వల్లే మనిషి అందం, ఆనందం ఆగిపోదు. కనీసం నువ్వు చేయగలిగింది కూడా చెయ్యవెందుకని?”

“ఏమిటి? ఏం చెయ్యాలి?”

“రోజుకి ఎనిమిది గంటలు నిరర్ధకంగా గడిపే బదులు ఒక్క అరగంట వ్యాయామం చెయ్యవచ్చు.”

“ఇంకా నయం. సర్కస్ లో చేరమన్నారు కాదు.”అతడికి విసుగేసింది. చాలామంది బ్రతకటం కోసం జీవిస్తారు. కొద్దిమందే జీవించటం కోసం బ్రతుకుతారు. ఆమె మొదటి టైపు. పెళ్ళయిన మొదటి రోజునుంచీ ‘పక్క మీదకు వచ్చేటప్పుడు నోట్లో ఒక యాలక్కాయ వేసుకొమ్మని’ చెపుతూనే ఉన్నాడు. ఆమె అర్ధం చేసుకోదు. అంత వరకూ ఎందుకు? ‘పౌడరు వేసుకోవలసింది మొహం మీదే కాదు. సగం అందం మెడ వల్ల వస్తుంది. మెడ వెనుక కూడా మొహమంత బాగా అద్దంలా ఉండాలి. అక్కణ్నుంచి కూడా పరిమళం రావాలి’ అన్నంత చిన్న విషయం కూడా ఆమెకి తెలీదు. తెలియక పోవటంలో తప్పు లేదు. చెప్పినా వినదు.

అతడికి జీవితంలో ప్రతీ సెకనూ అర్ధవంతంగా ఉండాలి. మరో కొత్త డిజైను కనిపెట్టాలి. అవే ఆలోచన్లు. కొంత కాలానికి మెదడు అలసిపోతోంది. అలసిన మెదడుకు విశ్రాంతి కావాలి. అది మాత్రం ఇంట్లో దొరకదు. శారీరక సుఖం కాదు. ప్రేమ కావాలి. ప్రేమకి మొదటి స్టెప్పు ‘అర్థం చేసుకోవటం’. తప్పు ఎక్కడుందో మాత్రం తెలియటం లేదు.

గులాబీ… గులాబీ… ఏ సావన్ కి ఖుష్బూ… ఖూబ్ సూరత్ నహోతా, అగర్ ఇస్ మే రంగె మొహబ్బత్ న హోతా (వర్షాకాలపు గులాబీ తోట కూడా- అందులో ‘ప్రేమ’ అంశ లేకపోతే అందంగా ఉండదు). చిన్నప్పుడు విన్న పాట అతడిని వెంటాడుతుంది.

(అప్పట్లో గూగుల్ లేదు. మా లాంటి రచయితలకి (చీరల్లా౦టి) ఒక సబ్జెక్ట్ పై విషయం సేకరి౦చటానికి ఆర్నెల్ల దాకా పట్టేది. ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ నవల (దొంగమొగుడు సినిమా) వ్రాయటానికి ఏడాది కాలం పట్టింది. ఈ పుస్తకం ఇరవయ్యో ఎడిషన్ రి-ప్రింట్ కి వస్తూన్న సందర్భంగా)….



(యండమూరి శైలి ఎప్పుడూ పఠనంలో పరుగులు తీయించేదే… ఈ నవల ఓ డిఫరెంట్ సబ్జెక్ట్… అయితే నవలకూ, ఆ సినిమాకూ అస్సలు పోలిక ఉండదు, సినిమా అనేసరికి నానా మసాలా వాసనలు గుప్పించేసరికి, అసలిది ఆ నవల కథేనా అనిపించేలా తయారైంది వంటకం… సినిమాలో మాధవి అందగత్తె, స్లిమ్ పర్సనాలిటీ, పొట్టీ కాదు… జస్ట్, సరదాగా ఉదాహరణ కోసం…. ముచ్చట)



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions