నిను వీడని నేనే… అన్నట్టుగా రాహుల్ గాంధీ వెంట పడుతోంది స్మృతీ ఇరానీ..! 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఆమేథీలో ఆమె గెలుపు బీజేపీ క్యాంపులో ఓ ఆనంద సందర్భం… కాకపోతే దీన్ని సందేహించిన రాహుల్ మైనారిటీ వోట్లు అధికంగా ఉన్న వయనాడులో పోటీచేసి, గెలిచి లోకసభలోకి మళ్లీ వచ్చాడు… ఇప్పుడు కూడా ఆమేథీకి మళ్లీ రాదలుచుకోలేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మళ్లీ వయనాడుకే జై అంటున్నాడు…
ఆమేథీలో మరో పాపులర్ పర్సనాలిటీని నిలబెట్టడమో లేక తమ మిత్రపక్షం సమాజ్‌వాదీకి అప్పగించడమో జరుగుతుంది… సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ… నలుగురు గాంధీల అడ్డా ఇప్పుడు గాంధీరహితమై పోయింది… వయనాడులో గత ఎన్నికల్లో రాహుల్ 4 లక్షల వోట్లతో గెలుపొందాడు… బుధవారం రాహుల్ గాంధీ నామినేషన్లు కాగా, బీజేపీ తన అభ్యర్థిగా కేరళ పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్‌ను నిలబెడుతోంది… గురువారం ఆయన నామినేషన్లు…
ఆ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి స్మృతీ ఇరానీ హాజరు కావడంతోపాటు, తరువాత కూడా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ… గెలుస్తామని కాదు… రాహుల్ గాంధీని తేలికగా గెలవనివ్వకూడదనేదే ఉద్దేశం… (బళ్లారిలో సోనియాగాంధీ మీద సుష్మాస్వరాజ్ పోటీ గుర్తుంది కదా…) సురేంద్రన్ గతంలో మూడుసార్లు లోకసభ ఎన్నికల్లో, ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు,.. అబ్బే, స్మృతీ ఇరానీ ప్రచారం, సాయం ఏం ఉపయోగపడుతుందీ అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ ఔట్ సైడర్ కాదా అని ఎదురు ప్రశ్న వేస్తోంది బీజేపీ…
Ads
అంతేకాదు, ఆమేథీ నుంచి వయనాడుకు పారిపోయిన రాహుల్ గాంధీకి మళ్లీ ఆమేథీకి వచ్చే సాహసం లేదని కూడా వెక్కిరిస్తోంది… వయనాడులో 32 శాతం ముస్లింలు, 13 శాతం క్రిస్టియన్ల వోట్లు ఉండటంతో దీన్ని సేఫ్ సీటుగా భావిస్తోంది కాంగ్రెస్… గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి మీద గెలిచాడు రాహుల్… అక్కడ ఎన్డీయే అభ్యర్థిగా పోటీలో ఉన్న తుషార్ వెల్లపల్లి కేవలం 6.2 శాతం వోట్లు సాధించి డిపాజిట్ పోగొట్టుకున్నాడు…
పర్లేదు, ఆమేథీలో 2004, 2009 ఎన్నికల్లో రెండేసి లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ 2014 లో లక్ష వోట్ల మెజారిటీకి పడిపోయి, 2019లో 55 వేల వోట్లతో ఓడిపోలేదా..? వయనాడులో కూడా ఆ తరహా పోరాటం ఉంటుందనీ, స్మృతీ ఇరానీని అక్కడ సురేంద్రన్‌కు సాయంగా పంపించడం వెనుక ఉద్దేశం అదేననీ కేరళ బీజేపీ చెబుతోంది…
వయనాడు 2009, 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సీటే… కాంగ్రెస్ నాయకుడు షానవాస్ 2018లో మరణించడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది, రాహుల్ అక్కడ చేరాడు… ఈసారి కూడా ఇక్కడ సీపీఐ అభ్యర్థి ఉంటుంది, పాపులర్ పేరే, అన్నే రాజా..! (పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య)… పదే పదే గత ఐదేళ్ల ఆమేథీ డెవలప్‌మెంట్‌ను ప్రస్తావించడం, ఏకంగా స్మృతీ ఇరానీ ప్రచారానికి పంపించే ప్లాన్, వయనాడులో రాహుల్ గాంధీ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ లేవని ప్రచారం, అసలు తను ఆ నియోజకవర్గానికే సరిగా రాడనే ప్రచారం గట్రా రాహుల్ గాంధీ పుండు మీద కారం జల్లడం అన్నమాట…
కేరళ, కర్నాటక, తమిళనాడు బోర్డర్ నియోజకవర్గం ఇది… పల్లెలపై ఏనుగుల దాడి ఎక్కువే… అందుకే సురేంద్రన్ వ్యంగ్యంగా ‘ఇక్కడికి రాహుల్ గాంధీకన్నా ఏనుగులే ఎక్కువగా వస్తుంటాయి’ అని వెక్కిరిస్తున్నాడు… ఆమధ్య వయనాడు పర్యటనకు వచ్చిన స్మృతీ ఇరానీ ఇక్కడి వోటర్లకు పరిచయమే… ‘ఆమేథీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు..?’ అదీ ఆమె పదే పదే అడగబోయే ప్రశ్న ఇక్కడ… 2022లో కూడా వచ్చింది ఆమె… సెంట్రల్ స్కీమ్స్ సమీక్షించిన ఆమె (కేంద్ర మంత్రి) కనీసం మహిళలకు ఉద్దేశించిన పథకాలనైనా సరిగ్గా అమలు చేయించలేకపోయాడు అని ఆక్షేపించింది… మొత్తానికి వయనాడులో రాహుల్ గెలుపు మీద ఎవరికీ ఏ సందేహాలూ లేవు… కానీ అక్కడ సాగే ప్రచార యుద్ధం మీదే అందరికీ ఆసక్తి ఇప్పుడు..!!
Share this Article