.
మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ప్రసిద్ధ నవల “నత్తలొస్తున్నాయి జాగ్రత్త!” గుర్తుందా..? ఇది ఒక జులాజికల్ ఫాంటసీ (Zoological Fantasy) నవల… ఆహార ప్రియుడు ఒకరు విదేశాల నుంచి ఓ రాక్షస నత్తను తీసుకొస్తాడు రహస్యంగా దేశంలోకి…
అది కాస్తా సంతతి విపరీతంగా పెంచుకుని, ఏది దొరికితే అది తినేస్తూ దేశాన్నే ప్రమాదంలోకి పడేస్తుంది… పిడికిలి పరిమాణంలో ఉండే రాక్షస నత్తలు బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు అన్నంత భయంకరంగా వర్ణిస్తాడు రచయిత…
Ads
ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్‌లో అలాంటిదే ఓ వార్త కనిపించింది నిన్న… ఆప్రికా నత్తలుగా పిలిచే జీవులు ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో రైతులను హడలగొడుతున్నాయి… కేరళలో మొదటిసారి ఇవి కనిపించాయి… ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పెంట్లం, సింగరాజుపాలెం, ఆవపాడు తదితర ఊళ్లలో విస్తృతంగా కనిపిస్తున్నాయి…
వందలు, వేలు… ఇదొక ఆశ్చర్యం… పంటలను నష్టపరిచేవి, చెట్లను ఆశించేవి సాధారణంగా ఏమిటి..? కీటకాలు, శిలీంధ్రాలు ఎట్సెట్రా… ఎలుకలు, పందికొక్కులు, ఇప్పుడు కోతులు కూడా… కానీ ఈ నత్తలు నిమ్మ, కోకో, పామాయిల్, జామ తోటల్లో జొరబడి, కాండాలను పట్టుకుని, రసాన్నీ పీల్చేస్తున్నాయి, అవి ఎండిపోతున్నాయి…
గడ్డి, ఆకులు, చిగుళ్లు, లేత మొక్కలను కూడా తినేస్తున్నాయి… మొదట్లో స్వల్ప సంఖ్యలో కనిపిస్తే పురుగుల మందులు కొట్టారు… చనిపోలేదు… ఏరి, కుప్ప పోసి తగులబెట్టారు… ఆగలేదు… సంఖ్య పెరుగుతూనే ఉంది… ఈ ప్రాంతంలోనే గాకుండా పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలంలోని బొప్పాయి తోటలనూ భక్షించాయి ఇవి…
- ఈ వార్తలో ఆడ్‌గా అనిపించింది ఏమిటంటే..? వీటిని కీటకాల జాతిగా పరిగణిస్తూ, కీటకనాశినులు (ఇన్‌సెక్టిసైడ్లు) వాడితే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారనే వాక్యం… అది తప్పు, నత్తలు కీటకాల జాతి కాదు… జంతుశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే… కీటకాలు ఆర్డ్రోపోడా జాతి, నత్తలు మొలస్కా జాతి… కీటకాలకు ఆరు కాళ్లు, కొన్నింటికి రెక్కలు ఉంటే, నత్తలకు ఒకే పాదం, పైన షెల్ ఉంటాయి… పూర్తిగా వేరు… సో, కీటకనాశినులు చల్లితే అవి చస్తాయనేది సందేహమే…
ఒకటి మాత్రం నిజం… వీటి సంతానోత్పత్తి రేటు, వేగం ఎక్కువ… అందుకని రైతులు సామూహికంగా వీటి నివారణ చేపట్టాలి… ఒక్కొక్కరు విడివిడిగా చేపడితే పక్క తోటల్లోకి వెళ్లి మరింత విజృంభిస్తాయి… అన్నింటికీ మించి ఈ బెడద నివారణకు సరైన శాస్త్రీయ విధానం ఏమిటో యూనివర్శిటీ సైంటిస్టులు తేల్చాలి… ప్రయోగాలతో..!!
Share this Article